గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Aug 11, 2020 , 23:35:31

పెద్దతనమా! పెద్దరికమా?

పెద్దతనమా! పెద్దరికమా?

తెలంగాణ రాష్ట్ర నీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి బాధ్యతారహితంగా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నది. జలవనరుల పంపకం విషయంలో తెలంగాణకు న్యాయం గరపవలసిన బాధ్యత కేంద్రంపై ఉన్నది. కానీ బాధ్యత మరిచి వ్యవహరించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం తనవాటా జలాలు వాడుకోకుండా అడ్డుపుల్ల వేయడం తగనిపని. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు పొందిన ప్రాజెక్టులను కూడా నిలిపివేయాలనడం న్యాయమా? తెలంగాణ రాష్ట్రం ప్రాజెక్టులే కట్టుకోకూడదా? పొలాలకు నీళ్ళు పారించుకోకూడదా? నీటిపారుదల ప్రాజెక్టులను ఏండ్లకు ఏండ్లు సాగదీసి అవినీతికి పాల్పడితే అడిగే దిక్కుండదు. కానీ అతివేగంగా ప్రాజెక్టులను నిర్మించుకొని వ్యవసాయాన్ని పండుగలా మారుద్దామంటే మాత్రం అభ్యంతరాలు చెప్పడం కేంద్రం అనుసరిస్తున్న కుటిలనీతికి నిదర్శనం.

నీటిపంపకం విషయమై తెలంగాణకు అన్యాయం జరగడంలో కేంద్రం పాత్ర విస్మరించలేనిది. వద్దువద్దన్నా తెలంగాణ మాట వినిపించుకోకుండా ఆంధ్రతో విలీనం జరిపింది కేంద్రమే. ట్రిబ్యునళ్ళ ముందు తెలంగాణ నీటి అవసరాల గురించి ఆంధ్రా పాలకులు మాట్లాడలేదు. తెలంగాణ కనుక రాష్ట్రంగా ఉంటే నీటి పంపకాలలో తమ వాటా కోసం పోరాడేది. విలీనం వల్ల ఆ అవకాశం లేకుండా పోయింది. తెలంగాణకు అన్యాయం జరగకుండా కేంద్రమైనా అడ్డుకోవలసింది. కానీ అడ్డుకోకపోవడమే కాకుండా, తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఆందోళనలను క్రూరంగా అణచివేసింది. ఇన్నాళ్ళ పోరాటం తరువాత తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. మరి ఈ మధ్యకాలంలో నీటిపంపకాల సందర్భంగా జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దవలసిన బాధ్యత కేంద్రానికి లేదా? ట్రిబ్యునళ్ళు విచారణ జరిపిన కాలంలో తెలంగాణ ప్రాంతం రాష్ట్రంగా లేకపోవడమనేది ఒక ప్రత్యేక పరిస్థితి. దీనినొక అరుదైన ప్రత్యేక పరిస్థితిగా గుర్తించి మళ్ళీ పంపకాలను జరిపించడం  కేంద్రం బాధ్యత. అంతేకానీ ఉన్నవాటిని అడ్డుకోవడం కాదు. 

కేంద్రం తన బాధ్యతను నిర్వర్తించకపోగా ఉన్నంతలో సర్దుకుంటున్న తెలంగాణ రాష్ర్టాన్ని మరింత ఇబ్బందుల పాలు చేయడం సహించలేని విషయం. పరాయి పాలనలో తెలంగాణ ప్రాంతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దేశానికే ఆదర్శప్రాయమైన రీతిలో అన్ని రంగాల్లో అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. ఈ అభివృద్ధి చక్రానికి నీటిపారుదల రంగం ఇరుసు వంటిది. తెలంగాణ అభివృద్ధిని కుంటుపరిచి, అనిశ్చితి పాలు చేస్తే అది దేశానికి ప్రమాదకరం కాదా? రాష్ర్టాలు అనిశ్చితి పాలయితే దేశం సంక్షోభంలో పడిపోదా? కేంద్రం ఇప్పటికైనా విజ్ఞతతో వ్యవహరించాలి. పొరుగు రాష్ట్రం చేస్తున్న పసలేని ఆరోపణలను పట్టించుకోకుండా, తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులకు అండగా నిలువాలి. పెద్దరికం ప్రదర్శించడం కాదు, పెద్దతనంతో వ్యవహరించాలి.  

తాజావార్తలు


logo