బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - Aug 24, 2020 , 23:29:23

మళ్ళీ కరసేవకు ప్రకటన

మళ్ళీ కరసేవకు ప్రకటన
  • ఏడో అధ్యాయం కొనసాగింపు..

1992 ఆక్టోబరు 16న జరిగిన మలి సమావేశంలో  చరిత్రకు సంబంధించి, పురాతత్వ శాస్త్రజ్ఞానానికి సంబంధించి రెండు ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. బాబ్రీ మసీదు పోరాట కమిటీ ఎంపిక చేసిన చరిత్ర కారులు తాము స్వతంత్రులమని చెప్పుకోవటాన్ని వీహెచ్‌పీ ఖండించి, పోరాట కమిటీ తరపున సమర్పించిన చారిత్రక పరిశీలకుల అభిప్రాయాలను పోరాట కమిటీ అభిప్రాయాలుగా స్వీకరింపజాలమని, వాటికి బదులు చెప్పవలసిన అవసరం లేదని వీహెచ్‌పీ తేల్చిచెప్పింది.

ఇక రెండవ వివాదాంశం.. 1975-80 మధ్య కాలంలో అయోధ్య వద్ద ప్రొఫెసర్‌ బీబీ లాల్‌ నిర్వహించిన తవ్వకాల గురించి. వీహెచ్‌పీ చెప్పేదేమంటే.. ఆయన రామజన్మభూమి-బాబ్రీ మసీదు కట్టడపు దరిదాపుల్లో ఆయక స్తంభాలు నిలబెట్టేందుకు కట్టిన ఇటుక దిమ్మెల్ని వరుసగా ఉండటాన్ని కనుగొన్నారు. అది వాళ్ల వాదనను సమర్థిస్తున్నదని. అయితే ఆ పరిశోధనకు ఆధారాలేమిటని బాబ్రీ మసీదు పోరాట కమిటీ వాళ్లు సవాలు విసిరారు. ఎందుకంటే ఈ కమిటీ ఎంపిక చేసుకున్న చరిత్ర పరిశీలకులకు తొలి రికార్డులను, తవ్వకాలలో లభించిన వస్తువులను చూసే అవకాశం కల్పించలేదు. 

1991 మే మాసంలో బాబ్రీ మసీదు పోరాట కమిటీ ఎంపిక చేసుకున్న చరిత్ర పరిశీలకుల నివేదికను ఆ కమిటీ సాధికారికంగా ఆమోదించటంతోనూ, వీహెచ్‌పీ దానికి సమాధానం చెప్తామని అంగీకరించటంతోనూ తొలి వివాదం సమసిపోయింది. 

రెండవ వివాదం సమసిపోయేందుకు ఇరుపక్షాల నిపుణులకు రికార్డుల పరిశీలనకు అవకాశాన్నివ్వటం జరిగింది. ప్రొఫెసర్‌ బీబీ లాల్‌ నిర్వహించిన తవ్వకాల తాలూకు ఫోటోగ్రాఫులు, డ్రాయింగులు, మృణ్మయ పాత్రలు, పురాతన వస్తుసామాగ్రి పట్టిక ఇరువర్గాల ప్రతినిధుల పరిశీలనకు 1992 అక్టోబరు 23న ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. ఇరు వర్గాల నిపుణులు వాటిని పరిశీలించి వాళ్ల వ్యాఖ్యల్ని ప్రభుత్వానికి అక్టోబరు 29లోపల సమర్పించారు. 

1992 అక్టోబరు 23, నవంబరు 8 మధ్య పరిణామాలు

అక్టోబరు 16 నాటి సమావేశంలో నిర్ణయించిన ప్రకారం.. ఒక్కోవర్గం వాళ్లు చెప్పవలసిన విషయాలు, రెండో వర్గం చెప్పిన దానిపై వాళ్ల వాళ్ల వ్యాఖ్యలు ప్రభుత్వానికి అక్టోబరు 29వ తేదీలోపు సమర్పించటం జరిగింది.

ప్రభుత్వం ఇరు వర్గాలను సంప్రదించి తరువాతి సమావేశానికి తేదీని 1992 నవంబరు 8గా ఖరారు చేసింది. రుజువుల్ని చూపి, వ్యాఖ్యల్ని చేయటం పూర్తయినందున ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబడుతాయని భావించటం జరిగింది. 

