శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Aug 18, 2020 , 00:28:41

చేటుకాలం

చేటుకాలం

రాకు.. కడుపులో చల్లకదలకుండా

అక్కడే ఉండు.. రమ్మని పిలిచే కమ్మదనానికి

కాటుక తెగులు పట్టింది..!

ఇచ్చి పుచ్చుకోవడానికి, ప్రేమలెటూ అందుబాటులో లేవు

మాయదారి అంగట్లో కాటగల్సినయ్‌!

కలవలేం.. కలబోసుకోలేం

కన్నీళ్లు కూడా.. కాలకూటమయ్యే కాలం వచ్చింది

రెప్పల్లోకే కుక్కేసుకో.. దొరలనీకు

తాకితే.. తగులుకోవచ్చు

అంటకు.. అంటితే మంటగలిసి పోతం..!

పండగైనా పబ్బమైనా

సారెలేదు చీరెలేదు శానిటైజర్‌లు తప్ప

కడిగీ కడిగీ సబ్బుకులోకువైన చేతులతో సమీపించలేను

అనుమానపు అగ్గి తెగులు సోకింది

పాదాలు వాకిలికి పరాయివై

కడపల్లోనే కడుపు చించుకుంటున్నయి

దేన్నీ శాసించలేం దేహమై శ్వాసించలేం

ముక్కుకీ మూతికీ ఉగ్గంకట్టుకుని గూటికి తాళం వేసుకున్నం!

చేటుకాలానికి హారతీ పట్టకు

చెరిగిపోసే పురుగును చేరబిలువకు

ఆచారాలు ఇప్పుడు అనువుగాని ఆచరణలు

విచారాలు వివేకానికి కాలపరీక్షలు!

ఉగ్గబట్టుకో..ఊపిరి చుట్టూ ఉత్పాతం కమ్ముకుంది

కసిసొచ్చే కాలం నడిచి రానీ

కాటేసే సమయం కాలిపోనీ...

-వఝల శివకుమార్‌,9441883210

(మహమ్మారి కాలంలో మమకారం కోసం కడపదాటి కరోనాకు బలైన మా మేనత్తకు కన్నీటి నివాళిగా...)


logo