గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Aug 20, 2020 , 23:26:23

దేశానికి జలసూచి!

దేశానికి జలసూచి!

‘నీరే ప్రాణాధారము’ అని సుమతి శతకకారుడు ఏనాడో నుడివాడు. ఆ సత్యాన్ని అక్షరాలా గుర్తించిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌. జలాలను పొలాలకు మళ్లించిన, ప్రజల దాహార్తిని తీర్చిన కేసీఆర్‌ నీటి విలువ తెలిసిన నిక్కమైన జలశాస్త్రజ్ఞుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ చేస్తున్న కృషికి అడుగడుగునా ఎంతమంది అడ్డుపడలేదు! ఎన్ని ఆటంకాలు సృష్టించలేదు! అయినా ‘నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు’ అన్నట్టు కేసీఆర్‌ పట్టు విడువకుండా బీడు భూములను సస్యశ్యామలం చేయడమే కాకుండా, మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీటిని సరఫరా చేస్తున్నారు. కేసీఆర్‌ కృషి ఫలితాన్ని ఇవాళ గిరిజన తండాల్లో పారుతున్న నల్లా నీటిలో చూడవచ్చు. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ జల్‌జీవన్‌ మిషన్‌ గణాంకాలలోనూ చూడవచ్చు.

కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేటలో ఇంటింటికీ నల్లానీరు అందించారు. తెలంగాణ అవతరించిన తర్వాత అదే పథకాన్ని రాష్ట్రమంతటా అమలుచేశారు. కేసీఆర్‌ అవకాశం లభించినప్పుడల్లా నల్లా నీటి సరఫరాకు ఇంతగా ప్రాధాన్యం ఇవ్వడం ఒక మంచినీటి సమస్యను పరిష్కరించడానికి మాత్రమే కాదు. ప్రజలకు వ్యాధులు ఎక్కువగా వచ్చేది కలుషిత నీరు తాగడం వల్లనే. ఆదిలాబాద్‌ గిరిజనులు వ్యాధిగ్రస్థులైనా, నల్లగొండ జనం ఫ్లోరోసిస్‌ బారిన పడినా మంచినీరు దొరకనందువల్లనే. ఒక్క తెలంగాణలోనే కాదు, దేశమంతా మంచినీటి సమస్య ఉండకూడదనేది కేసీఆర్‌ ఆకాంక్ష. తమిళనాడు బృందం వచ్చి తమకు మంచినీరు కావాలని కోరినప్పుడూ ఆయన సానుకూలంగా స్పందించారు. తమిళనాడు బాధను లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ సభ్యుల చేత వినిపించారు. ఏ ఒక్క రాష్ర్టానికి మంచినీటి ఇబ్బంది ఏర్పడినా, పొరుగు రాష్ర్టాలు ఉదారంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

కొత్తగా ఆరేండ్ల కింద పుట్టిన తెలంగాణ రాష్ట్రం 98.31 శాతం ఆవాసాలకు మంచినీరు అందిస్తూ దేశంలోనే అగ్రశ్రేణిలో నిలువడం ప్రశంసనీయం. వామపక్షాలు దశాబ్దాలు పాలించిన పశ్చిమబెంగాల్‌ కేవలం 2.05 శాతం జనావాసాలకు నల్లానీరు అందిస్తూ దేశంలోనే అట్టడుగున ఉన్నది. మరే రాష్ట్రమూ తెలంగాణకు దరిదాపుల్లో లేదు. దేశవ్యాప్తంగా 70 వేల టీఎంసీల నీటి లభ్యత ఉన్నదనీ, ఇప్పటివరకు పాలించిన జాతీయ రాజకీయపక్షాలు ఈ నీటిని ఉపయోగంలోకి తేలేదని, మరోవైపు ప్రజలు తాగడానికి నీళ్లు లేక అల్లాడిపోతున్నారని గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ అవసరాలు తీర్చిన తర్వాత కూడా ఇంకా ముప్ఫై వేల టీఎంసీల నీరు మిగిలే ఉంటుందని, కేవలం పదివేల టీఎంసీలతో దేశవ్యాప్తంగా మంచినీటి సమస్యను తీర్చవచ్చునని ఆయన స్పష్టంగా చెప్పారు. తెలంగాణ మాదిరిగానే, మన దేశం కూడా కేసీఆర్‌ మార్గదర్శనంలో సమస్యల నుంచి విముక్తి కావాలని ఆశిద్దాం.


logo