ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Aug 19, 2020 , 00:26:02

పారిశ్రామిక పరుగు

పారిశ్రామిక పరుగు

మన రాష్ట్రం వ్యవసాయ రంగంలోనే కాదు, పారిశ్రామిక బాటలోనూ పరుగులు తీస్తున్నది. యువమంత్రి కేటీఆర్‌ కృషి మూలంగా ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఏస్టర్‌ ఫిల్మ్‌టెక్‌ లిమిటెడ్‌ సంస్థ ఇటీవల 1350 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో ప్యాకేజింగ్‌ ఫిల్మ్‌ మాన్యుఫాక్చరంగ్‌ ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించింది. వైద్య పరికరాల మెడ్‌ట్రానిక్స్‌ సంస్థ కూడా పెట్టుబడులకు మన రాష్ర్టాన్నే అనువైనదిగా ఎంచుకున్నది. సాయి లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీని మంత్రి కేటీఆర్‌ శనివారంనాడు ప్రారంభించారు. వెయ్యికి పైగా ప్రపంచ స్థాయి పరిశోధనా సంస్థలు ఇక్కడ ఆరోగ్య పరిరక్షణరంగంలో భాగస్వాములవుతాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌ శివారులోని మేధా సర్వోడ్రైవ్స్‌ కంపెనీ రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి కేటీఆర్‌ గురువారం భూమి పూజ చేయడం పారిశ్రామికాభివృద్ధికి మరో సూచిక. 

రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఒక్కో నిర్ణయం ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతున్నది. కేటీఆర్‌ ఆధ్వర్యంలోని పరిశ్రమల శాఖ రాష్ట్రంలోని పరిశ్రమల డిజిటల్‌ సూచీని రూపొందించ తలపెట్టడం కూడా ఇటువంటిదే. ఒక్కో పరిశ్రమ వార్షికఉత్పత్తి, ముడిపదార్థాలు,ఉద్యోగ కల్పన మొదలైనవివరాలు ఇందులో ఉంటాయి. విడిభాగాల వంటివి సరఫరా చేసే చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఈ వివరాలు ఎంతో ఉపయోగకరం. రక్షణ, ఆటోమొబైల్‌, విమానయాన, ఆహార, ఔషధాది అనేక రంగాలలో పరిశ్రమలు విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సూచీ ప్రాధాన్యం వర్ణించలేనిది. ఈ సూచీని అధ్యయనం చేయడం ద్వారా కొత్త పరిశ్రమలు పెట్టవచ్చు, వ్యాపారాన్ని పెంచుకోవచ్చు, పరిశ్రమలు సహకరించుకోవచ్చు. ఆహార శుద్ధి, నిలువ- రవాణా రంగాల్లో బలహీనవర్గాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేటీఆర్‌ నేతృత్వంలోని మంత్రుల బృందం ఇటీవల నిర్ణయించింది. విద్యుత్‌ వాహనాల తయారీ రంగంలో ముప్ఫైవేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం మొదలైంది.  ఈ విధానాల వల్ల కూడా ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి. 

తెలంగాణలో స్థాపించే పరిశ్రమల్లో ఎక్కువ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే విధానాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదించింది. ఉపాధి అవకాశాలను పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నది. తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెజ్‌ (టాస్క్‌) ఏర్పాటు ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని నిరుద్యోగులకు గరపడానికి చర్యలు తీసుకున్నది. హరిత, నీలి, గులాబీ, శ్వేత విప్లవాలకు నాంది పలుకడం వల్ల నగరప్రాంత విద్యావంతులకే కాకుండా, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు విస్తారంగా లభిస్తున్నాయి. ఎంతో మంది స్వయం ఉపాధి రంగంలో స్థిరపడటానికి, పారిశ్రామిక వేత్తలుగా మారడానికి ద్వారాలు తెరుచుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను, విధానాలను అవగాహన చేసుకుంటూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి యువత సమాయత్తం కావాలి. 


logo