ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Aug 12, 2020 , 23:24:28

డిజిటల్‌ బోధన దిశగా..

డిజిటల్‌ బోధన దిశగా..


అవరోధాలను అవకాశాలుగా మలుచుకున్నవారే విజేతలవుతారు. కరోనా వైరస్‌ మూలంగా విద్యారంగం స్తంభించిపోయిన పరిస్థితుల్లో డిజిటల్‌ బోధన ప్రారంభించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం. ఉపాధ్యాయులకు శిక్షణనివ్వడంతోపాటు, అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా విద్యార్థులకు డిజిటల్‌ బోధన సాగించాలనే నిర్ణయం సందర్భానుసారంగా ఉన్నది. విద్యార్థులకు డిజిటల్‌ బోధన సాగించడం ద్వారా రెండు రకాల ప్రయోజనాలను నెరవేర్చినట్టు అవుతుంది. ఒకటి - డిజిటల్‌ సాంకేతికతను సాధనంగా చేసుకొని విద్యాబోధనను సమర్థవంతంగా, నిరంతరాయంగా సాగించవచ్చు. రెండవది- విద్యను  సాధనంగా చేసుకొని డిజిటల్‌ సాధికార సమాజాన్ని నిర్మించవచ్చు. ఇంతకాలం విద్యాగంధం అట్టడుగువర్గాలకు చేరకపోవడం వల్ల రెండురకాల ప్రపంచాలుగా సమాజం విడిపోయి ఉన్నది. ఇప్పుడు సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తున్న వేళ, సమాజం మళ్ళీ డిజిటల్‌ విభజనకు గురి కాకూడదు. అందువల్ల ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ విద్య అభిలషణీయమైనది. 


సమాజంలోని భిన్న పార్శాలలో కృత్రిమ మేధ, బ్లాక్‌చైన్‌ వంటి అత్యాధునిక సాంకేతికతలు వేగంగా చొరబడుతున్నాయి. పరిపాలన, కొనుగోళ్లు, వ్యవసాయం, విద్య, వైద్యం, వినోదం వంటి ఏ రంగమూ ఈ మార్పునకు అతీతం కాదు. దశలవారీగా వస్తున్నదనుకున్న పరివర్తన- కరోనా వ్యాప్తి మూలంగా ప్రపంచవ్యాప్త మహా విప్లవంగా మారిపోయింది. తక్షణం అప్రమత్తమై తదనుగుణంగా విద్యార్థిలోకాన్ని సిద్ధం చేయకపోతే, మనం మళ్ళీ వెనుకబడిన సమాజంగానే మిగిలిపోతాం. విద్యారంగాన్ని సాధనంగా చేసుకోవడం ద్వారా సాంకేతిక ప్రతిభాసమన్విత సమాజాన్ని నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వ వ్యూహం ఏ విధంగా చూసినా ప్రశంసనీయమైనది. 


డిజిటల్‌ మార్గంలో విద్యాబోధన సాగించడానికి అవరోధాలు, పరిమితులు ఉండవా అనే ప్రశ్న తలెత్తవచ్చు. ఏ మార్పు తలపెట్టినా సమస్యలు ఉండటం సాధారణం. అందులో విప్లవాత్మక మార్పు చేపట్టడం కష్టంగానే ఉంటుంది. ప్రత్యేకించి ఉపాధ్యాయులు తమ శక్తియుక్తులను కూడదీసుకొని బోధన సాగించవలసి ఉంటుంది. అనతికాలంలోనే వారు కొత్తవిధానానికి తాము అలవాటు పడటమే కాకుండా, సాంకేతికతను అందిపుచ్చుకున్నప్పుడే విద్యార్థులను తదనుగుణంగా తీర్చిదిద్దగలరు. ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పడానికే పరిమితం కారు. విద్యార్థులను అన్ని కోణాల్లో ప్రత్యక్షంగా గమనిస్తూ వారి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతారు. అందువల్ల నియత విద్యకు డిజిటల్‌ బోధనా విధానం ప్రత్యామ్నాయం కాదు. ప్రస్తుతం ఆపత్కాల అవసరమైతే, దీర్ఘకాలంలో విద్యావిధానాన్ని పరిపుష్టం చేసే సాధనంగా మారుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నట్టు- ఎప్పుడూ చైనా అది సాధించిందీ, అమెరికా ఇది సాధించిందీ.. అని చెప్పుకోవడమేనా? మనం మట్టి తింటే, వారు బంగారం తింటున్నారా! మనమే వారిని మించి ఎందుకు అభివృద్ధి చెందకూడదు? 


logo