మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Editorial - Aug 24, 2020 , 23:29:25

సమతుల్యత పాటించిన పీవీ

సమతుల్యత పాటించిన పీవీ

వరంగల్లు పట్టణం (కాజీపేట నుంచి వరంగల్లు కోట, ఉర్సు-కరీమాబాద్‌ వరకు నాలుగు పట్టణాల నయగారపు హారం) హైదరాబాద్‌ నగరం వలె వరదల ప్రమాదాన్ని ఎన్నడూ ఎదుర్కోలేదు. వరంగల్లు పట్టణంలో మొదటి నుంచి ఎండల తీవ్రత చాల ఎక్కువ. వేసవిసెలవులలో సొంతూరు వరంగల్‌ వెళ్లిన వాళ్లం అక్కడి ఎండల తీవ్రతను తట్టుకోలేక తిరిగిహైదరాబాద్‌ వచ్చేవాళ్లం. హైదరాబాద్‌ నగరం మగ్దూమ్‌ మహాకవి వర్ణించిన చంబేలీ మండ్వ వలె చల్లగా ఉండేది.

ముక్తసరి కాలమ్‌ 2015 అక్టోబర్‌ లో మొదలయింది. అప్పటి నుంచి ఏటా జూన్‌లో, ఈ కాలమ్‌ పీవీకి వినయ పూర్వకంగా, ఉడతా భక్తిగా అక్షర శ్రద్ధాంజలి ఘటిస్తున్నది. 2017 జూన్‌ 24వ తేదీన ముక్తసరి కాలమ్‌ హెడ్డింగ్‌ కాలదోషం పట్టని మార్గదర్శకుడు పీ.వీ. కాలదోషం పట్టని మహా నాయకుడు, మార్గదర్శకుడు కనుకనే పీవీ శత జయంతి ఉత్సవాలను గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘనంగా, సముచితంగా, చరిత్రాత్మకంగా నిర్వహిస్తున్నారు. నభూతో నభవిష్యతి అన్నట్లుగా తెలంగాణ బిడ్డ పీవీ శతజయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రంలో, దేశమంతటా, ఇతర దేశాలలో జేగీయమానంగా నిర్వహించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృఢ సంకల్పం. ఇది ఇంత వరకు దేశంలో ఎవరికీ కలుగని సంకల్పం. ఎవరి బిడ్డలు వారికి సహజంగా ముద్దు. తమ బిడ్డ కమలా హారిస్‌ అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా ఎంపికయినందుకు ప్రపంచంలోని తమిళులందరు సంతోషపడుతున్నారు. 

అధ్యక్ష పదవికి డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా ఎంపికయిన జో బిడెన్‌కు (అధ్యక్షుడు ఒబామా హయాంలో బిడెన్‌ ఉపాధ్యక్షుడు) కమలా హారిస్‌ అండగా ఉంటుందని ఒబామా, బిల్‌ క్లింటన్‌, హిల్లరీ క్లింటన్‌ తదితర డెమొక్రటిక్‌ పార్టీ నాయకులందరు దృఢంగా విశ్వసిస్తున్నారు. కొందరు రిపబ్లికన్‌ పార్టీ నాయకులు కూడా జో బిడెన్‌కు మద్దతు ప్రకటించడం విశేషం. కరోనా వైరస్‌ కమ్యూనిస్టు చైనా నుంచి వచ్చిందన్న ప్రచారంతో ట్రంప్‌ రానున్న ఎన్నికలలో లబ్ధి పొందాలనుకున్నారు. ఈ ప్రచారంలో భాగంగానే ట్రంప్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులను నిలిపివేశారు. ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా ఏజెంటు అన్నట్టుగా ప్రకటనలు జారీచేసారు. చైనాను ఎంతగా ద్వేషిస్తే అధ్యక్ష పదవికి తన గెలుపు అంత సులభమని ట్రంప్‌ భావించి ఉంటారు. ట్రంప్‌, మోదీజీల దోస్తీ బాగా ప్రచారమయింది. 2020 ఫిబ్రవరి మొదటి వారంలో అమెరికాలో కరోనా మరణాలు వెలుగులోకి వచ్చినప్పటికీ, ఫిబ్రవరి చివరి వారంలో ట్రంప్‌ సపరివారంగా ఇండియా వచ్చి వెళ్లారు. అప్పుడు అహమ్మదాబాద్‌లో ట్రంప్‌నకు మన దేశంలోని పేదరికం కన్పించకుండా మోడీజీ గోడలు కట్టించారు.

జమ్మూ -కశ్మీరులో 370 వ ఆర్టికల్‌ రద్దు, చైనాతో సరిహద్దు వివాదం వంటివి భారతదేశం అంతర్గత సమస్యలని మోదీజీ అంటారు. అయినా ఈ సమస్యలలో మధ్యవర్తిత్వం జరుపడానికి సిద్ధమని ట్రంప్‌ అంటున్నారు. ఇండియాపై చైనా ఈగ వాలినా చేతులు ముడుచుకుని కూర్చోబోమని, సప్తమ నౌకాదళాన్ని పంపిస్తానని, ఆటమ్‌ బాంబులు వేస్తానని ట్రంప్‌ హెచ్చరించారు. ట్రంప్‌ హెచ్చరికలు చైనాకు తాటాకు చప్పుళ్లవలె విన్పించాయి. ట్రంప్‌ను మరోసారి గెల్పించాలని అమెరికన్‌ భారతీయులను కోరడానికి మోదీజీ గత సెప్టెంబర్‌లో హూస్టన్‌ వెళ్లి వచ్చారు. అమెరికా ఎన్నికల రాజకీయాలలో వేలు పెట్టిన మొదటి భారత ప్రధాని మోదీజీ. మన శాశ్వత ప్రయోజనాల దృష్ట్యా అమెరికా, చైనాలలో ఏ దేశంతో స్నేహం ముఖ్యమో తెలుసుకోవడానికి భారత ప్రజలు మాజీ ప్రధాని, సాటిలేని రాజనీతిజ్ఞుడు పీవీ విదేశాంగ విధానాన్ని ఒక పాఠంగా పరికించాలె. పీవీ ఈ రెండు దేశాలతో సమాన రీతిలో సఖ్యత కొనసాగించి అసాధారణ విజ్ఞత ప్రదర్శించారు. భారతదేశానికి చైనా శాశ్వత సమస్య. తన సమస్యల వలయంలో చిక్కుకుని గిలగిలలాడుతున్న ట్రంప్‌ మన సమస్యలను పరిష్కరిస్తాడనుకోవడం భ్రమ. వాస్తవాధీన రేఖను చైనా క్రమంగా మన భూభాగంలోకి విస్తరింపచేస్తున్నదన్నది ఇటీవలి చరిత్ర. మన భూభాగం అంగుళమయినా చైనా ఆక్రమణలో లేదనడం ఆత్మవంచన చేసుకోవడం.

కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభంలో-గత మార్చి, ఏప్రిల్‌ మాసాలలో రాష్ట్ర ప్రజలకు ఈ వైరస్‌ తీవ్రతను తట్టుకోగల ధైర్యాన్ని, మానసిక శక్తిని  ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మాటలతో, హిత వాక్యాలతో కలిగించారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న చికిత్స, వ్యాధి నిరోధక చర్యలతో పాటు ఇది కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా, తెలంగాణ కుటుంబం పెద్దగా నిర్వహిచిన అసాధారణ, అద్వితీయ పాత్ర. ఒకవంక కరోనా విజృంభణ నివారణకు నడుం బిగించి, మరోవంక వ్యావసాయిక అభివృద్ధిపై  ముఖ్యమంత్రి దృష్టిని కేంద్రీకరించారు. కరోనా వైరస్‌ లక్షల మంది ప్రాణాలను హరిస్తూ సకల ప్రపంచానికి అమిత ఆందోళన కల్గిస్తున్నా, మన దేశంలో మాత్రం రాజకీయ కుతంత్రాలు యథాతథంగా కొనసాగడం, ఈ రాజకీయ కుతంత్రాలలో రాష్ర్టాల గవర్నర్లు ముఖ్య పాత్ర నిర్వహిస్తూ, షికాయతీవాలాలుగా ఉపయోగపడడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. గవర్నర్‌ పదవి అవసరమా అన్నది ప్రజాత్రంత వాదులు పరిశీలించవలసిన కీలక ప్రశ్న. సుప్రీంకోర్టు పలు సందర్భాలలో తప్పు పట్టిన తరువాత కూడా గవర్నర్లు రాజకీయాలలో తలదూర్చడం ఘోరం. గతంలో ఎన్నడూ లేని రీతిగా ప్రపంచాన్ని వణికిస్తున్న, మానవాళి అస్తిత్వానికి విఘాతం కల్గిస్తున్న కరోనా వైరస్‌కు కారణాలేమిటో మెడికో సైంటిస్టులు ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా తేల్చి చెప్పలేదు. కారణాలు ఏమిటో తెలియకుండా ఈ వైరస్‌ నిరోధానికి ఒక వ్యాక్సిన్‌ వస్తుందనుకోవడం మన బలహీనత.


logo