బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - Aug 13, 2020 , 23:43:20

ఆహార శుద్ధిపై దృష్టి

ఆహార శుద్ధిపై దృష్టి


తెలంగాణ సమాజ సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పరిపరివిధాల ఆలోచిస్తున్నదనడానికి తాజా ఉదాహరణ- ఆహార శుద్ధి, నిలువ- రవాణా రంగంపై దృష్టి సారించడం. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల సముదాయాన్ని నిర్మించడంతోపాటు చెరువులను పునరుద్ధరించడం ద్వారా సాగునీటి సమస్యతీరి, ఆహార ధాన్యం భారీ పరిమాణంలో పండుతున్నది. మరోవైపు గొర్రెలు, చేపల పెంపకానికి హంగులు, ప్రోత్సాహకాలు లభించాయి. శ్వేత విప్లవానికి కూడా ప్రభుత్వం దారులు వేసింది. ఈ భిన్న రకాల ఆహారోత్పత్తికి తార్కిక కొనసాగింపుగా ఆహార శుద్ధి, లాజిస్టిక్స్‌  రంగాన్ని అభివృద్ధి పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నది. ఆహార శుద్ధి, సరఫరా రంగాలను వృద్ధి చేయడం రైతులకు లాభదాయకమే కాకుండా, గ్రామీణ యువతకు ఉపాధి లభిస్తుంది. ప్రజలకు నాణ్యమైన ఆహారం లభిస్తుంది. ప్రోత్సాహకాలు ఇచ్చి, భాగస్వాములు చేయడం ద్వారా బలహీనవర్గాల, మహిళల సాధికారత సాధించవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు బుధవారం మంత్రి కేటీఆర్‌ సారథ్యంలో సాగిన మంత్రుల బృందం చర్చలను బట్టి అర్థమవుతున్నది. 


ఒకప్పుడు ఆహార పదార్థాల సరఫరా ప్రాంతీయంగా, మహా అయితే దేశవ్యాప్తంగా సాగేది. కానీ గత శతాబ్ది చివరి నాటికి ప్రపంచ మార్కెట్‌ బార్లా తెరుచుకున్నది. ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, శీతల పెట్టెలలో సరఫరా, విమాన రవాణా మూలంగా ఎగుమతులు పెరిగాయి. వ్యవసాయ, రుతువులను బట్టి సరఫరాలు మారుతుంటాయి. కొన్ని ప్రాంతాలకు తమదైన ప్రత్యేక పంటలుంటాయి. నగరీకరణ కూడా పెరుగుతున్నది. ఈ కారణాల వల్ల ఆహార సరఫరా ప్రపంచవ్యాప్త స్వభావాన్ని సంతరించుకున్నది. అమెరికాలో వినియోగమయ్యే డెబ్బయి శాతం ఆహార పదార్థాలు కోల్డ్‌ చైన్‌ ఫుడ్‌ వ్యవస్థ ద్వారా వచ్చేవే. ఇతర దేశాలలో కూడా ఆహారపు అలవాట్లు మారే కొద్దీ శీతల గొలుసు సరఫరా వ్యవస్థ స్థిరపడుతున్నది. దీనికి అనుగుణంగానే నియంత్రిత సాగువిధానాన్ని, ఆహార శుద్ధి పరిశ్రమను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. 


ఆహార పదార్థాల నిలువ, రవాణా చాలా క్లిష్టమైనది. క్షేత్రం నుంచి మార్కెట్‌ వరకు భిన్న వాతావరణ పరిస్థితులుంటాయి. దారి పొడుగునా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఏదో లోపం వల్ల సగటున 25 శాతం ఆహార పదార్థాలు చెడిపోతుంటాయి. ఆహార వినిమయ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు పసిగడుతుండాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే గ్రామాల వరకు పటిష్ఠమైన రహదారి సౌకర్యాన్ని కల్పించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టిసారించారు. పల్లెలను మార్కెట్‌కు అనుసంధానం చేయాలనే దీర్ఘకాలిక వ్యూహంలో ఇప్పటికే కొన్ని దశలు పూర్తయ్యాయి. రైతులతో పాటు గ్రామీణులంతా వ్యవసాయ, ఆహార శుద్ధి రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను అర్థం చేసుకుంటూ, వ్యాపారశీలతను అలవరచుకోవాలి. తెలంగాణ పదార్థాలకు మార్కెట్‌లో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. 


logo