శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - Aug 11, 2020 , 23:35:28

దూసుకొచ్చిన కరసేవకులు

దూసుకొచ్చిన కరసేవకులు

ఆరో అధ్యాయం కొనసాగింపు..

వివాదాస్పద పుణ్యక్షేత్రం చుట్టూ యూపీ రాష్ట్రప్రభుత్వం విస్తృతమైన భద్రతావలయాన్ని నిర్మించి, మందిరానికి వెళ్లే సందులో హనుమాన్‌ మందిరం సమీపంలో యినుపదడి అడ్డంగా పెట్టారు. అలా నాలుగు చోట్ల అవరోధాలు, ప్రతిచోటా పారామిలిటరీ దళాలు మోహరించటంతో భక్తులు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఒకరకంగా రామ్‌కోట్‌ ప్రాంతంలో అప్రకటిత కర్ఫ్యూ విధించినట్లయ్యింది.. 

రామజన్మభూమి మందిరంలో దైవదర్శనాన్ని నిషేధించకపోయినా మందిరం సమీపంలోకి ఎవ్వరినీ రానివ్వకపోవటంతో ఒక విధమైన నిషేధం అమలులో ఉన్నట్లయ్యింది. ఏది ఎలా ఉన్నా పూజ, అఖండ రామాయణపాఠ్‌, అఖండ కీర్తన వంటివి నిర్విఘ్నంగా కొనసాగాయి. పూజారులకు, రామాయణం గానం చేసేవాళ్లకూ ప్రత్యేకమైన గుర్తింపు పత్రాలనిచ్చారు. తరువాత ఈ విధమైన కట్టడులపై రభస చెలరేగటంతో, అప్రకటిత కర్ఫ్యూ రద్దయ్యింది. అయినా అయోధ్య- ఫైజాబాద్‌ మార్గాన్ని పలుతావుల్లో మూసివేసి అయోధ్య వెళ్లేవారిని సరైన తనిఖీ తరువాతనే వెళ్లనిచ్చారు. 

కట్టుదిట్టమైన ప్రభుత్వపు రక్షణ పథకం వీహెచ్‌పీకి ముందుగానే తెలిసిపోవటంతో సంఘపరివార్‌ అదే తరహాలో సమాధానం చెప్పాలనుకుంది. వాళ్ల దృష్టిలో కరసేవలో పాల్గొనేందుకు వస్తున్నవాళ్లు కేవలం గుంపుగా పోగవ్వడానికి కాదు, వాళ్లంతా నిబద్ధతతో కూడిన సంస్థాగత శ్రేణులకు చెందినవాళ్లు. వాళ్లను అయోధ్య చేరుకోకుండా చేయటం ఎవరితరమూ కాదనే విశ్వాసం వారికుంది. కరసేవకుల ఉద్యమాన్ని సైన్యంలోనూ, యితర పదవుల్లోనూ పదవీ విరమణ చేసిన అధికారులు పకడ్బందీగా క్రమబద్ధంగా నిర్వహించారు. కరసేవకులందరికీ గుర్తింపు కార్డులివ్వబడినాయి.వాళ్లు ప్రయాణించే మార్గాన్నీ గమ్యాన్నీ సూచించే పటం కూడ దానిమీదే ఉంది. పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్న కొందరు కరసేవకుల వద్ద అవి లభించాయి. కరుడుగట్టిన ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో అప్పటికే జిల్లాలోకి చొచ్చుకొని వచ్చారు. 

అక్టోబరు 26 సాయంత్రం ఫైజాబాద్‌లోను, అయోధ్యలోనూ నిరవధిక కర్ఫ్యూ విధించబడింది. ముందు జాగ్రత్త చర్యగా పారా సైనిక దళాలు గస్తీ తిరిగాయి. కర్ఫ్యూ విధించిన తరువాత పరిక్రమ మార్గానికి మళ్లేందుకు ప్రయత్నించిన రెండువేల మందిని వివిధ ప్రాంతాల్లో నిర్బంధించారు. అప్పటి ఆరెస్సెస్‌ ఉపనాయకుడు రజ్జూ భయ్యాగా పిలువడే ప్రొఫెసర్‌ రాజేంద్రసింగ్‌ను లక్నో విమానాశ్రయంలో అక్టోబరు 26న నిర్బంధించి పంత్‌నగర్‌కు విమాన మార్గాన తీసుకెళ్లారు. అక్టోబరు 27న విష్ణుహరి దాల్మియా, ఘమన్‌మల్‌ లోధా, స్వామి చిన్మయానంద, మహంత్‌ అవైద్యనాథ్‌, కరసేవా సమితి అధ్యక్షుడు శంకరాచార్య బాసుదేవానంద్‌ల్ని నిర్బంధించటం జరిగింది. 

1500 మంది వరకు కరసేవకులకు నాయకత్వం వహిస్తూ మధ్యప్రదేశ్‌ సరిహద్దును ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ రామ్‌ఘాట్‌ వద్ద దాటుతుండగా రాజమాత విజయరాజే సింధియాను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు నిర్బంధించారు. అటల్‌ బిహారీ వాజపేయిని అక్టోబరు 29రాత్రి లక్నో విమానాశ్రయంలో నిర్బంధించారు. అయితే సింఘాల్‌, దీక్షిత్‌, వినయ్‌ కతియార్‌, ఉమాభారతి మున్నగు నాయకులు, ప్రభుత్వం భద్రతా చర్యల్ని బాగా కట్టుదిట్టం చేయటాన్ని చూసి ముందస్తు నిర్బంధాన్ని తప్పించుకునేందుకు అజ్ఞాత జీవితం గడపసాగారు. ఎలాగయితేనేం సింఘాల్‌, దీక్షిత్‌లు ఫైజాబాద్‌ చేరుకోగలిగారు. 

ఈలోగా పదివేల మంది కరసేవకులు మందిరంవున్న నగరంలోకి దొంగచాటుగా జొరబడివచ్చారు. అక్టోబరు 29-30 రాత్రికి ఇంకా వేలాది మంది అన్ని దిక్కుల నుంచి నగరప్రవేశం చేసేందుకు ప్రయత్నించారు. కరసేవకుల వత్తిడి అంతా సరయూ వంతెనవైపే. అక్కడ ముళ్లతీగెతో బాగానే అవరోధాన్ని కల్పించారు. రైళ్ల రాకపోకల్ని మళ్లించిన తరువాత కరసేవకులు రైళ్లలో గొలుసులు లాగి తమకు అనుకూలమైన తావుల్లో దిగి 50-60 కిలోమీటర్లు డొంకదారుల వెంట నడిచి మందిరం వున్న నగరానికి చేరుకోసాగారు. 

నగరంలోకి ప్రవేశించేందుకు పెద్ద సంఖ్యలో కరసేవకులు వత్తిడి పెంచుతుండగా, తప్పించుకొని లోపలికి దూరివచ్చినవాళ్లు జట్లు జట్లుగా మందిరాన్ని చేరుకోవాలని చూస్తున్నారు. ఎలాగయితేనేం హనుమాన్‌ గర్హీ వద్ద అటువంటి మూడు ప్రయత్నాలను పారామిలిటరీ దళాలు చెదరగొట్టాయి. తరువాత అక్టోబరు 30 ఉదయం 8.30 గంటల సమయంలో మరో జట్టు మందిరం దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించగా బలగాలు తిప్పికొట్టాయి. తరువాత వాళ్లు జాతీయ రహదారిపై హనుమాన్‌ గర్హి కూడలి వద్దకు చేరుకున్నారు. అక్కడ పోలీసు అధికారులు, మేజిస్ట్రేటు వాళ్లను నిర్బంధించుతున్నట్లుగా చెప్పారు. వాళ్లను నిర్బంధించగానే తరలించేందుకు తగిన వాహనాలు లేవు. అలా కరసేవకుల సంఖ్య బాగా పెరిగిపోయింది. కొందరు కరసేవకులు హనుమాన్‌ గర్హి సందులోకి దూసుకుపోగారు. ఇళ్లపైభాగాల్నుండి రాళ్లు రువ్వుతున్నారు. సీఆర్‌పీఎఫ్‌ దళాలు కరసేవకుల ప్రయత్నాన్ని అడ్డుకోగలిగాయి. ఈలోగా కొందరు కరసేవకులు ఆంధ్రా నుంచి వాళ్ల ఎమ్యెల్యే నాయకత్వంలో అక్కడకు చేరుకున్నారు. దృఢసంకల్పులైన పోలీసుల్ని చూసి తాము ప్రశాంతముగా లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ ప్రజాప్రతినిధి తెలియజేశాడు. పోలీసులు సరేనన్నారు. శ్రింగర్‌హాట్‌ వైపు నుంచి రెండు బస్సులు అక్కడికి చేరుకున్నాయి. కరసేవకులు ఎక్కి కూర్చున్నారు. బస్సులు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంతలో బస్సు నడపటం వచ్చిన సాధువొకరు అకస్మాత్తుగా డ్రయివరును పక్కకు నెట్టి ఆ సీట్లో కూర్చొని బస్సును మందిరం వైపు నడుపుకుపోవటం చూసి బలగాలు నిర్ఘాంతపోయాయి. లోహ అవరోధాల్ని నెట్టేసుకుంటూ వేగంగా సాగిపోయిన బస్సు మందిరానికి కొద్ది వందల మీటర్ల దూరంలో నిలిచిపోయింది. ఇది కరసేవకుల ధైర్యాన్ని పెంచింది.

అరగంట తరువాత ఓ ఐదు వందల మంది కరసేవకుల సమూహం హనుమాన్‌ గర్హి సందుకు ఎదురుగా ఉన్న దిగంబర్‌ అఖాడా సందుగుండా ప్రత్యక్షమయింది. వాళ్లు వివాదాస్పద ప్రదేశాన్ని చేరుకునేందుకు ప్రయత్నించగా సీఆర్‌పీఎఫ్‌ దళాలు తిప్పికొట్టాయి. 

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo