శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Aug 15, 2020 , 00:10:05

ఇరుపక్షాలతో చర్చలు

ఇరుపక్షాలతో చర్చలు

ఆరో అధ్యాయం కొనసాగింపు..

 వివాదాస్పద కట్టడాన్ని డైనమెట్లతో పేల్చివేయటానికి ప్రయత్నించిన మధుర బృందావనంకు చెందిన సురేష్‌చంద్ర అనే అతన్ని భద్రతాదళాలు పట్టుకున్నాయి. అతను, అతనితో మరొకరు ఆరు రోజులపాటు రామజన్మభూమి ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలించారు..

కట్టడానికి దక్షిణ దిశలో ఉన్న కుబేర్‌టీలా వద్దకు సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. 8 గంటల ప్రాంతంలో దేవళాన్ని కాపలా కాసేవాళ్ల సంఖ్య తగ్గటంతో అడ్డంగా కట్టిన గొట్టాలను, ముళ్లతీగె కంచెను దాటి సుమిత్రా భవన్‌ దగ్గర్లో పొదల చాటున దాక్కున్నారు. తరువాత 10 గంటల సమయంలో మెల్లగా ముందుకు వెళ్తూంటే అప్రమత్తంగా ఉన్న కేంద్ర రిజర్వుపోలీసు దళానికి చెందిన రక్షక భటుడు చూసి సురేష్‌ను పట్టుకున్నాడు. అతను ఒక పర్యాయం ఢిల్లీలోను, ఒక పర్యాయం మధురలోనూ అరెస్టు అయినట్లు చెప్పాడు. మధురలో అతను 1990 అక్టోబరు 29న ఎల్‌కే అద్వానీని అరెస్టు చేసినదాన్ని ఖండిస్తూ చేసిన ఆందోళన సమయంలో నిర్బంధింపబడ్డాడు. తమ నడుంచుట్టూ పేలుడు పదార్థాలు కట్టుకున్నామని తెలియజేశాడు. మొత్తం పేలుడు పదార్థపు పుల్లలు నాలుగు కట్టలు అతని వద్ద లభించాయి. ఆ పుల్ల ఒక్కొక్కటి 8 లేక 9 అంగుళాల పొడవు, ఓ అంగుళం మందం ఉంది. 

సంప్రదింపులు ప్రారంభమయ్యాయి

వీహెచ్‌పీ- బాబ్రీ మసీదు నాయకులతో చంద్రశేఖర్‌ మంతనాలు జరిపారు. 1990 డిసెంబరు 1న, 4వ తేదీన సమావేశాలు జరిగాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి శరద్‌పవార్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భైరాన్‌సింగ్‌ షెకావత్‌, యూపీ ముఖ్యమంత్రి ములాయంసింగ్‌ యాదవ్‌లు కూడా ఆ సమావేశాలకు హాజరయ్యారు. అంతకుముందున్న ఓ మందిరాన్ని తొలగించి బాబ్రీ మసీదు నిర్మింపబడిందా లేదా అనే విషయాన్ని నిగ్గుదేల్చాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. ఆ సందర్భంగా మరో మూడు నిర్ణయాలు చేశారు. ఇరువర్గాలు 1990 డిసెంబరు 22 లోగా తమ వద్దగల రుజువుల్ని  హోంశాఖ సహాయమంత్రికి అప్పగించాలన్నారు. అప్పుడు వాటి నకళ్లను (ఫోటో కాపీల రూపంలో) సంబంధించిన వాళ్లందరికీ ఆ మంత్రిగారు 1990 డిసెంబరు 25లోగా అందేట్లు చూస్తారు. రుజువులు అందుకున్న తరువాత ఇరుపక్షాలు తిరిగి మహారాష్ట్ర సదన్‌లో 1991 జనవరి 10న జరిగే సమావేశానికి హాజరుకావాలి. ఇరువర్గాలతో అలా చర్చలు కొనసాగిస్తూనే 1990 డిసెంబరు 22న ఆయనొక ప్రకటన చేశారు. ఈ సమస్య పరిష్కారానికి రాజీవ్‌ గాంధీ సూత్రాన్ని అనుసరించే అవకాశాన్ని కనుగొనేందుకు ఆయన త్వరలో ప్రధాన న్యాయమూర్తిని కలువనున్నట్లు తెలిపారు. ప్రధానికి రాజీవ్‌గాంధీ లేఖరాస్తూ, మిగతా విషయాలతోపాటు బాబ్రీ మసీదు నిర్మాణానికి పూర్వం అక్కడవున్న రామమందిరాన్ని కూల్చారా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన దర్యాప్తు కమిషన్‌ను నియమించి, వాళ్ల నివేదికను మూడు మాసాలలోపు సమర్పించమనేట్లు కోరమని సలహా నివ్వటం జరిగింది. 

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo