గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Aug 19, 2020 , 00:26:00

సతత హరితం సంతోషం

సతత హరితం సంతోషం

ప్రకృతి ప్రేమికుడైన కేసీఆర్‌ గారు తెలంగాణలో పర్యావరణ సమతుల్యత, అడవుల విస్తరణ కోసం ‘హరిత హారం’ అనే బృహత్తర కార్యక్రమాన్ని 2015 జూలై 3న చేవెళ్ళలో ప్రారంభించారు. తెలంగాణలో అడవి విస్తరణను 33శాతానికి పెంచడమే లక్ష్యంగా గత ఐదేండ్లుగా హరితహారం కొనసాగుతున్నది. తెలంగాణను పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా మారుస్తున్నది.

పచ్చని చెట్టుని నేను రా 

పాలుగారే మనసు నాదిరా 

కొమ్మను నే రెమ్మను 

నీకు తోడుగా ఉండే అమ్మను..’ 

మానవ మనుగడకు, సకల జీవరాసులకు ప్రకృతి పర్యావరణ సమతుల్యతకు, జీవవైవిధ్యానికి చెట్టు  అడవి ఎంత ముఖ్యమో ఈ పాట ద్వారా ప్రజాకవి జయరాజు చెబుతాడు. ప్రపంచీకరణ, సరళీకరణలో భాగంగా  అభివృద్ధి పేరుతో విలాసవంతమైన జీవితం కోసం, సంపదకోసం ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నారు. తాము కూర్చున్న కొమ్మను తామే నరికి సమస్త మానవాళికి, ప్రకృతిలోని సకల జీవరాసుల మనుగడకు ప్రమాదకారి అవుతున్నారు. అందుకే ప్రకృతి పర్యావరణ సంరక్షణ, చెట్ల పెంపకం,  అడవుల విస్తరణ అనేది నేడు ప్రపంచ మానవాళికి అత్యవసర, ప్రాధాన్యాంశంగా మారింది. 

ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణలో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ హరితహారం స్ఫూర్తితో ఎంపి జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ గారు ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ’ కార్యక్రమాన్ని 2018లో ప్రారంభించారు. ‘పచ్చగా ఉంటే  నిండుగ ఉంటుంది’, ‘పుడమి పచ్చగా ఉండాలి మనం చల్లగ ఉండాలి’ అనే నినాదంతో ‘ఇగ్నైట్‌ మైండ్‌' అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా సోషల్‌ మీడియా వేదికగా గ్రీన్‌ ఇండియా కార్యక్రమం కొనసాగుతున్నది. తానొక్కనితోనే ప్రారంభమైన ఈ ఉద్యమం.. దినదిన ప్రవర్థమానం చెందుతూ దేశంలోనే చెప్ప దగిన గ్రీన్‌ ఉద్యమంగా మారింది. తెలంగాణలో హరితహారం కార్యక్రమం ద్వారా 1,88,000 ఎకరాల్లో పచ్చదనం పెరిగిందని, 18శాతం అడవి విస్తీర్ణం 24శాతంగా మారిందని సర్వే ఆఫ్‌ ఫారెస్ట్‌ ఇండియా పేర్కొనటం గమనార్హం.  

జపాన్‌ పర్యావరణవేత్త మియావాకి చిట్టడవుల పెంపు పద్దతిని తెలంగాణ ప్రభుత్వం భద్రాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌ పేరుతో అభివృద్ధి చేస్తున్నది. మియావాకి పద్ధతిలో తక్కువ భూవిస్తీర్ణం (1, 2 ఎకరాలు), తక్కువ సంరక్షణ అవసరం, స్థానిక అటవీ జాతుల మొక్కలతో చిట్టడవులను పెంచడం జరుగుతున్నది. హైదరాబాద్‌లో అర్బన్‌ ఫారెస్ట్రీ పేరుతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా ‘సీడ్‌బాల్స్‌' ద్వారా కొండల్లో, సుదూర పర్వత ప్రాంతాల్లో అడవులను పెంచడం జరుగుతున్నది. 

