సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - Aug 19, 2020 , 23:44:15

తవ్వకాలతో భయం భయం

తవ్వకాలతో భయం భయం

ఏడో అధ్యాయం కొనసాగింపు..

మజన్మభూమి పోరాట కారులు, హిందుత్వవాదులు ఢిల్లీ సమావేశం తర్వాత కరసేవ ఎట్టి పరిస్థితిలో చేపడుతామని ప్రకటించిన నేపథ్యంలో వివాదాస్పద కట్టడాన్ని సంరక్షిస్తానంటూ కళ్యాణ్‌సింగ్‌ హామీ పడుతూ ఇలా తెలిపారు.. మొత్తం మీద ఇక  కోర్టు ఉత్తర్వులను తు.చ. తప్పక పాటిస్తామని మనవి. మేము కోర్టు ఉత్తర్వులకు బద్ధులం. దానిని ఉల్లంఘిస్తూ ఏమీ చేయదలచలేదు..’

ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ నాలుగు ప్రత్యేక వాగ్దానాలను జాతీయ సమైక్యతా మండలి గమనంలోకి తీసుకుంది. 

1) ఈ అంశంలో ఆమోదయోగ్యమైన పరిష్కారానికి అన్ని విధాలా కృషి సల్పబడుతుంది. 

2) తుది పరిష్కారం లభించే వరకూ రామజన్మ భూమి-బాబ్రీ మసీదు కట్టడపు రక్షణకు పూర్తి బాధ్యత ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానిదే. 

3) భూ సేకరణ విషయంలో కోర్టు ఉత్తర్వుల్ని సంపూర్ణంగా అమలుపరుస్తాం. 

4) హైకోర్టులో పెండింగులో ఉన్న కేసులలోఆ కోర్టు ఉత్తర్వులను జవదాటం. 

ఒకవైపున అలా హామీలు గుప్పిస్తూనే మరో వైపునుంచి బీజేపీ ప్రభుత్వం కట్టడం వద్ద భద్రతా ఏర్పాట్లను 1991 డిసెంబరు నుంచి తగ్గించసాగింది. 1992 ఫిబ్రవరిలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు చుట్టూనేగాక, 1991 అక్టోబరులో సేకరించబడిన స్థలాన్ని కూడా కలుపుకొని సరిహద్దుగోడ (దానికి రామ్‌ దివార్‌ అని పేరు పెట్టారు)ను ప్రారంభించింది.  మార్చి 1992లో దాదాపు 42.09 ఎకరాల భూమిని వీహెచ్‌పీ ప్రాయోజిత సంస్థ ‘రామ్‌ జన్మభూమి న్యాస్‌'కు కౌలుకు ఇచ్చింది. అది 1988-89వ సంవత్సరంలో అంతకుముందు ప్రభుత్వం రామ్‌ కథా పార్క్‌ ప్రాజెక్టుకుగాను ప్రత్యేకించి కేటాయించిన భూమి. 1992 మార్చి-మే మాసాల మధ్య  సేకరించబడిన స్థలంలోని కట్టడాలన్నీ కూల్చివేయబడినాయి. వాటిలో సంకటవిమోచన మందిరము, సుమిత్రా భవన్‌, లోమసు ఆశ్రమము, గోపాల్‌ భవన్‌, దుకాణా లే గాక శక్తిగోపాల్‌ మందిరంలోని అధిక భాగం (విగ్రహాలున్న గది, దాని పక్క గది హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా వదిలివేయబడినాయి) ఉన్నా యి.  1992 మే మాసంలో ఈ కూల్చివేత కార్యక్రమంతో పాటు వివాదంలో ఉన్న కట్టడం చుట్టూ పెద్ద ఎత్తున తవ్వటం, చదునుచేయటం వంటి పనులు కూడా ప్రారంభమయ్యాయి. 

రామ జన్మభూమి-బాబ్రీ మసీదు ముందు తవ్విన మట్టిని పడమటి వైపున, దక్షిణం వైపున కుప్పగా పోయటం  జరిగింది. రామజన్మభూమి కట్టడానికి పడమరవైపు బాగా ఎత్తుగా ఏటవాలుగానూ ఉత్తర, దక్షిణ దిశలలో కూడా కొంచెం వాలుగానూ తూర్పున సమతలంగానూ ఉండేది. ఇలా తవ్వినందువల్ల పన్నెండు అడుగుల లోతు గుంట తూర్పున తయారయ్యింది. ఇలా తవ్వి చదునుచేసే కార్యక్రమం వల్ల పలువురి మనసుల్లో భయాందోళనలు చెలరేగా యి. అటువంటి కార్యక్రమం వల్ల రామజన్మభూమి-బాబ్రీమసీదు కట్టడపు గట్టిదనం, సురక్షితంగా ఉండే విషయంలో ప్రజలు భయపడసాగారు. వర్షాకా లంలో తవ్విన గుంటల్లోని నీరు ఆ కట్టడం పునాదుల్లోకి చేరి బలహీనపరచ గలదనే భయాన్ని ప్రకటించటం కూడా జరిగింది. అలాగే కట్టడం చుట్టూ ప్రహరీ గోడ పక్కన కుప్పగా పోసిన మట్టి ప్రహరీ గోడ కంచెల అంత ఎత్తు ఉండటంతో అక్కడ చేసిన భద్రతా ఏర్పాట్లు పనికిరాకుండా పోయాయి.  ఈ అంశాలన్నీ మాటిమాటికీ కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తెస్తూనే ఉంది. అయితే ఫలితం శూన్యం. నడుస్తున్న దావాలోని ఫిర్యాదుదారులు (మోహమ్మద్‌ హసీమ్‌, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మధ్య దావాలో) బాధపడుతూ మరో దరఖాస్తు పెట్టుకున్నారు. రాష్ట్రప్రభుత్వం తవ్వకాలు, చదునుచేసే కార్యక్రమాన్ని చేపట్టేందుకుగాని, కొనసాగించేందుకుగాని అవకాశం లేకుండా కోర్టును తగిన ఆదేశాలివ్వవలసిందిగా కోరుతూ. అయితే, రాష్ట్రప్రభుత్వం కట్టడపు భద్రతపై పదేపదే ఇస్తూ వస్తున్న హామీలపై విశ్వాసం ఉంచిన హైకోర్టు అటువంటి స్టే ఉత్తర్వులను ఇచ్చేందుకు నిరాకరించింది. 

1992 జూలై నాటికి బీజేపీ, వీహెచ్‌పీలు తలపెట్టిన మందిర నిర్మాణం చేపట్టే ప్రయత్నాన్ని పునఃప్రారంభించేందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం భూమికను సిద్ధం చేసింది. సేకరించిన స్థలంలో పెద్ద ఎత్తున నిర్మాణ కార్యక్రమాన్ని కరసేవ ద్వారా చేపట్టబోతున్నట్లు  వీహెచ్‌పీ ప్రకటించింది. 1992 జూలై 9న కాంక్రీటు అరుగు నిర్మాణం కరసేవ ద్వారా ప్రారంభించబడింది. వీహెచ్‌పీ బహిరంగం గానే ప్రకటించింది.. నిర్మించబోయే మందిరానికి సింహద్వారం ఆ అరుగుపైనే ఉంటుందని. (చివరకు మందిర నిర్మాణంలో మసీదు మధ్యలో ఉన్న గుమ్మ టానికి కొంచెం ముందుకు చొచ్చుకు వచ్చేట్లు చేయటం జరుగుతుందనీ ఆ గుమ్మటమే గర్భగృహంగా మందిరానికి ఉంటుందనీ నర్మగర్భంగా చెప్పబడింది).

హైకోర్టులో కొనసాగుతున్న పిటీషను (రి.పి.నెం. 3540/1991)కు అనుబం ధంగా నిర్మాణ కార్యక్రమాన్ని నిలువరింపజేసేందుకు మరో దరఖాస్తు చేయబడింది. ఈ పర్యాయం నిర్మాణ కార్యక్రమాలు నిలిపివేతకుగాను 1992 జూలై 15న కోర్టు ఈ కింది ఉత్తర్వులు జారీ చేసింది..

‘ఈ లోగా ఎందురుపక్షం వాళ్లు నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం గాని, కొనసా గించటం గాని ఆ వివాద స్థలంలో చేయరాదు. ఒకవేళ అటువంటి కార్యక్రమం చేపట్టటం తప్పనిసరి అయితే అటువంటి పరిస్థితిలో ముందస్తుగా కోర్టు అనుమతిని పొందవలసి ఉంటుంది..’

హైకోర్టుకు సమర్పించిన వాఙూలంలో..(రి.పి.నెం. 3540/1991) సాధువుల తోనూ, పిల్లలతోనూ మిగతా యాత్రికులతోనూ కిక్కిరిసిన జనసందోహంలో బలగాలను ఏమాత్రం వాడినా అది అశాంతికి, రక్తపాతానికి, అమాయకుల ప్రాణహానికి దారితీయవచ్చు. 

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo