శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Aug 15, 2020 , 00:08:54

నైతికతకు ప్రమాణాలుంటాయా?

నైతికతకు ప్రమాణాలుంటాయా?

పనిలో నైపుణ్యం ఉందంటే ఫలితం తప్పక వస్తుంది. కానీ ఫలితం బదులు ‘లాభం’, అది కూడా న్యాయసమ్మతం కాని లాభాలను సాధించడమే పనిగా పెట్టుకుంటే.. కపటం, మోసం వైపు దారి మళ్లిపోతుంది. లాభార్జనలో పోటీ పెరిగినపుడు అణచివేత, నేరప్రవృత్తి చోటుచేసుకుంటాయి. ‘తమకు కావలసినదానికన్నా ఎక్కువ సంపద గల వారంతా ధర్మకర్తలుగా ఉండి, సామాజిక అనైక్యతను తుడిచిపెట్టేందుకు సహకరించాలి’ అని గాంధీజీ చెప్పేవారు.  

విజ్ఞానం, క్రియాశీలత కలిసినపుడు అత్యున్నత ప్రమాణాలను సాధించడం జరుగుతుం ది. దీనిని ఆధునిక యుగంలో ‘స్టాండర్డ్స్‌' అంటారు. ఐ.క్యూ., ఇ.క్యూ., స్థూల జాతీయ ఉత్పత్తి, ద్రవ్యోల్బ ణం, ఐఎస్‌ఓ, 6 సిగ్మా స్కేల్‌, నాణ్యతా సూచిక, ఇలాంటివన్నీ వస్తువులకు, సేవలకు గల కొన్ని కొలమానాలు. మరి, జీవన ప్రమాణాలంటే ఏమిటి?

అక్షరాస్యత, శిశుమరణాల శాతం, జీవన వయో పరిమితి అనే మూడు వివరాలతో ఒక దేశపు జీవన నాణ్యతను Physi -cal Quality of Life Index గా లెక్కించవచ్చని మోరిస్‌ డేవిడ్‌ మోరిస్‌ 1970లో చెప్పారు. అలాగే ఒక దేశపు సంతోష సూచిక ఆ దేశపు పర్యావరణ కర్బన ఉద్గారాల ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుందని 2006లో ప్రకటించారు. ఆనందం, అభిమానం, ఆందోళన, కోపం, బాధ వంటివి కుటుంబ, సంఘ జీవనంలో తృప్తి, విద్య ఉద్యోగ సముపార్జనలో సౌలభ్యం, ఆరోగ్యం, పేదరికం, ఒంటరితనం మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఈ జీవన నాణ్యత విషయంలో డెన్మార్క్‌ ప్రథమ స్థానంలో ఉండగా, భారత్‌ 134వ స్థానంలో ఉన్నది. 

సరిహద్దులు చెరిపిన డిజిటల్‌ ప్రపంచంలో చదువు, ఉద్యోగావకాశాలు, వస్తువిపణి అంతర్జాతీయంగా ఒకేలా ఉండగా రాజకీయ సంక్షోభం, వర్గపోరాటం, అణచివేత, సైబర్‌నేరాలు కూడా అన్నిచోట్లా ఒకేలా ఉంటున్నాయి. వస్తువుల మన్నికకు ‘ఐఎస్‌ఓ’, ‘ట్రేడ్‌మార్క్‌' వంటి ప్రమాణాలు తప్పనిసరి అవుతున్నాయి. మరి మనుషుల ప్రవర్తనకు ప్రామాణికత ఎలా నిర్ధారించగలం? ఆధునిక జీవన విధానంలో విలువలు, నీతి, నియమాలకు ప్రాధాన్యం, పట్టింపు తగ్గాయి. ద్వంద్వ ప్రమాణాలు అధికమయ్యాయి. 2019లో ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం పొందిన అభిజిత్‌ బెనర్జీ ఇలా అన్నారు.

‘పేదరికం అంటే డబ్బు లేకపోవడం అని భావించడం కాకుండా.. ఉచిత ఆహారం పంచి పెట్టడం వంటి స్వల్పకాలిక పరిష్కారం చూపడంకాకుండా.. పేదల అవసరాలను గుర్తెరిగి నడుచుకోవాలి. అత్యంత సంపద కలిగిన నగరాల్లో అతి పేదలు జీవించడం ఆర్థిక వ్యవస్థలో లోపమని తెలుసుకుంటే ఈ భేదం గురించి అవగాహన కలుగుతుంది’. 70-80 నిరుపేద సమూహాలను నిశితంగా పరిశీలించి, శాస్త్రీయ పరిశోధనలు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ధనిక పేద వర్గాల నడుమ వ్యత్యాసం పెరగడం వల్ల, వారి మౌలిక అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వ కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. ఇందుకు శాశ్వత పరిష్కారం చూపకుండా ఇటు కేటాయింపులు చేస్తూ.., అటు ప్రైవేటు రంగ, వ్యక్తిగత అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. సగటు మనిషి ఆర్థిక స్తోమత పెరిగినట్టు కనిపించినా ప్రభుత్వమో, స్వచ్ఛంద సంస్థలో కలుగజేసుకుంటే తప్ప విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు వంటి మౌలిక వసతులు అందరికి లభించడం లేదు. 

‘నీవెన్నుకునే మార్గం రుజువైనదైతే గమ్యం దానంతట అదే లోకహితమవుతుంది..’ అన్న గాంధీ మాటలను ఇక్కడ తలచుకోవాలి. ‘పరిశుభ్రతయే దైవత్వం’ అన్న గాంధీ ప్రబోధ వాక్యంలో పరిసరాల పరిశుభ్రతయే కాదు, అంతరంగం కూడా తేటతెల్లంగా ఉండాలని అవగతమవుతుంది.  ఈ కాలంలో ప్రజల బలహీనతలే పెట్టుబడిగా వేలకోట్ల ధనం సంపాదించడం, ఆపై దానిని దానధర్మాలు చేయడం కార్పొరేట్‌ దిగ్గజాలకు పరిపాటిగా మారింది.  ‘విలువలు.. అంటే తనకేమి జరిగినా న్యాయాన్ని అంటిపెట్టుకుని ఉండటం’ అని చెప్తారు గాంధీజీ. తాను న్యాయవాదిగా ఉన్నపుడు కక్షిదారుని చేత అబద్ధం చెప్పించవలసి వచ్చినందుకు ఆ వృత్తిని వదులుకున్నారాయన. కనీస వృత్తి నియమాలను పాటించవలసిన నైతిక బాధ్యత ప్రతి వ్యక్తిలో పెరుగాల్సి ఉంది. 

పోటీ పేరు చెప్పి కంపెనీల నడుమ నెలకొనే ప్రచ్ఛన్న, పరోక్ష యుద్ధ వాతావరణం యువతను నిరంతరం ఒత్తిడికి గురిచేయడం గమనార్హం. అహింసను వెన్నంటి ఉన్న నిర్భీతి, సత్యంలో భాగమైన నిస్వార్థం ఈ రెంటిని ఉద్యమ సూత్రాలుగా ఎంచుకోవడం గాంధీ వ్యక్తిగత విలువలకిచ్చిన ప్రాముఖ్యాన్ని సూచిస్తుంది. గాంధీ కోరుకున్నది బ్రిటిషు వారి నుంచి రాజకీయ స్వేచ్ఛ ఒక్కటే కాదు, వలస రాజ్యాలను కొల్లగొట్టే  వారి దృక్పథం మారాలని. ఇదే విషయం మార్టిన్‌ లూథర్‌కింగ్‌ దక్షిణాఫ్రికా స్వాతంత్య్రోద్యమ సమయంలో ప్రకటించారు. 

గాంధీ కోరుకున్న మరొక మార్పు భారత సమాజంలో అస్పృశ్యత, స్త్రీల అణచివేత, నిరక్షరాస్యత, నిరుద్యోగం, విదేశీ వ్యామోహం, విలాసవంతమైన జీవన విధానం రూపుమాసిపోవాలని. సంఘసేవ అంటే అన్యాయంగా సంపాదించిన సొమ్మును సేవాకార్యక్రమాల పేరిట పంచిపెట్టి పేరు ప్రతిష్ఠలకు ఆశ పడటం కాదు. పరుల శ్రేయస్సును తన శ్రేయస్సుగా పరిగణించడం. అసమానతల వలన ఎందరో నిరుద్యోగులై, శరణార్థులై, వలస పౌరులై, ఆహారం ఆశ్రయం కరువైన సమూహాలుగా మారుతారు. ఆ పరిస్థితి సామాజిక అస్థిరతకు దారితీస్తుంది. ఈనాడు మేధను అమ్ముకున్నట్లు కొన్నాళ్ళకు అవయవాలను అమ్ముకునే పరిస్థితి రావచ్చు. వసుధైక కుటుంబం అంటే అంతర్జాల మార్కెట్‌ కాదు. శ్రమైక సౌందర్యం, వ్యక్తుల మధ్య సౌభ్రాత్వం. 

- నాగసూరి వేణుగోపాల్‌

-కాళ్ళకూరి శైలజ


logo