శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - Aug 25, 2020 , 23:09:34

దారిచూపే దూర విద్య

దారిచూపే దూర విద్య

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న విషయం తెలిసిందే. కొవిడ్‌-19 కాలంలో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. సమాచార సాంకేతిక విప్లవం వినూత్న అధ్యయన, బోధనా పద్ధతులను, ఆధునిక మాధ్యమాల ద్వారా మనకు అందిస్తున్నది. విద్యాబోధన, పంపిణీలో విధాన రూపకర్తలకు ఇది కొత్త సవాళ్ళు విసురుతున్నది. ఈ నేపథ్యంలో.. ఈ-లెర్నింగ్‌ పరిష్కారాలను నిర్ధారిస్తూ, డిజిటల్‌ డివైడ్‌ను పరిగణనలోకి తీసుకుంటూ విద్యావిధానాన్ని ముందుకు నడిపేందుకు కొత్త దారులు వెతకాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

టెక్నాలజీ ఆధారిత బోధన, అభ్యాసం కొత్త విషయమేం కాదు. రేడియో, టెలివిజన్‌, ఇంటర్నెట్‌, వరల్డ్‌ వైడ్‌ వెబ్‌, మొబైల్‌ టెక్నాలజీ.. అభ్యాస వాతావరణంలో అనేక మార్పులు తీసుకొచ్చాయి. ఉపాధ్యాయ కేంద్రీకృత ‘గురుకుల్‌' తరగతి గది ముఖాముఖి విద్య నుంచి, అభ్యాస కేంద్రీకృత ఓపెన్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ వ్యవస్థను టెక్నాలజీ మనకు పరిచయం చేసింది. దీంతో చదువు ఇప్పుడు ఎక్కడైనా, ఎప్పుడైనా సాధ్యమవుతున్నది. ఇవ్వాళ నిరంతర విద్య కెరీర్‌, వృత్తిపరమైన అభివృద్ధి, ఉపాధ్యాయ శిక్షణ కోసం అవసరమైన పరిష్కారాలను అందించేందుకు ‘దూర విద్యా విధానం’ ఎంతో సహాయకారిగా మారింది.

ఓపెన్‌ యూనివర్సిటీ అనే భావన మొట్టమొదటిసారి 1926లో జె.సి.స్టోబార్ట్‌ అనే విద్యావేత్త ఆలోచనల్లోంచి పుట్టింది. ప్రపంచంలోనే మొదటి ఓపెన్‌ యూనివర్సిటీని 1969లో స్థాపించారు.  తొలి ఛాన్స్‌లర్‌గా బాధ్యతలు చేపట్టిన లార్డ్‌ క్రౌథర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అనేది విద్యార్థులకు ఎల్లవేళలా ద్వారాలు తెరిచి ఉంచాలని చెప్పారు. ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా దూరవిద్య విధానాన్ని తర్వాత భారత్‌లో ప్రవేశపెట్టడం విశేషం.

దేశంలో ఓపెన్‌ యూనివర్సిటీ వ్యవస్థ ద్వారా కరస్పాండెన్స్‌ విద్యను బలోపేతం చేసే దిశగా ఆలోచించారు. విద్య, సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ డిసెంబర్‌ 1970లో, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సహకారంతో ఒక సదస్సు నిర్వహించింది. సదస్సును ప్రారంభించిన అప్పటి విద్యాశాఖ మంత్రి ప్రొఫెసర్‌ వి.కె.ఆర్‌.వి.రావు భారతదేశంలో ఓపెన్‌ యూనివర్సిటీ స్థాపించాలనే ఆలోచనను వ్యక్తపరిచారు. ఆయన ఆలోచనను సెమినార్‌ కుడా గట్టిగా సిఫారసు చేసింది. దీంతో వెంటనే ప్రభుత్వం ఓ వర్కింగ్‌ గ్రూప్‌ను నియమించింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి అప్పటి వీసీ జి.పార్థసారథిని వర్కింగ్‌ గ్రూప్‌ చైర్మన్‌గా నియమించారు. అన్నీ పరిశీలించిన కమిటీ.. 1975లో ఓపెన్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది.

దురదృష్టవశాత్తు ఈ కమిటీ సిఫారసులపై వెంటనే చర్యలు తీసుకోలేదు. 1982లో కేంద్ర యూనివర్సిటీల పనితీరుపై విచారణ జరిపేందుకు డాక్టర్‌ మాధురి, ఆర్‌.షా అధ్యక్షతన ఓ కమిటీని నియమించారు. దీంతో మరోసారి పార్థసారథి కమిటీ సిఫారసులు తెరపైకి వచ్చాయి. ఆలస్యం చేయకుండా ఓపెన్‌ యూనివర్సిటీని ప్రారంభించాలని కమిటీ గట్టిగా అభిప్రాయపడింది. దీంతో దేశంలో మొట్టమొదటి ఓపెన్‌ యూనివర్సిటీ ‘డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ’ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఉనికిలోకి వచ్చింది. ప్రొఫెసర్‌ జి.రామ్‌రెడ్డి ప్రయత్నాల ఫలితంగా, 1982 ఆగస్టు 26న రాష్ట్ర శాసనసభ (ఏపీఓయూ చట్టం 1982) ద్వారా ఈ వర్సిటీ ఏర్పాటైంది. యూనివర్సిటీ అందించే అన్ని యూజీ, పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ కార్యక్రమాలను యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ గుర్తించింది. విద్యావ్యాప్తికి ఎంతో కృషిచేస్తున్న ఓపెన్‌ యూనివర్సిటీ ‘అందరికీ విద్య’ నినాదంతో ముందుకుపోతున్నది.

దూరవిద్య విధానం ద్వారా గృహిణులు, రైతులు, కార్మికులు, జవాన్లు, పోలీసులు మొదలైనవారు ఉన్నత విద్యను పొందుతున్నారు. దాంతో వారు కొత్త నైపుణ్యాలు, అధిక విద్యార్హతలు పొందే వీలు కలిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో విస్తరించి ఉన్న 213 అధ్యయన కేంద్రాల విస్తృత నెట్‌వర్క్‌ ద్వారా విశ్వవిద్యాలయం విద్యార్థి లోకానికి సేవలందిస్తున్నది. 23 ప్రాంతీయ సమన్వయ కేంద్రాలు అందులో మహిళల కోసమే ప్రత్యేకంగా 14 కేంద్రాలను నడుపుతున్నది. ఖైదీలు కూడా దూరవిద్య ద్వారా చదువుకోవటం విశేషం. వారి కోసం చెర్లపల్లి, వరంగల్‌, రాజమండ్రి, విశాఖపట్నం, కడప, నెల్లూరు తదితర సెంట్రల్‌ జైళ్లల్లో ప్రత్యేక అధ్యయన కేంద్రాలు ఏర్పాటుచేశారు.

ఆల్‌ ఇండియా రేడియోలో ఆడియో ప్రోగ్రామ్‌లు, దూరదర్శన్‌లో వీడియో ప్రోగ్రామ్‌లను ప్రసారం చేయడానికి ఆడియో, వీడియో ప్రొడక్షన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను 1986లో స్థాపించారు. అవసరమైనవారికి వారి ఇంటివద్దే విద్యను అందించడానికి దూరదర్శన్‌లో ప్రతి ఆదివారం ‘ఇంటరాక్టివ్‌ లైవ్‌ టెలి కాన్ఫరెన్సింగ్‌' కార్యక్ర మాన్ని డిసెంబర్‌ 1999లో ప్రారంభించారు. మారుతున్న కాలంతో పాటు తన సేవలను అభ్యాసకులకు అందించటానికి ఓపెన్‌ యూనివర్సిటీ కొత్త కొత్త సాంకేతికతలను అనుసరిస్తున్నది. ఒక్క క్లిక్‌ ద్వారా విద్యార్థులకు విద్యను అందించడం కోసం విశ్వవిద్యాలయం 2013లో ఆన్‌లైన్‌ సేవలను ప్రారంభించింది. అడ్మిషన్లు మొదలు అన్నింటినీ ఆన్‌లైన్‌ సేవల ద్వారా అందజేస్తున్నారు.

నేడు దేశంలో ఒక నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, 14 స్టేట్‌ ఓపెన్‌ యూనివర్సిటీలు ఉన్నాయి. కొవిడ్‌ కారణంగా సాంప్రదాయక వర్సిటీలు వారి విద్యావిధానాలను ఓపెన్‌ యూనివర్సిటీల పనితీరుతో ప్రేరణ పొంది మార్చుకుంటున్నాయి. మన వర్సిటీలు ప్రస్తుత సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని  దీర్ఘకాలిక ప్రణాళికలతో ఉన్నత విద్య అందరికీ మరింత చేరువయ్యేలా చూడాలి.

(వ్యాసకర్త: డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ప్రభుత్వ పాలన శాస్త్ర విభాగ అధిపతి)

డాక్టర్‌ పల్లవి కాబ్డే


logo