సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - Aug 19, 2020 , 00:25:58

కళ్యాణ్‌సింగ్‌ హామీ

కళ్యాణ్‌సింగ్‌ హామీ


ఆరో అధ్యాయం కొనసాగింపు..

1989 నాటి ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ వ్యతిరేకోల్లాసపు ఉరవడిలో విపక్షాలు అన్నీ మరిచిపోయాయి. ఇరు పక్షాల వైపునుంచి వాళ్ల వైఖరికి వ్యతిరేకమైనది జరుగుతూండటంతో వాళ్లోల్లో వత్తిడి పెరిగింది. వాళ్లిక కలిసి కొనసాగటం దుర్లభమని గ్రహించగలిగారు.. వాళ్లు ఎన్నికల వాగ్దానాల్ని నిలబెట్టుకొనేందుకుగాను వీపీ సింగ్‌ ప్రభుత్వాన్ని కూల్చవలసి వచ్చింది. దాన్నలా వదిలెయ్యండి. అసలింతకీ సంక్షోభానికి కారణం 1990 అక్టోబరు-నవంబరు నాటి అయోధ్య ఘటనలు. మరీ ముఖ్యంగా నేను మీ ముందుంచదలచిందే మంటే యూపీ ముఖ్యమంత్రిగా ములాయంసింగ్‌ యాదవ్‌ అయోధ్య సమస్యను ఎలా అదుపు చేశారు. అదే సమయంలో పరస్పర విరుద్ధమైన నిబద్ధతతో బీజేపీ, జనతాదళ్‌లు విడిపోయి, వాళ్ల అభిప్రాయాల్లో సానుకూలతలు లేకున్నా, కాంగ్రెస్‌ వ్యతిరేకత ఆధారంగా పెనవేసుకున్న స్నేహాన్ని వీడి బద్ధ శత్రువుల య్యారనేది.

అధ్యాయం-7 

అయోధ్య 1992

వివాదానికి దారితీసిన అంశాలు: 1990 డిసెంబర్‌లో ప్రధాని చంద్రశేఖర్‌ చొరవతో విశ్వహిందూ పరిషత్తు, అఖిలభారత బాబ్రీ మసీదు యాక్షన్‌ కమిటీల మద్య సమస్య పరిష్కారానికి చర్చలు మొదలయ్యాయి. నాలుగు సమావేశాలు జరిగాయి. ఇరుపక్షాలు వారి వారి వాదనలు వినిపిస్తూ పత్రాలు సమర్పించాయి. మూడవ సమావేశం ముగిసిన తరువాత ఆ పత్రాలను చారిత్రక, పురాతత్వ, రెవెన్యూ, చట్టసంబం ధిత అంశాల కింద విభజించాలని, వాటిని ఇరుపక్షాలు ప్రతిపాదించిన నిపుణు లు పరిశీలించాలనే నిర్ణయం జరిగింది. ఆ నిపుణులు 1991 జనవరి 24న సమావేశమయ్యారు. చాలా విషయాల్లో అంగీకారం కుదరక ఫిబ్రవరి 6న జరిగి న నాల్గవ సమావేశంలో ప్రభుత్వం ఉభయపక్షాలు సమర్పించిన ఆ పత్రాలను అసలు వాటితో సరిచూసి, పరిశీలించి వాటి సాధికారతను ధృవీకరించవలసిం దిగా కోరుతూ తీర్మానించారు. ఆ సమావేశంలోనే ఒక్కోపక్షం తమతమ దృక్కో ణాలతో పాటుగా ఎదురుపక్షం వాళ్ల దృక్కోణంపై తమతమ పక్షాలకు చెందిన అనుభవజ్ఞుల అభిప్రాయాల సారాంశాన్ని కూడ అందించవలసి ఉంటుందని కూడ తీర్మానించారు. తదనుగుణంగా విశ్వహిందూ పరిషత్‌ తమ పత్రాలను 1991 ఫిబ్రవరి 24న సమర్పించగా, బాబ్రీ మసీదు యాక్షన్‌ కమిటీ అప్పుడు గాక 1991 మే 13న సమర్పించింది. అప్పటికి చంద్రశేఖర్‌ ప్రభుత్వం రాజీనా మా సమర్పించటంతో చర్చలకు అంతరాయం ఏర్పడింది. 

ఈలోగా 1991 మే మాసంలో లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంగా ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్‌ ఈ కింది అంశాన్ని సూత్రీకరించింది. కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతగా మారిన ఆ అంశం ఈ విధంగా ఉంది.

రామజన్మభూమి-బాబ్రీ మసీదు

‘ఈ విషయంలో ఉభయ కమిటీల భావాలను సంపూర్ణంగా గౌరవిస్తూ రాజీ మార్గంలో ఒక పరిష్కారాన్ని కనుగొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. ఒక వేళ అటువంటి పరిష్కారం సాధ్యపడకపోతే అన్ని పక్షాలు కోర్టు ఉత్తర్వులను, తీర్పును గౌరవించాల్సి ఉంటుంది. మసీదు పడగొట్టకుండా మందిర నిర్మాణం జరుపాలని కాంగ్రెస్‌ కోరుకుంటున్నది..’

కాంగ్రెస్‌ పార్టీ ఈ కృతనిశ్చయాన్ని నేను ఎన్నికల ప్రచార సభల్లోనూ, 1991 ఆగస్టు 15నాడు ప్రజలకు అందించిన సందేశంలోనూ, మరెన్నో పర్యాయాలు స్పష్టంగానే మరీ మరీ చెప్పాను. 

1991 జూన్‌ ఎన్నికలు కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్‌లో గుడికట్టి తీరుతామన్న  భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యేట్లు చేశాయి. ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం పేచీలో ఉన్న కట్టడం చుట్టుపక్కల స్థలాన్ని సేకరించటం, అలా సేకరించిన స్థలంలోని దేవళాలతో సహా కొన్ని కట్టడాల్ని కూల్చటం వంటి కొన్ని చర్యల్ని చేపట్టింది. పేచీలో ఉన్న కట్టడాన్ని అలా వదిలి ప్రభుత్వం సేకరించిన స్థలంలో కరసేవ ద్వారా దేవాలయ నిర్మాణాన్ని చేపట్టాలన్నదే 1991 అక్టోబరు నుంచి ఆలయ నిర్మాణ ఉద్యమం దృష్టంతా. కానీ అది చట్ట సమ్మతంగా లేదు. ప్రభుత్వం సేకరించిన స్థలం కొన్ని కోర్టు ఆంక్షలకు లోబడి ఉంది. సేకరించిన స్థలంలో పక్కా నిర్మాణం జరుపరాదన్నదే షరతు. పైగా విశ్వహిందూ పరిషత్తు విడుదల చేసిన ఆలయం ప్లాను ప్రకారం.. నిర్మించబోయే దేవాలయ ప్రధాన భాగం పేచీ పడుతున్న కట్టడం ఉన్న తావునే చూపటం జరిగింది. 

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అందరికీ ఆమోద యోగ్యమైన ఒక రాజీ ప్రతిపాదనకు తన సమ్మతిని తెలియజేయాలని అటువంటి పరిష్కారం కుదరని సందర్భంలో అందరూ న్యాయస్థానం ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని భావిం చింది. పేచీలో ఉన్న కట్టడాన్ని అలాగే వదలి అయోధ్యలో దేవాలయ నిర్మాణం జరుపాలన్నదే కేంద్ర ప్రభుత్వ అభిమతం. దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభు త్వం నిరంతరం రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి పెడుతూనే ఉంది. తగాదాలో ఉన్న కట్టడం భద్రత పట్ల శ్రద్ధచూపమనీ, కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టవద్దనీ. 

1991 నవంబరు 2న జరిగిన నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి కళ్యాణ్‌సింగ్‌ ఇలా ఉద్ఘాటించారు. ‘వివాదంలో ఉన్న కట్టడం విషయంలో దాని భద్రతకు సంపూర్ణబాధ్యత మాదేనని గతంలో నమ్మబలికిన విషయాన్ని మళ్లీ స్పష్టీకరిస్తున్నాను. ఆ కట్టడం రక్షణ విషయంలో జాగరూకులమై ఉంటూ కట్టుదిట్టమైన చర్యలు గైకొన్నాం. ఇప్పుడు అక్కడి కెవరూ వెళ్లలేరు. డోమ్‌పైకి ముగ్గురు ఎక్కిన సంఘటన వంటిది పునరావృతం కాబోవటాన్ని అనుమతించం. ఈ కౌన్సిల్‌ ద్వారా ఈ విధమైన నిశ్చయాన్ని మీకు తెలియజేస్తున్నాను.

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo