శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Aug 19, 2020 , 23:44:16

రాజకీయ అజెండాగా జనాభా నియంత్రణ

రాజకీయ అజెండాగా జనాభా నియంత్రణ

జనాభా నియంత్రణ లేకుండా పెరిగిపోతే అనేక సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. అధిక జనాభాతో ఆహార కొరత, పర్యావరణ సమతౌల్యం దెబ్బతిని మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. అధిక జనాభా వల్ల మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభావం పడుతున్నది. దీంతో వసతులు సమకూర్చడం సాధ్యపడక అన్నిరంగాల్లో వైఫల్యం కనిపిస్తు న్నది. తీవ్ర పారిశుద్ధ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.  కాబట్టి జనాభా నియత్రణలో ప్రతి ఒక్కరూ స్వీయ నిర్ణయం తీసుకొని ముందుకెళ్లాల్సిన ఆవసరమున్నది.

జనాభా నియంత్రణ జరుగాలంటే ప్రథమంగా పౌరులను విద్యావంతులుగా తీర్చి దిద్దాలి. అక్షరాస్యత సాధించిన మహిళలు, బాలికలు తమ హక్కులు, ఆరోగ్య సంరక్షణ తదితరాలను అవగతం చేసుకుంటారు.  ఐక్య రాజ్య సమితి జనాభా నిధి సంస్థ లెక్కల ప్రకారం కోవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా 4.7 కోట్ల మంది మహిళలకు కనీసం గర్భ నిరోధక సాధనాలు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ పరిస్థితి దాదాపు 70 లక్షల అవాంఛిత గర్భధారణ లకు దారి తీసింది. మన దేశంలో అయితే కొన్ని మూఢ విశ్వాసాలతో మగ పిల్లలే కావాలనే కాంక్షతో ఎక్కువ సంతానాన్ని కంటున్నారు. మతాచారాలు, సంస్కృతులు, మూఢ విశ్వాసాల వల్ల ఇది మరింత ప్రబలింది. అనేక వర్ధమాన దేశాలలో మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తూ, పురుషులతో సమానంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ, వ్యాపార, వాణిజ్య రంగాలలో రాణిస్తున్నారు. 

అధిక సంతానానికి పేదరికం, నిరక్షరాస్యతే ప్రధాన కారణమని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. దేశ సగటు గర్భ ధారణలు 2.2 రేటుగా ఉంటే, నిరక్షరాస్యత ఎక్కువ ఉన్న రాష్ర్టాలైన బీహార్‌లో 3.2 , ఉత్తర ప్రదేశ్‌లో 3.0, రాజస్థాన్‌లో 2.6, జార్ఖ్‌ండలో 2.5 సగటుగా ఉన్నాయి. మహిళా నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న రాష్ర్టాలలో గర్భధారణల రేటు దేశ సగటు కన్నా అధికంగా ఉండడం గమనించ వలసిన అంశం.  మహిళలకు విద్య అందినప్పుడు స్త్రీ పురుష సమానత్వం, స్వేచ్ఛ, స్వీయ సంపాదన, మహిళా సాధికారత సాధ్యమవుతుంది. దీంతో పాటు సొంత, కుటుంబ, సమాజ, అధికారిక నిర్ణయ ప్రక్రియలో వారి పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తారు. 

అధికజనాభా మన దేశ బలంగానూ, బలహీనతగానూ చెప్పవచ్చు. పెరుగుతున్న జనాభాను నియంత్రించే ముఖ్య సూత్రాన్ని అందరు విస్మరించడం మూలంగా దేశ జనాభా 138 కోట్లకు పైగా పెరిగింది. ఏటా 0.99శాతంగా పెరుగుదల వల్ల దాదాపు 1,35,86,631 జనాభా పెరుగుతున్నది. దేశంలో ఒక చదరపు కిలో మీటరు జనసాంద్రత 464. దేశ సగటు జనన రేటు 2.2శాతంగా ఉన్నది. 91,47,420 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న అమెరికా దేశ జనాభా 33 కోట్ల 10 లక్షలు మాత్రమే ఉన్నది. 0.59 శాతం జనన రేటుతో ఏడాదికి 19 లక్షల 37 వేలకు పైగా నమోదు అయి, చదరపు కిలో మీటర్‌కు 36 మంది నివసిస్తున్నారు. మన దేశ సగటు జనాభా పెరుగుదల కన్నా 0.40 శాతం తక్కువగా నమోదు అవుతున్నది. 

అంతకంతకూ పెరుగుతున్న జనాభాకు వనరులు సరిపోవు. పర్యావరణం పూర్తిగా ధ్వంసం అయ్యే తీవ్ర దుష్పరిణామాలు ఆవృతం కాకముందే మనం జాగృతం కావాలి. జనాభా నియంత్రణ లేకుండా పెరగడంతో పట్టణాలు, నగరాలు, నివాస ప్రాంతాలు పెరిగి, వ్యవసాయం, ఆర్థిక వృద్ధి రేటు పడిపోతుంది. ప్రజల కనీస అవసరాలు తీరకుండా ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. వ్యక్తుల, సమూహాల మధ్య వైషమ్యాలు పొడచూపుతాయి. సరైన విద్య, ఉపాధి, శిక్షణ లేక దిగజారిన జీవన ప్రమాణాలున్న సమాజంలో అరాచకానికి దారితీస్తాయి. 

జనాభా పెరుగుదలతో భవిష్యత్‌ తరాలు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రతి పౌరునికి అవగాహన కల్పించాలి. కుటుంబ నియంత్రణ పాటించి, ఒక జంట ఒక్కరినే కనే విధంగా విధానపరమైన నిర్ణయం కావాలి. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో జనాభా నియంత్రణ కోసం వారి కార్యాచరణను ప్రకటించాలి. విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక, ఆర్థిక రంగాలలో తీసుకోవాల్సిన అత్యున్నత నిర్ణయాల ద్వారా పేదరికం, అక్షరాస్యతలపై దృష్టి సారించాలి. తద్వారా జనాభా నియంత్రణకు కృషి చేయడంతో పాటు భవిష్యత్‌ తరాలకు మార్గ దర్శనం చేయాలి. 

విభిన్న సంస్కృతులు, జీవన వైవిధ్యాల నేపథ్యం లో రానున్న విపత్కర పరిస్థితిపై ప్రజలకు అవగాహన కలిగించాలి.  ఆహారం, ఆరోగ్యం, విద్య, ఉపాధి మొదలైన మౌలిక అవసరాలకు, మెరుగైన జీవన ప్రమాణాలకు ఒక దీర్ఘ కాలిక ప్రణాళిక రూపొందించాలి. భారత దేశ సంస్కృతి, సంప్రదాయం, విలువ లను కాపాడే ఒక కొత్త జీవన యానానికి నాంది పలకాలి. జనాభా నియంత్రణకు మనమంతా కంకణ బద్దులమై భవిష్యత్‌ తరాలకు ఆదర్శంగా నిలువాలి.  

(వ్యాసకర్త: ఎమ్మెల్యే  దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి ,  చైర్మెన్‌ ఎంఆర్‌డీసీఎల్‌)


logo