హైదరాబాద్‌ నగరంలో, రాష్ట్రంలోని చిన్న పట్టణాల్లో ప్రజలను కాలుష్యం నుంచి, మానసిక ఒత్తిడి నుంచి రక్షించి ఆరోగ్య, ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించే ‘అర్బన్‌ లంగ్స్‌ స్పేస్‌'లను అర్బన్‌ ఫారెస్ట్రీ విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. మూసీనదిని పునరుజ్జీవింపజేసి దానికి ఇరువైపుల అందమైన గార్డెన్స్‌ పెంచాలని ప్రణాళిక సిద్ధం చేసింది. అవుటర్‌ రింగ్‌రోడ్డు, రీజినల్‌ రింగ్‌ రోడ్డుల మధ్య, హైద్రాబాద్‌ చుట్టు పట్టణాలను గార్డెన్‌ సిటీలుగా,  పాలీసెంట్రిక్‌ సిటీలుగా మార్చాలని ప్రణాళికలు తయారు చేసింది.

కేసీఆర్‌గారు ప్రారంభించిన ఆకుపచ్చ యజ్ఞం లో తనవంతు భాగస్వామ్యం కోసం చెట్లను నాటడం, నాటించడం కార్యక్రమం నిర్వహిస్తూనే సంతోష్‌కుమార్‌గారు గత ఏడాది జూలై 24న కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘గిఫ్ట్‌ ఎ స్మయిల్‌' నినాదంతో కీసర వద్ద 2,042 ఎకరాల రిజర్వు ఫారెస్ట్‌ను దత్తత తీసుకొని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చారు. కీసర ఫారెస్ట్‌ను ఎకో టూరిస్ట్‌ ప్రాంతంగా అభివృద్ధ్ధి చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 31న కీసర రిజర్వు ఫారెస్ట్‌లో విద్యార్థులు, ఎన్‌జీఓలతో కలిసి ఒకేరోజు 15వేల మొక్కలు నాటించారు. గత ఆరు దశాబ్దాలుగా మోడుబారి ఉన్న కీసర గుట్టపై ఇప్పుడు ఎత్తైన చెట్లు కన్పిస్తున్నాయి. కీసరలో గల పెద్దమ్మ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే వాకింగ్‌, సైక్లింగ్‌, ట్రాక్‌లు, యోగా కేంద్రాలు, ఒపెన్‌ జివ్‌ చిల్డ్రన్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. చివరకు తన పుట్టిన రోజున మొక్కలు నాటి ఆ సెల్ఫీని తనకు బహుమతిగా ఇవ్వాలని పిలుపు నివ్వడం, మొన్న గణపతి ఉత్సవాలను ‘సీడ్‌ గణపతి’తో జరుపాలని పిలుపు నివ్వడం పర్యావరణం పట్ల సంతోష్‌ గారికున్న మక్కువను తెలియజేస్తున్నది.

కేసీఆర్‌ నాయకత్వంలో వ్యవసాయం, తాగు, సాగు నీరు, ప్రజా సంక్షేమ రంగాల్లో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. అలాగే అడవుల రక్షణ, విస్తరణలో కూడా తెలంగాణ హరితహారం కార్యక్రమం ద్వారా రోల్‌ మోడల్‌గా నిలిచింది. కేసీఆర్‌ స్ఫూర్తితో ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌' కూడా దేశంలోనే ఒక ప్రముఖ పర్యావరణ ఉద్యమంగా మారి, ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారడం విశేషం. దీంతో తెలంగాణ  హైద్రాబాద్‌  ప్రకృతి రమణీయతను సంతరించుకోవాలని తెలంగాణ పచ్చగా, ప్రజలు చల్లగా ఉండాలని ఆశిద్దాం.

డి.రాజారాం యాదవ్‌


logo