శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Aug 18, 2020 , 00:28:41

వేప బీజ ఏకదంతం ఉపాస్మహే

వేప బీజ ఏకదంతం ఉపాస్మహే

‘శతాయుర్వజ్రదేహాయ సర్వ సంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకుసుమ భక్షణం..’

ఇది ఆర్యోక్తి. వరాహ మిహిరుడి ఖగోళ, భూగోళ విశ్లేషణల్లో..,  ‘సుశ్రుతుడి వైద్య రీతుల్లో.., చరక సంహిత ఆయుర్వేదంలో.., కరోలియస్‌ వాన్‌ లిన్నేయస్‌ చేసిన వృక్షజాతి వర్గీకరణలో.. వేప విశిష్టత, అవసరం ప్రస్ఫుటంగానే కనిపిస్తుంది.వేప చెట్టును సంస్కృతంలో ‘నింబ’ అంటారు. అందులో నుంచే ఇంగ్లీషు ‘నీమ్‌' అనే పదం పుట్టింది. వృక్షజాతిని వర్గీకరించి పేర్లు పెట్టే క్రమంలో కరోలియస్‌ వాన్‌ లిన్నేయస్‌ వేప చెట్టు మూలం ఇండియాలో ఉందన్నారు.  

వేపలో వేర్ల నుంచి బెరడు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూత, గింజ, కాయ, పండు వరకు ప్రతి భాగంలో ఔషధ గుణాలున్నాయి. వేప ఆకు చర్మ వ్యాధులను నివారిస్తుంది. వేప నూనె కీళ్లు, కండరాల పటుత్వానికి ఉపయోగపడుతుంది. వేప పుల్ల దంతరక్షణకు శ్రేయస్కరం. వేప పువ్వు జీర్ణ కోశ వ్యాధుల నివారణకు, చికిత్సకు ఉపయోగపడుతుంది. వేప గుజ్జు వ్యవసాయంలో క్రిమి సంహారిణి. వేప వల్ల కనీసం వంద రకాల ప్రయోజనాలున్నాయి. కాలుష్యాన్ని నిరోధించే స్థాయిలో ఆక్సిజన్‌ ఉత్పత్తికి వేపను మించిన ప్రత్యామ్నాయం లేదు. గాలిలో ఎక్కువ శాతం ఆక్సిజన్‌ వేప ద్వారానే సాధ్యమని నిపుణులు తేల్చారు. వేప చెట్టు రోజుకు 250 లీటర్ల ఆక్సిజన్‌ విడుదల చేస్తుంది. మనిషి రోజుకు 550 లీటర్ల ఆక్సిజన్‌ను పీలుస్తాడు. 

పారిశ్రామిక ప్రగతి ప్రసవించిన కాలుష్యంఫలితంగా ఆక్సిజన్‌ స్థాయి పడిపోయి జనం అనేక రకాల రుగ్మతలకు లోనుకావాల్సి వస్తున్నది. సహజంగా పొందాల్సిన ఆక్సిజన్‌ను కూడా కొనుగోలు చేసి పీల్చుకోవాల్సిన దుర్భర పరిస్థితి దాపురించింది. పట్టణాల్లో ఆక్సిజన్‌ క్లబ్బులు రావడం పర్యావరణానికి పట్టిన దుర్గతికి నిదర్శనం.

పూర్వీకుల హితోక్తుల్లోని సత్యాన్ని, వర్తమాన పరిస్థితుల్లోని వాస్తవికతను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతి ఇంటిలో కనీసం ఒక వేప మొక్క నాటాలని పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో పెద్దసంఖ్యలో వేప మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి పిలుపునందుకుని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ వినూత్న, ఆచరణీయ పద్ధతిని ఎంచుకున్నారు. ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌'లో వివిధ వర్గాలను భాగస్వామ్యం చేస్తూ పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని విజయవంతంగా సాగిస్తున్న సంతోష్‌ కుమార్‌ ఇప్పుడు కాలుష్య రక్కసి నుంచి ముక్తి మార్గం సూచిస్తున్నారు. భారతీయ సాంస్కృతిక మూలాల నుంచి జాతీయ భావనా దీప్తిని రగిలించడానికి బాల గంగాధర తిలక్‌ ఎంచుకున్న దారిలో సంతోష్‌ ప్రయాణిస్తున్నారు. ‘విత్తన గణపతి’ పేరుతో వేప పురోగతికి సంతోష్‌ నడుం బిగించారు. గణపతి మట్టి విగ్రహాలలో మేలు రకమైన వేప విత్తనాన్ని చేర్చి బహుమతిగా అందిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా లక్షల సంఖ్యలో వీటిని పంపిణీ చేస్తున్నారు. గణపతి ఉత్సవాల సందర్భంగా అట్టి వినాయక ప్రతిమను నిమజ్జనం చేసేందుకు కొబ్బరి కుండి కూడా ఇస్తున్నారు. నిమజ్జనం తర్వాత ఆ పాత్రతో సహా విత్తనాన్ని భూమిలో నాటడమే తరువాయి. 

దైవిక కార్యక్రమాలు, మతపరమైన కర్మలు ప్రజాహితంతో ముడిపడితేనే వాటికి శాశ్వతత్వం, సార్థకత చేకూరుతుందనే రామ్‌ మోహన్‌ రాయ్‌, రవీంద్ర నాథ్‌ ఠాగోర్‌ లాంటి సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమకారుల స్పూర్తిని కొనసాగించడం ద్వారానే వినాశనాన్నినివారించవచ్చు. స్వామి కార్యం పేరిట జరుగుతున్న గణపతి ఉత్సవాలను సమాజ సంక్షేమం దిశగా ఉపయోగించాలనే సంతోష్‌ లాంటి వారి తలంపు కచ్చితంగా సాంస్కృతిక పునరుజ్జీవన లక్ష్యం వైపు పయనమే. పటిష్టమైన భూమిని చీల్చుకుంటూ, దాని గురుత్వాకర్షణ శక్తినీ సవాల్‌ చేస్తున్నదా అన్నట్లు ఆకాశానికి దూసుకెళ్లే మొక్క.. ఎదుగుదలకు అవరోధకంగా మారిన మధ్య యుగాల నాటి మూఢ విశ్వాసాల మురుగు నుంచి జనావళి బయట పడాల్సిన తెగువను నేర్పుతున్నది.  ‘ఏ మతమైనా, ఎవరి అభిమతమైనా అంతిమంగా మనిషే అన్నిటికీ కొలమానం’ అని క్రీ.పూ. 5వ శతాబ్దానికి చెందిన గ్రీకు తత్వవేత్త ప్రోటాగరస్‌ నుంచి క్రీ.శ.20 శతాబ్దానికి చెందిన భారతీయ తత్వవేత్తలు మానవేంద్ర నాథ్‌ రాయ్‌, జిడ్డు కృష్ణమూర్తి వరకు అనేకులు అన్నది అందుకే.  


logo