గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Aug 15, 2020 , 00:08:53

సమష్టిగా.. నిలకడగా.. సుస్థిర అభివృద్ధి

సమష్టిగా.. నిలకడగా.. సుస్థిర అభివృద్ధి

(1993 ఆగస్టు15న ఎర్ర‌కో‌టపై నుంచి ప్రధాని పీవీ నర‌సిం‌హా‌రావు ప్రసంగం సంక్షిప్త రూపం..)

ఈ రోజు మనకు మరపురాని రోజు. గతాన్ని మననం చేసుకుంటూ భవిష్యత్‌ గురించి ఆలోచించాల్సిన తరుణంఇది. రెండేళ్లలో భారత ప్రభుత్వం సాధించిన ప్రగతి, ప్రజల విజయాలు మీ అందరికీ తెలిసినవే అయినప్పటికీ ఒకసారి అవలోకనం చేయాలని అనుకుంటున్నా. గత ప్రభుత్వాల వారసత్వంగా వచ్చిన ఆర్థిక సంక్షోభాన్ని రెండేళ్లలోనే అధిగమించిన తీరు అద్భుతం.  దేశం సాధిస్తున్న సత్ఫలితాలే ఆర్థిక పటిష్ఠతకు నిదర్శనం. మౌలిక సదుపాయాల రంగం ముందుగానే బలంగా ఉండేది. కానీ ఏడాది రెండేళ్లు సరైన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల గాడి తప్పింది. ప్రభుత్వం తీసుకున్న మరమ్మతు చర్యలతో వ్యవస్థను చక్కదిద్దగలిగాం.

విదేశాల్లోని వస్తు ధరల హెచ్చుతగ్గులు మన దేశంపై ప్రభావం చూపడంలేదు.  క్రమక్రమంగా ధరల్ని నియంత్రించగలిగాం. బయట దేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావాల్సిన అవసరముందా అనే సందే హం చాలా మందికి ఉండొచ్చు. విదేశీ పెట్టుబడుల ద్వారానే విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. మనం కిరోసిన్‌, ఎరువులు, యంత్ర సామగ్రి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం విదేశీ మారక నిల్వలు అవసరం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి మన దేశానికి రూ.2వేల కోట్ల నుంచి రూ.24వేల కోట్ల విదేశీ మారక నిల్వలు మాత్రమే ఉన్నాయి. కేవలం వారం రోజుల్లో నిల్వలు ఖాళీ అయిపోయే దశలో ఉన్నాయి. కానీ నేడు ఈ మొత్తం రూ.21000 కోట్లకు పెరిగింది. అంటే 7 బిలియన్‌ డాలర్లు. ప్రస్తుతం ఏదైనా దిగుమతి చేసుకోవాలంటే ఎలాంటి సమస్య లేదు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి ఎగుమతులు, దిగుమతులు సమతులంగా ఉన్నాయి. కాబట్టి విదేశీ మారక నిల్వలను ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం చేపడుతున్న పథకాలన్నీ ధనికుల కోసమే అంటూ కొందరు బాధ్యతారహితమైన విమర్శ చేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలన్నీ పేదలను దృష్టిలో పెట్టుకునే చేపడుతున్నాం. జవహర్‌ రోజ్‌గార్‌ యోజన, గ్రామీణాభివృద్ధికి నిధులు గణనీయంగా పెంచాం. ఈ ఏడాది బడ్జెట్‌లో విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధికి భారీగా కేటాయింపులు చేశాం. ఈ రంగాలు సమాజంలోని సంపన్నుల కోసమని ఎవరూ అనరు కదా!

మనవద్ద పారిశ్రామిక అభివృద్ధి కోసం సరిపడా వనరులు లేవు. పారిశ్రామిక అభివృద్ధి జరగకపోతే నిరుద్యోగం పెరిగిపోతుంది. సమాజంలో అశాంతి నెలకొంటుంది. దేశ విచ్ఛిన్నానికి దారి తీస్తుంది. ఆందుకే పారిశ్రామిక అభివృద్ధి చాలా ముఖ్యం. ప్రస్తుతం దేశంలో పారిశ్రామిక అభివృద్ధి పురోగతి దిశలో సాగుతున్నది. ప్రస్తుతం 10 వేల చిన్న, భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఉద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పోయినప్పుడు సమస్యలు ఎదురు కాకుండా రూ.2000 కోట్లతో ప్రత్యేక నిధి కేటాయించాం. తిరిగి మరో ఉద్యోగం, ఉపాధి అవకాశం కలిగించడంలో భాగంగా నైపుణ్య శిక్షణ ఇస్తాం. ఇందుకోసం ప్రత్యేక నిధిని వినియోగిస్తాం.

వ్యవసాయం విషయానికి వస్తే.. 40 ఏండ్లలో ఎప్పుడూ లేనంత ఉత్పత్తి ఈ ఏడాది నమోదైంది. నూతన వ్యవసాయ విధానంలోనూ ఎగుమతులకు ప్రాధాన్యం కల్పించాం. ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు రావాలి. వ్యవసాయ అభివృద్ధిలో భాగంగా నీటిపారుదల రంగంపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలి. చాలా దేశాలు ఆయా దేశాల ప్రజల అవసరాల కోసమే కాకుండా ఎగుమతుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని వ్యవసాయం చేస్తున్నాయి. ఇదే తరహా వృద్ధిని కొనసాగిస్తూ ఉంటే భారత్‌ సత్ఫలితాలు సాధిస్తుంది. గడిచిన రెండేళ్లుగా రైతులకు ఇస్తున్న మద్దతు ధరను పెంచుతూ ఉన్నాం. ఇంత పెద్ద మొత్తంలో మద్దతు ధర పెంపు గతంలో ఎప్పుడైనా జరిగిందా? అతివృష్టి అయినా అనావృష్టి అయినా పంటబీమా రైతుకు ధీమా ఇస్తుంది. రైతులు ఏటా నష్టపోతూనే ఉన్నారు. వరదల్లో పంట నష్టపోయే రైతుకు మళ్లీ వరద వచ్చే నాటికి కూడా సాయం అందడం లేదు. ఈ పరిస్థితి పోవాలి. నష్టపోయే రైతును ఆదుకునేందుకు శాశ్వత పరిష్కారం వెతకాలి. రాజకీయాల విషయానికి వస్తే..పంజాబ్‌లో స్థానిక పరిస్థితులు చక్కబడ్డాయి. ప్రజల సహకారం, సాయుధ బలగాల కృషితో శాంతి నెలకొంది. వ్యవసాయపరంగా పంజాబ్‌ పురోగతి సాధిస్తున్నది. రెండు మూడేళ్లలో పారిశ్రామికంగా కూడా ప్రగతి బాట పడుతుంది. ఇక కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగు పడాల్సిన అవసరమున్నది. చాలా స్వల్ప మార్పు కనిపిస్తున్నప్పటికీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కశ్మీర్‌లో పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయి. ఉగ్రవాదులకు డబ్బు, శిక్షణను పాకిస్థాన్‌ అందిస్తున్నది. సమస్య అనేది కశ్మీర్‌ అంతర్గతంగా లేదు. బయట నుంచి వస్తున్నదే. 

జమ్ముకశ్మీర్‌ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాకిస్థాన్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నది. రెండు రోజుల క్రితం పాకిస్థాన్‌ ఉగ్రవాదులు ఓ బస్సును మధ్యలో ఆపి, 16 మందిని చంపేశారు. పాకిస్థాన్‌ బుల్లెట్లకు బలయ్యే వారికి మానవ హక్కులు ఉండవా! ఉగ్రవాదుల చేతిలో సామాన్యులు మరణించినప్పుడు స్పందించని వాళ్లు, ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయినప్పుడు ఎందుకు స్పందిస్తారు! ఉగ్రవాదుల చేతిలో చనిపోయే వారికి మానవ హక్కులు, జీవించే స్వేచ్ఛ ఉండవా? సామాన్యులను చంపడానికి ఉగ్రవాదులకు ఏమైనా హక్కు ఉందా. ఇలాంటి సిద్ధాంతాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు. కశ్మీర్‌ భారత అంతర్భాగం, దాన్ని ఎవరూ వేరు చేయలేరు. 

అయోధ్య అంశంపై వ్యాఖ్యానించాలంటే సంశయించే వాణ్ని. కానీ ప్రస్తుతం మాట్లాడకతప్పదు. అయోధ్య ఘటన స్వచ్ఛమైన భారత ప్రతిష్ఠకు మచ్చ పడేలా చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకోవడం అలవాటుగా మారిపోయింది. మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మతాన్ని అనుసరించడం తప్పనిసరే. లేకపోతే మనిషికి దిశానిర్దేశం లేకుండా పోతుంది. కానీ ఆ మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవడమే బాధాకరం. సమాజాన్ని మార్చడానికి రాజకీయ రంగం ఉంది. మతం, రాజకీయం రెండూ వాటి వాటి గౌరవప్రదమైన స్థానాలు కలిగి ఉన్నాయి. కానీ మతాన్ని రాజకీయంతో కలిపితే అది ఎంతమాత్రం మతంగా ఉండదు. అది మతతత్వంగా మారుతుంది. మనమంతా ఐక్యంగా నిలబడి మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరమున్నది.


logo