బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - Aug 25, 2020 , 23:09:34

విమర్శనాత్మక ధోరణి

విమర్శనాత్మక ధోరణి

  • ఏడో అధ్యాయం కొనసాగింపు..

అవి సఫలం కానప్పుడు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన విషయంలో ఏకాభిప్రాయం సాధన కోసం కృషిచేయటం జరిగింది. ప్రత్యామ్నాయంగా రాజ్యాంగంలోని అధికరణం 138 (2), అధికరణం 143 కింద చర్యలు గైకొనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సూచించింది. వివాద పరిష్కారం రాజ్యాంగంలోని అధికరణం 139, అధికరణం 142ల ద్వారా సుప్రీంకోర్టుకు అప్పగించే సూచన చేయటమూ జరిగింది. ఈ సూచనపై కూడా వాళ్లు ఏకాభిప్రాయానికి రాలేదు. అధికరణం 138 (2) కింద సుప్రీంకోర్టు పరిధిని పెంచేందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అంగీకరించలేదు. రాజ్యాంగ నియమావళి ప్రకారం అటువంటి అంగీకారం తప్పనిసరి.

కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిష్టంభనను తొలిగించేందుకు చర్చలు కొనసాగించేందుకు తన వైపు నుంచి కృతనిశ్చయంతోనే ఉంది. జీ-15 సమావేశానికి వెళ్లే ముందుగా నేను కళ్యాణ్‌సింగ్‌తో 18న, తిరిగి 19న సమావేశమయ్యాను. కళ్యాణ్‌సింగ్‌ తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే రీతిలో వ్యవహరించసాగారు. ఆ సమస్య సమగ్రమైన పరిష్కారం వివాదంలో ఉన్న కట్టడాన్ని హిందువులకు అప్పగించటం ద్వారానే లభిస్తుందంటున్నారు. నవంబర్‌ 20వ తేదీన ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ ఈ విధంగా వార్తను ప్రచురించింది. ‘వివాదంలో ఉన్న కట్టడానికి 15-20 కిలోమీటర్ల దూరంలో మసీదును నిర్మించేందుకు ముస్లింలను ఒప్పించేట్లు చూడమనీ, అలా ఒప్పుకునేట్లయితే యూపీ ప్రభు త్వం దానికి అవసరమైన స్థలాన్ని కేటాయించటమే గాక, ఇతర సహాయాన్ని కూడా అందించగలదనీ ముఖ్యమంత్రి శ్రీ రావుకు చెప్పటం జరిగింది’. చివరి క్షణంలో ఈ విధమైన తకరారుకు దారితీసిన ఉద్దేశాలను గ్రహించటం అంత కష్టమైన పనేం కాదు.

ఆ దినపత్రిక ఇంకా ఏమని వార్తనందించిందంటే.. ‘2.77 ఎకరాల స్థలం విషయంలో ముస్లింలు షరతులేమీ పెట్టుకోలేదని కళ్యాణ్‌సింగ్‌-రావుకు తెలియజేశారు. కనుక ఆ ప్రదేశంలో కరసేవ నిర్వహించేందుకు ఏ విధమైన అడ్డంకుల్లేవు. ముఖ్యమంత్రి 2.77 ఎకరాల స్థల సేకరణ విషయంలో తమ తీర్పును వెలువరించాల్సిందిగా అలహాబాద్‌ హైకోర్టుకు విజ్ఞప్తి చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధమైన విజ్ఞప్తిని కోర్టుకు పంపగలమని చెప్పారు’.

వెనువెంటనే కేంద్ర ప్రభుత్వ మంత్రిమండలికి చెందిన రాజకీయ వ్యవహారాల ఉప సంఘ సమావేశం ఏర్పాటు చేయబడింది. దేశంలో సున్నితమైన శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసేందుకు విషయాన్ని పలు కోణాలనుంచి పరిశీలించటం జరిగింది. రకరకాల ప్రత్యామ్నాయాలను పరిశీలించటం జరిగింది. దాంతోపాటు కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా 2.77 ఎకరాల స్థలాన్ని వివాద స్థలం నుంచి విడగొట్టి డిసెంబరు 6 నుంచి కరసేవ ప్రారంభించాలనే బీజేపీ వైఖరి సమర్థనీయం కాదని భావించటం జరిగింది. ఈ పరిస్థితుల్లో స్వల్పకాలిక నోటీసు ద్వారా నేను నవంబరు 23వ తేదీనే జాతీయ సమైక్యతా మండలి సమావేశాన్ని ఏర్పాటుచేయాలని నిశ్చయించుకున్నాను. విసిగివేసారేట్లు చేసే ఈ సమస్యకు చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొనాలనే ప్రభుత్వ కోరికకు అనుగుణంగా ఆ సమావేశం విస్తృత చర్చలకు వేదిక కాగలదనుకున్నాను. 

బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ ఆ నిర్ణయాన్ని స్వాగతించగా బీజేపీ ఆ సమావేశానికి హాజరయ్యేందుకు నిరాకరించింది. బీజేపీ జాతీయ కార్యవర్గం వాదన ఏమంటే.. జాతీయ సమైక్యతా మండలి ఈ విషయమై పలు పర్యాయాలు సమావేశమై చర్చించింది. మరో చర్చ జరిపినందువల్ల ఒరగబోయేదేమీ ఉండదంది. వీహెచ్‌పీ ఇంకొంచెం ముందుకెళ్లి.. ‘జాతీయ సమైక్యతా మండలి అధికతమంగా హిందూ వ్యతిరేక శక్తులకు ప్రాతినిధ్యం వహిస్తూంది’; దాని అధ్యక్షులు విష్ణుహరి దాల్మియా పత్రికల వాళ్లతో మాట్లాడుతూ.. చెప్పిందేమంటే ప్రధానంగా ముస్లింలను బుజ్జగించేందుకే ప్రభుత్వం జాతీయ సమైక్యతా మండలి సమావేశాన్ని ఏర్పాటుచేయటమని. ఇంకా దాల్మియా ఏమని చెప్పారంటే.. అంతకు ముందురోజు యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌సింగ్‌ ప్రధానితో మాట్లాడిన సందర్భంగా హిందువుల పట్ల కేంద్రం కఠిన వైఖరి అవలంబించబోతున్నట్లుగా అభిప్రాయం కలిగిందని. అంతేగాక వీహెచ్‌ దాల్మియా, వీహెచ్‌పీ జనరల్‌ సెక్రటరీ అశోక్‌ సింఘాల్‌, జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ గిరిరాజ్‌ కిశోర్‌లు ఒక సంయుక్త ప్రకటనలో ఇలా తెలియజేశారు.. ‘అయోధ్యలో కరసేవ ప్రారంభించాలనుకున్న డిసెంబర్‌ 6వ తేదీ నాటికి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని రద్దుచేసినా, వీహెచ్‌పీ నాయకత్వంపై విరుచుకుపడ్డా కరసేవకులను మాత్రం ఎలా వీలైతే అలా అయోధ్యకు చేరుకోమన్నారు. 

కరసేవకు పిలుపు ఇచ్చిన నాటినుంచి విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌తో సహా సంఘ్‌పరివార్‌ నాయకులందరు సాధువులు, మహంతులు తలపెట్టిన దానికి మద్దతు పలుకుతూ ప్రకటనలు గుప్పించారు. అలా ప్రకటనలు చేసిన వారిలో అశోక్‌ సింఘాల్‌, పరమహంస రామచంద్ర, ఎల్‌కే అద్వానీ, వీహెచ్‌ దాల్మియా, కళ్యాణ్‌సింగ్‌, ప్రొఫెసర్‌ రాజేంద్రసింగ్‌, మహంత్‌ అవైద్యనాథ్‌, గిరిరాజ్‌ కిశోర్‌, మురళీ మనోహర్‌జోషీ, గోవిందాచార్య, సచ్చిదానంద సాక్షి, మహంత్‌ సేవాదాస్‌ మున్నగువారున్నారు. ఈ ప్రకటనలకు చెందిన నివేదికలు నిత్యం వార్తాపత్రికల్లో వెలువడుతూ ఉండేవి. కరసేవను నిలిపివేసినా, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని రద్దుచేసినా జరుగబోయే పరిణామాలను గూర్చిన బెదిరింపుల్లో వివాదాస్పద కట్టడం ప్రస్తావనా చోటుచేసుకునేది. కరసేవ విషయంలో జోక్యాన్ని గట్టిగా ప్రతిఘటిస్తామనే ప్రకటనలూ ఉండేవి. సుప్రీంకోర్టు ముందు కోర్టు ధిక్కారనేరం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సేకరించిన స్థలంలో నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడంగానీ, నిర్మాణ సామాగ్రిని చేరవేయటం గానీ జరుగదని  హామీనిచ్చిన తర్వాత కూడా ఈ విధమైన ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. సంఘపరివార్‌కు చెందిన పలువురు ప్రతినిధులు సుప్రీంకోర్టు ఉత్తర్వుల పట్ల విమర్శనాత్మక ధోరణిని అవలంబించారు. 

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి)


logo