శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - Aug 13, 2020 , 23:43:33

విశ్వనగరికి నవతరం నగిషీలు

విశ్వనగరికి నవతరం నగిషీలు

విశ్వ నగరాల ర్యాంకింగ్‌ రూపొందించే ప్రతిష్ఠాత్మక మెర్సర్‌ సంస్థ హైదరాబాద్‌ను వరుసగా ఐదోసారి దేశంలోనే అత్యున్నత జీవన ప్రమాణాలున్న నగరంగా గుర్తించింది.విద్య, వైద్యం, ప్రజారోగ్యం, రవాణా, శాంతి భద్రతలు, రాజకీయ సుస్థిరత తదితర 39 సూచికల ఆధారంగా ఈ కితాబిచ్చింది.  జేఎల్‌ఎల్‌ గ్లోబల్‌ సంస్థ  ‘ది మోస్ట్‌ డైనమిక్‌ సిటీ’ ర్యాకింగ్స్‌లో హైదరాబాద్‌కు మొదటి స్థానం ఇచ్చింది.  2014 లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చేనాటికి  ‘డైనమిక్‌ సిటీ ర్యాకింగ్స్‌' టాప్‌ 20 జాబితాలో కూడా హైదరాబాద్‌కు చోటు లేదు.

వందల ఏండ్ల చరిత్ర గలిగిన భాగ్యనగరానికి ఇది యాదృచ్ఛికంగా దక్కినది కాదు. ఇది కేటీఆర్‌ భవిష్యత్‌దర్శనానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. 2014 జూన్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేటీఆర్‌ నగరాభి వృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అదే సంవత్సరం డిసెంబర్‌లో తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ చైర్మన్‌తో కలిసి దుబాయ్‌లో స్మార్ట్‌సిటీ సీఈఓతో చర్చలు జరిపి ఐటీఐఆర్‌కు పెట్టుబడులను ఆహ్వానించారు. అలాగే అబుదాబీ కేంద్రంగా గల ‘లు లు’ కంపెనీ నుంచి ఎఫ్‌ఎంసీజీ రంగంలో హైదరాబాద్‌లో రెండున్నరవేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించారు. 2015లో రెండు వారాల అమెరికా పర్యటనలో మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, సిస్కో, ఒరాకిల్‌ తదితర 30 అగ్రవ్రేణి కంపెనీల సీఈవోలు, అగ్ర నాయకత్వంతో జరిపిన  ఫలప్రద చర్చలతో ఒక్క నెలలోనే 500 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల పెట్టుబడులకు మార్గం సిద్దం చేశారు. దీంతో విశ్వవ్యాప్తంగా హైదరాబాద్‌ గురించి కోలాహలం ప్రారంభమైంది. 2015 జూన్‌ లో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌ వారు నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సులో హాంకాంగ్‌కు చెందిన సుమారు 50 కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపి ఎలక్ట్రానిక్స్‌, హార్డ్‌వేర్‌, తయారీ రంగాలలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. తైవాన్‌ పారిశ్రమికవేత్తలను పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించారు. 

2016 మార్చ్‌ నాటికి 16శాతం అభివృద్ధి రేటుతోపాటు, ఐదు వందల ప్రపంచ స్థాయి కంపెనీలతో పాటు, 13వందల కంపెనీల ద్వారా 68,258 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు సాధించగలిగాం. సత్వర పారిశ్రామిక అనుమతుల కోసం రూపొందించిన టీఎస్‌ ఐపాస్‌ విధానం ప్రపంచ ప్రశంసలు పొందింది. 2015 జూలై-ఆగష్టు కాలంలో 25వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో వెయ్యి కంపెనీల అనుమతులు పొందటం ముదావహం. 

వరుస విజయాలతో జనాకర్షక నాయకుడిగా ఎదిగిన కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వారం రోజుల్లోనే వంద పబ్లిక్‌ మీటింగుల ద్వారా 150 డివిజన్లలో ప్రచారం నిర్వహించి ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ను గెలిపించారు.  దీంతో ఆయనకు అదనంగా నగర పాలన, నగరాభి వృద్ధి శాఖను సీఎం కట్టబెట్టడంతో ‘బ్రాండ్‌ హైదరాబాద్‌'కాన్సెప్ట్‌ ప్రారంభమైనది. బ్రాండ్‌ హైదరాబాద్‌ ఈవెంట్‌లో విశ్వనగరంగా హైదరాబాద్‌ అభివృద్ధికి తన దార్శనిక ప్రణాళికను కేటీఆర్‌ ఆవిష్కరించారు. వాటర్‌గ్రిడ్‌, పౌర సదుపాయాలు, ఘన వ్యర్థాల నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణ తదితర ప్రణాళికలతో నానాటికి హైదరాబాద్‌ ఇమేజ్‌ పెరుగుతూనే ఉన్నది.మున్సిపల్‌ మంత్రిగా బాధ్యత తీసుకున్న వంద రోజుల్లో మార్పు చూపిస్తానన్న ఆయన దానికి తగ్గట్టుగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలకు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు.  నగర సమతులాభివృద్ధి లక్ష్యంతో ‘లుక్‌ బియాండ్‌ వెస్ట్‌' అని ఉద్భోదిస్తూ  అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌ ఉత్తర, తూర్పు ప్రాంతాలలో కొత్త ఐటీ కారిడార్‌లను ఏర్పాటు చేశారు. దక్షిణాన 19వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి ఫార్మా సిటీ, ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు.  

యువ వ్యాపారవేత్తల మెంటరింగ్‌, స్టార్టప్‌ సొల్యూషన్స్‌కు సంబంధించి టీ హబ్‌ రెండో దశ త్వరలోనే మొదలవనున్నది. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 4000 స్టార్టప్‌లు ఒకేచోట, ఒక ‘స్పేస్‌ షటిల్‌' నమూనాలో రూపొందుతున్న నిర్మాణం  హైదరాబాద్‌ సమగ్రాభివృద్ధిని ప్రపం చానికి చాటనున్నది.   హైదరాబాద్‌ పరివర్తనకు కేటీఆర్‌ పర్యాయపదంగా నిలిచారనటంలో సందేహం లేదు. 

(వ్యాసకర్త: రాజనీతిశాస్త్ర ఆచార్యులు, కేయూ)


logo