ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Editorial - Aug 18, 2020 , 00:28:43

జల తాండవం

జల తాండవం

వరుసగా ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వానలు కురుస్తుండటంతో గోదావరీ కృష్ణాతో పాటు పెన్‌గంగ, ప్రాణహిత, మానేరు, మున్నేరు, కిన్నెర సాని తదితర నదులు, ఉపనదులు ఉగ్రరూపం దాల్చాయి. జంపన్నవాగు, మోయ తుమ్మెద, కోడిపుంజుల వాగు, దుందుభి వాగు, మూలవాగు- రాష్ట్రమంతటా అనేక వాగులు వంకలు  పొంగిపొర్లుతున్నాయి. పొచ్చెర వంటి జలపాతాలు ఎగిసిపడుతున్నాయి. భారీగా వానలు కురిసినప్పుడు రహదారులు జలమయం కావడం వంటి సమస్యలు సాధారణమే. కానీ వరంగల్‌- హనుమకొండలోని కాలనీలు జలమయం కావడమేమిటి? రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై భారీ ఎత్తున సహాయ చర్యలు చేపట్టకపోతే ప్రజలు ఎంతో ఇబ్బందులు పడేవారు. మంత్రి కేటీఆర్‌ మార్గదర్శకత్వంలో ప్రభుత్వ యంత్రాంగం అతివేగంగా స్పందించింది. సహాయక బృందాలను దింపి మరపడవలను కూడా ఉపయోగించి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. గోదావరి పొడుగునా గ్రామాలను ఖాళీ చేయించి జనాలను సహాయ శిబిరాలలోకి చేర్చింది. జలదిగ్బంధంలో ఉన్న రైతులను హెలికాప్టర్‌ ద్వారా కాపాడింది. 

పూర్వం వానలు పడినా, చెరువులు మత్తడి దుంకినా ఊళ్ళు మునగకపోయేవి. కానీ ఇప్పుడు నగర వాడలు నీటిలో చిక్కుకుపోవడమేమిటనేది ఆలోచించవలసిన విషయం. 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌ సందర్శించినప్పుడు, నగర విస్తరణ అశాస్త్రీయంగా జరిగిందని హెచ్చరించారు. వరంగల్‌లోని 30 శాతం ప్రజానీకం 183 మురికి వాడలలో నివసిస్తున్నది. మధ్యతరగతి కాలనీల ఏర్పాటు కూడా చక్కగా లేదు. ఇంతగా విజ్ఞానాభివృద్ధి జరిగిన ఆధునిక యుగంలో నగరజీవనం ఎంత సుఖదాయకంగా ఉండాలి? వరంగల్‌ కావచ్చు, కరీంనగర్‌ కావచ్చు-  పట్టణ ప్రాంతాలను అమెరికా నగరాలను తలపించే రీతిలో తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష. కానీ తెలంగాణ సంక్షేమాన్ని సహించలేని శక్తులు అవరోధాలను కలిగిస్తున్నాయి. ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం లేదా ప్రజల చేత ఆందోళనలు చేయించడం ద్వారా అడ్డుకుంటున్నాయి. 

తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు వరద బీభత్సాన్ని చాలా వరకు కట్టడి చేశాయి. ఇందుకు మిషన్‌ కాకతీయ పథకం ఒక ఉదాహరణ. పరాయి పాలనలో వానలు పడినప్పుడల్లా వేలాది చెరువు కట్టలకు గండ్లు పడేవి. దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది. వెంటనే ఆ గండ్లను పూడ్చకపోవడం వల్ల చెరువులు నిరుపయోగమయ్యేవి. 2010లో నైతే నాలుగు వేలకు పైగా చెరువుల కట్టలు తెగిపోయాయి. మిషన్‌ కాకతీయ ప్రారంభమైన తరువాత చెరువు కట్టలకు గండ్లు పడటం చాలా వరకు తగ్గిపోయింది. 2017లో 43, 2018లో 125, 2019లో 100 చెరువులకు మాత్రమే గండ్లు పడ్డాయి. గ్రామాలను, నగరాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం మాత్రమే తలచుకుంటే సరిపోదు. ప్రజలు చైతన్యవంతులై తమ వంతు కృషి చేయాలి. పరాయిశక్తుల కుట్రలను తిప్పికొట్టాలి. logo