మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Editorial - Aug 12, 2020 , 23:24:27

జలప్రవాహాల్లో రగిలే జ్వాలలు

జలప్రవాహాల్లో రగిలే జ్వాలలు


శ్రీశైలం జలవిద్యుత్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తూ.. 1963 జూలై 25న ఆనాటి ప్రధాని నెహ్రూ చెప్పిన మాటలను రాష్ట్ర బీజేపీ నేతలు ఈనాటి ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లాలి. అవశేష ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి ఏవిధంగా జలచౌర్యానికి పాల్పడుతూ.. తెలంగాణ రాష్ర్టానికి అన్యాయం తలపెట్టిందీ, పర్యవసానంగా ఎలాంటి నష్టం తెలంగాణ ప్రాజెక్టులకు వాలిల్లుతున్నదో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. అలాగే రెండు రాష్ర్టాల మధ్య జల ప్రవాహాల్లో రగులుతున్న జ్వాలలను ఆర్పే బాధ్యత వారిదేనని గుర్తు చేయాలి. ఈ బాధ్యతను విస్మరించి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర-తెలంగాణ మధ్య జల జగడాలను పెంచే వైఖరిని తీసుకున్నది. ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. అందులో గోదావరిపై నిర్మిస్తున్న కాళేశ్వరం, దేవాదుల, సీతారామా, తుపాకుల గూడెం లిఫ్ట్‌స్కీం, తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్టు, పెన్‌గంగపై బ్యారేజీలను, రామప్ప-పాకాల లిఫ్ట్‌ స్కీంలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది కనుక, పునర్విభజన చట్ట నియమాలను ఉల్లంఘించే ఈ ప్రాజెక్టులను గోదావరి నదీ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ (జీఆర్‌ఎంబీ), అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదించేంత వరకు నిలిపివేయాలని పేర్కొన్నారు. కానీ కృష్ణా బేసిన్‌ లో నిర్మిస్తున్న ఏ ఒక్క ప్రాజెక్టూ కొత్తది కాదు. అన్నీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించినవే. 


ఈ లేఖ ద్వారా అగ్నికి ఆజ్యం పోసే పని కేంద్రం చేసింది. లేఖలో పేర్కొన్న ప్రాజెక్టులన్నీ గోదావరిపై నిర్మిస్తున్నవే. వీటన్నింటికీ కేంద్రం అనుమతులు ఏనాటి నుంచో ఉన్నాయి. ఆంధ్ర-తెలంగాణ రాష్ర్టాల మధ్య కృష్ణా జలాలపై ఎడతెగని వివాదాలున్నాయి. కానీ గోదావరి జలాలపై  లేవు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటా 954 టీఎంసీలని ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్ధారణయ్యింది.  ఇప్పటి వరకు నిర్మించిన, నిర్మాణంలో ఉన్న, తలపెట్టిన ప్రాజెక్టులకు అవసరమయ్యే నీటి పరిమాణం.. కేటాయించిన నీటి పరిమాణం కన్నా తక్కువే. ఈ విషయాలన్నీ తెలిసికూడా కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలను తోసి పుచ్చడానికి బదులు, గోదావరిపై ప్రాజెక్టులను కూడా ఆపాలని తెలంగాణ సీఎంకు లేఖ రాయటం ఏ విధమైన ఫెడరల్‌ స్ఫూర్తికి నిదర్శనమో బీజేపీ నేతలే చెప్పాలి. 


నిజానికి కేంద్ర ప్రభుత్వ జోక్యం అవసరమవుతున్నది కృష్ణా జలాల పంపిణీ విషయంలోనే. ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం ఏ విధంగా జల చౌర్యానికి పాల్పడుతున్నదో పలుమార్లు కేంద్రం దృష్టికి కేసీఆర్‌ తీసుకెళ్లారు. అయినా కేఆర్‌ఎంబీ (కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌)గానీ, కేంద్ర ప్రభుత్వంగానీ పట్టించుకోలేదు. కనీసం పోతిరెడ్డిపాడు వద్ద టెలీమెట్రీ విధానాన్ని కూడా అమలు చేయలేదు. శ్రీశైలం నుంచి కేటాయించిన నీటికన్నా ఎన్నోరెట్లు అక్రమంగా తరలిస్తున్నా ఏపీ ప్రభుత్వాన్ని కట్టడి చేయలేక పోయింది మోదీ ప్రభుత్వం. 


కృష్ణా నీటిని తెలంగాణకు దక్కనివ్వకుండా చేయటానికి కేఎల్‌ రావుతో 1951లో మొదలైన కుట్రలు.. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో యదేచ్ఛగా కొనసాగాయి. ప్రస్తుత సాగర్‌ డ్యాంకు 21 కిలోమీటర్ల ఎగువన నిర్మించాలనుకున్న ఏళేశ్వరం ప్రాజెక్టు ద్వారా +615 అడుగుల ఎత్తులో ప్రవహిస్తూ నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోని సుమారు పది లక్షల ఎకరాలకు నీరివ్వాల్సిన కాల్వ.. నందికొండ ఎడమ కాల్వగా మార్చబడి +490 అడుగుల స్థాయిలో నిర్మించటంతో కేవలం ఐదు లక్షల ఎకరాలకు కూడా సాగునీరందించలేక పోతున్నది. నిజాం తలపెట్టిన ఎగువ కృష్ణా (54 ఈఎంసీలు), భీమా (100.5టీఎంసీలు), తుంగభద్రలో లెవల్‌ కెనాల్‌ (19.5 టీఎంసీలు) వంటి పాలమూరు ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో రద్దయినవి. నిర్మించిన రాజోలి బండ డైవర్షన్‌ స్కీం, మూసీ ప్రాజెక్టుల కింద ఆయకట్టు సగానికి తగ్గింది!


ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల్లో తెలంగాణ నష్టపోయిన సంగతి బచావత్‌ ట్రిబ్యునల్‌ తన అవార్డులో ధృవీకరించింది. ఆనాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కృష్ణా నదిని మొత్తంగానే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు మళ్లించే కుట్ర చేశారు. ‘తుమ్మ చెట్టుకు నిమ్మకాయలు కాయవ’ని రుజువు చేస్తూ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి అక్రమంగా రోజూ ఏడెనమిది టీఎంసీల నీటిని మళ్లించేందుకు జీఓ-203ను జారీ చేసి రాయలసీమ లిఫ్ట్‌ పథకానికి టెండర్లను పిలిచారు. దీన్ని అడ్డుకో క పోతే..  నాగార్జునసాగర్‌ ఎడమ, కుడి కాల్వలకు, కృష్ణా డెల్టా కాల్వల కింది ఆయకట్టుకు కూడా తీరని నష్టం వాటిల్లుతుంది. అంటే.. కేటాయించిన కృష్ణా నికర జలాల్లో తెలంగాణ ఒక వంతు నష్టపోతే, కోస్తాంధ్ర మూడువంతులు నష్టపోతుంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల రైతాంగాన్ని రాజధాని గొడవల్లోకి విజయవంతంగా మళ్లించి సీమ ముఖ్యమంత్రి ఆ ప్రాంతాలకు శాశ్వతంగా నష్టం చేయటానికి పూనుకున్నారు. ఇది.. కోస్తా రైతు సోదరులకు ఎప్పటికీ అర్థమవుతుందో?


దశాబ్దాల జలకుట్రలకు చరమగీతం పాడాలనే కేసీఆర్‌ సారథ్యంలో ఉద్యమించి ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. సామరస్యంగా జలవివాదాలను పరిష్కరించుకునే సరికొత్త సంస్కృతిని కేసీఆర్‌ ఆవిష్కరించి మహారాష్ట్రతో ప్రాణహిత వివాదాన్ని పరిష్కరించారు. ఫలితమే మండువేసవిలో కూడా చెరువుల అలుగు దుముకుతున్న గోదావరి కాళేశ్వర జలధారలు. ఇదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కూడా జలవివాదాలు పరిష్కరించుకోవాలని ఆరేండ్లుగా కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నా, ఆ నాడు చంద్రబాబు పట్టించుకోలేదు. బేసిన్లు, భేషజాలను పక్కనపెట్టి ఇరు రాష్ర్టాల కరువు ప్రాంతాలను కృష్ణా-గోదావరి జల ధారలతో సస్యశ్యామలం చేద్దామని కేసీఆర్‌ చేసిన ప్రతిపాదన వైఎస్‌ జగన్‌ చెవిని తాకలేదు. 

బ్రజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు వచ్చేదాకా బచావత్‌ ట్రిబ్యునల్‌ చేసిన కృష్ణా జలాల కేటాయింపులే శిరోధా ర్యం. ఈ అవార్డు ప్రకారం.. శ్రీశైలం నీటిని కేవలం జలవిద్యుత్‌ ఉత్పాదనకే వినియోగించాలి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు కృష్ణా నికర జలాల్లో చేసిన కేటాయింపులను పరిగణనలోకి తీసుకున్నా.. శ్రీశైలం కుడిగట్టు కాల్వ (ఎస్‌ఆర్‌ఎంబీ)కు కేవలం 19 టీఎంసీలనే పోతిరెడ్డిపాడు ద్వారా మళ్లించాలి. ఆ నీటిని కూడా ఖరీఫ్‌లో కేవలం 5.50 టీఎంసీలను, రబీలో (వరద నీటిని గోరకల్లు-అవుకు రిజర్వాయర్లలో నింపుకొని) 11.60 టీఎంసీలను తరలించాలి. మరో 1.90 టీఎంసీలను రిజర్వాయర్ల ఆవిరి నష్టం కింద చూపించారు! అత్యాశకు పోయి తెలంగాణ ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వితే రాయలసీమకు దక్కేది ఈ పరిమిత జలాలు మాత్రమేనని వైఎస్‌ జగన్‌ తెలుసుకోవాలి. నాగార్జునసాగర్‌ నిండిన తర్వాతే వరదజలాల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తుంది. త్వరలో జరుగనున్న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం సుజలాలను కురిపించి జల జ్వాలలను ఆర్పివేయాలని ఆశిద్దాం. 

(వ్యాసకర్త: తెలంగాణ జలవనరుల 

అభివృద్ధి సంస్థ చైర్మన్‌)


ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల్లో తెలంగాణ నష్టపోయిన సంగతి బచావత్‌ ట్రిబ్యునల్‌ తన అవార్డులో ధృవీకరించింది. ఆనాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కృష్ణా నదిని మొత్తంగానే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు మళ్లించే కుట్ర చేశారు. ‘తుమ్మ చెట్టుకు 

నిమ్మకాయలు కాయవ’ని రుజువు చేస్తూ.. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి అక్రమంగా రోజూ ఏడెనమిది టీఎంసీల నీటిని మళ్లించేందుకు జీఓ-203ను జారీ చేసి రాయలసీమ లిఫ్ట్‌ పథకానికి టెండర్లను పిలిచారు. 


logo