సరిగ్గా ఆ సమయంలో అనుకోని విధంగా హఠాత్పరిణామం. న్యూ ఢిల్లీలో విశ్వహిందూ పరిషత్తుకు చెందిన కేంద్రీయ మార్గదర్శక మండలి, ఆ తరువాత ధర్మ సంసద్‌ సమావేశాలు 1992 అక్టోబరు 29-31 తేదీల మధ్య జరిగాయి.  1992 డిసెంబరు 6 నుంచి కరసేవ పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ముందు వివరించబోతున్నట్లు చర్చలు సజావుగా సాగుతున్న తరుణంలో ఈ ఎత్తుగడ వివరణకు పూర్తిగా అందనిదిగా ఉంది.  ఊహించగల ఒకే ఒక వివరణ ఏమంటే.. ఈ విధమైన ఏకపక్ష ప్రకటన యొక్క ఉద్దేశ్యం చర్చలకు అంతరాయం కలిగించటమేననీ, వివాదాన్ని సుప్రీంకోర్టుకు నివేదించకుండా చూడటమనీ, ఆ విధంగా తిరిగి వివాదానికి తెరతీయటమేననీ అర్థమవుతుంది. అప్పటినుంచి విశ్వహిందూ పరిషత్తూ, సంబంధిత సంస్థలూ కరసేవ పునఃప్రారంభిస్తున్నట్లు మాటి మాటికీ పిలుపు నివ్వసాగాయి. వెంటనే కరసేవకు భారీగా సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

అప్పటికే కంకర, ఇసుక ఇతర నిర్మాణ సామాగ్రి రామజన్మభూమి-బాబ్రీ మసీదు కాంప్లెక్స్‌ నందలి శేషావతార లక్ష్మణ దేవాలయ ప్రాంగణంలో సిద్ధంగా ఉన్నాయి. అయోధ్యలోని ఇతరతావుల్లో కూడ మరింత నిర్మాణసామాగ్రి అందుబాటులో ఉంది. రామజన్మభూమి-బాబ్రీమసీదు కాంప్లెక్స్‌లో రెండు కాంక్రీటు కలిపే యంత్రాలను సిద్ధపరచారు. శేషావతార్‌-లక్ష్మణ్‌ దేవాలయానికి దగ్గర్లో ప్రహరీగోడకు దాదాపు 16 అడుగుల వెడల్పు దారిని ఏర్పాటు చేశారు. మనుషుల్ని యంత్రాల్ని తరలించేందుకు అది సరిపోతుందనేది విదితమే. వివాదాస్పద నిర్మాణానికి కంచెగా ఉన్న ఇనుప గొట్టాలకు ఆగ్నేయ మూలనుంచి దక్షిణపు దిక్కుగా సుమారు 20 అడుగుల దూరంగా తిన్నగా ప్రహరీగోడ వరకూ కొయ్య స్తంభాలు పాతటం జరిగింది. 

తొలుత ఒక్కొక్క పర్యాయం 50 వేల మంది కరసేవకులుండేట్లు ఏర్పాట్లు చేయగా, 1992 డిసెంబరు 4-5తేదీల మధ్య లక్ష మంది కరసేవకులు అక్కడికి వచ్చేట్లు కన్పించింది. కరసేవకులకోసం మొత్తం 750 గుడారాలు ప్రధానంగా రామకథాకుంజ్‌లో నిర్మించారు. ఆ ప్రాంతం రామజన్మభూమి-బాబ్రీ మసీదు కాంప్లెక్సుకు అత్యంత సమీపంలో ఉంది. కాంప్లెక్స్‌ వద్ద కరసేవకులు పిలిస్తే పలికేట్లుండాలనేదే పథకం. 

బాబ్రీ మసీదు పోరాట కమిటీ, వీహెచ్‌పీ ప్రతినిధి వర్గాలు రెండూ 1992 నవంబరు 8న సమావేశమయ్యాయి. డిసెంబరు 6న కరసేవ నిర్వహిస్తామనే ప్రకటనను నిరసిస్తూ వాళ్లొక లేఖను అందజేశారు. ఆ ప్రకటనను వాపసు తీసుకొనకపోతే చర్చలకు అర్థం లేకుండా పోతుందన్నారు వాళ్లు. కరసేవను పునః ప్రారంభించాలన్న తన కార్యక్రమంలో ఎటువంటి మార్పుకూ వీహెచ్‌పీ అంగీకారాన్ని తెలియజేసే స్థితిలో లేదు. ఆ సమావేశంలో ఎదురైన దృఢవైఖరి కారణంగా సుహృద్భావ వాతావరణంలో అంతకు మందు ఈ సమావేశంలో తీసుకోదలచిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ అలా చేసేట్లయితే సమస్య మరింత జటిలమయ్యేట్లుగా ఉంది. కనుక సమావేశాన్ని వాయిదా వేసి ఇరువర్గాలతో విడివిడిగా చర్చలు జరుపటమే క్షేమకరమని భావించటం జరిగింది. అలా చేసినట్లయితే ఈ ఇబ్బంది తరువాత కూడా చర్చలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ అవరోధం వల్ల ఏర్పడిన పరిణామాల విషయం మెల్లగా తరువాత చూసుకోవచ్చు. 

వీహెచ్‌పీ, బాబ్రీ మసీదు పోరాట కమిటీ ప్రతినిధులతో, బీజేపీ నాయకులతో, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రితో పలుమార్లు విడివిడి సమావేశాలలో భేదాభిప్రాయాలను తగ్గించుకోవలసిందిగా కోరటం జరిగింది. 

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo