గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Aug 12, 2020 , 23:24:25

జనంలో కలిసి కట్టడంలోకి..

జనంలో కలిసి కట్టడంలోకి..

ఆరో అధ్యాయం కొనసాగింపు..

భద్రతా బలగాల కండ్లుగప్పి, కొన్ని చోట్ల వారు అడ్డగిస్తున్నా తోసుకుని బలవంతంగా వివాదాస్పద స్థలం సమీపంలోకి వందలాది మంది కరసేవకులు చొచ్చుకుపోయారు. ఆ క్రమంలో వారు బలగాలపై రాళ్లురువ్వడాలు, దాడులు చేశారు.. కరసేవకుల గుంపు సీఆర్‌పీఎఫ్‌ దళాలపైకి రాళ్లు రువ్వగా ఒక ఇన్‌స్పెక్టర్‌ గాయపడ్డాడు. ఆయన రక్తం ఓడుతుండటం చూసి ఉద్రిక్తులైన దళాలు అక్కడవున్న జిల్లా మేజిస్ట్రేట్‌ను కాల్పులతో కూడిన బలప్రయోగానికి అనుమతినివ్వవలసిందిగా కోరాయి. జిల్లా మేజిస్ట్రేట్‌ అటువంటి ఉత్తర్వులు ఇచ్చేందుకు విముఖంగా వున్నందున, వాళ్లిక గుంపుల్ని కట్టడిచేయలేమంటూ పక్కకు తప్పుకున్నారు. జన సమూహపు వత్తిడి పెరుగటంతో మేజిస్ట్రేట్‌ బలప్రయోగానికి అంగీకరించారు. ఈలోగా కరసేవకుల సంఖ్య బాగా పెరిగి ముందుకు సాగారు. సీఆర్‌పీఎఫ్‌ దళాలు అడ్డుకున్నాయి. కరసేవకుల సమూహం తిరిగి అదుపుతప్పుతుండగా మేజిస్ట్రేట్‌ అక్కడే ఉన్న స్వామీ వామదేవ్‌ను, అజ్ఞాతంలో ఉన్న యస్‌.సి. దీక్షిత్‌ను వాళ్ల ముందుకు తీసుకువస్తే వాళ్లు చెప్పినట్లు నడుచుకుంటారా అని అడిగాడు. వాళ్లు అందుకు అంగీకరించారు. కానీ కొందరు హనుమాన్‌ గర్హి వైపు తప్పించుకుపోయారు.

అలా తప్పించుకుపోయిన జట్టును హనుమాన్‌ గర్హి వద్ద పారామిలిటరీ దళాలు అడ్డగించాయి. స్వల్పంగా లాఠీచార్జి జరిగింది. ఈ విషయం అశోక్‌సింఘాల్‌కు తెలియజేశారు. ఆయనతో వున్న కరసేవకులు లాఠీచార్జి ఘటనతో రెచ్చిపోయారు. లెక్కకు 70 మందే ఉన్నా వాళ్లు మందిరం దిక్కుగా ముందుకు సాగారు. 

మొదట వాళ్లు బుకాయించటమే గాకుండా హనుమాన్‌ గర్హి, బారాఅస్థాన్‌ తీరానాల మధ్యగల అవరోధానికి కాపలాగా ఉన్న పోలీసుల్ని నెట్టివేశారు. ఆ జట్టు అలా ముందు కు పోతుండగా రామజన్మభూమి వీధిలోని గుళ్లల్లో దాక్కున్న రెండుమూడువేల మంది కరసేవకులు వాళ్లతో చేరిపోయారు. జనం మందిరంలోకి చొచ్చుకుపోయేందుకు కరసేవకులు వారితో చేరిపోయారు. జనం మందిరంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు కాల్పులు జరిపారు. ఐదుగురు మరణించారు. మళ్లీ అంతలోనే ఓ సమూహం తిరిగివచ్చి బయటి రక్షణ గేటు లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేసింది. అంతలో కరసేవకులను ప్రసన్నం చేసుకునేందుకు దీక్షిత్‌, మహంత్‌ నృత్యగోపాల్‌దాస్‌లను కొత్వాలీ నుంచి అక్కడికి తీసుకురావటం జరిగింది. సమూహాన్ని శాంతింపజేసేందుకు గేటుకు లోపల వున్న వేదిక మీద తానూ, మహంత్‌ నిలబడేందుకు దీక్షిత్‌ అనుమతి కోరటం జరిగింది. దీక్షిత్‌ కోసం గేటు తెరువగానే పెద్ద సంఖ్యలో గుంపు లోపలికి నెట్టుకుపోయి వివాదంలో వున్న కట్టడాన్ని ధ్వంసం చేయసాగారు. చాలామంది కరసేవకులు ఆ కట్టడపు గుమ్మటం ఆకారాల పైకెక్కి కాషాయ వర్ణం జెండాలను ఎగురవేయసాగారు. 

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)

శ్రీకాంత్‌ కొండపల్లిlogo