ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Editorial - Aug 11, 2020 , 22:29:51

ఆహార భద్రతకు నగర వ్యవసాయం

ఆహార భద్రతకు నగర వ్యవసాయం

భారత్‌లో ఆహారభద్రతపై దృష్టిసారించినప్పుడు శరవేగంగా సాగుతున్న నగరీకరణను దృష్టిలో పెట్టుకోవాలని ‘వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌' గ్రహీత, ప్రఖ్యాత మృత్తిక శాస్త్రవేత్త (సాయిల్‌ సైంటిస్ట్‌) ప్రొఫెసర్‌ రతన్‌లాల్‌ సూచించారు. వేగంగా పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి ‘నగర వ్యవసాయం’పై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ‘స్థితిస్థాపక ఆహార, పోషకాహార, జీవనోపాధి విజ్ఞానం: సమకాలీన సవాళ్ళు’ అనే అంశంపై ఎంఎస్‌ స్వామినాథన్‌ రిసెర్చి ఫౌండేషన్‌ ఇటీవల ఒక సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో ‘భారత దేశ నిత్యహరిత విప్లవం కోసం మృత్తిక కేంద్ర విధానం’ అనే అంశంపై ప్రొఫెసర్‌ రతన్‌లాల్‌ ప్రసంగించారు. 

గతంలో ఎన్నడూ లేనివిధంగా నగరీకరణ చెందుతున్న భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారభద్రతను పెంపొందించే విధంగా వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రొఫెసర్‌ రతన్‌లాల్‌ సూచించారు. నిత్యహరిత విప్లవానికి అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాల్సి ఉన్నదని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారభద్రత, పౌష్టికాహారం అందించటం వంటి అవసరాలను తీర్చే విధంగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరమున్నదని చెప్పారు. సమకాలీన నగరీకరణ యుగంలో ఆహారభద్రతకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించుకోవాల్సి ఉన్నదని పిలుపునిచ్చారు. 

ప్రపంచ సగటు ప్రకారం పది లక్షల మందికి నివాసం, వసతులు సమకూర్చాలంటే 40 వేల హెక్టార్ల భూమి అవసరం. ప్రతి ఏటా భారత దేశ జనాభా కోటీ పదిహేను లక్షల మేర పెరుగుతున్నది. ఈ లెక్కన నగర విస్తరణ, పారిశ్రామికీకరణ కోసం ఐదు లక్షల హెక్టార్ల మేర భూమి అవసరం అవుతుంది. 2025 నాటికి ఏడు నగరాలలో జనాభా కోటి దాటిపోతుంది. కోటి జనాభా ఉన్న ఒక్కో నగరానికి రోజుకు ఆరు వేల టన్నుల ఆహారం అవసరం అని రతన్‌ లాల్‌ వివరించారు. ప్రముఖ మృత్తిక శాస్త్రవేత్త అయిన రతన్‌లాల్‌ ఓహియో స్టేట్‌ యూనివర్సిటీలో కార్బన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ సీక్వెస్ట్రేషన్‌ సెంటర్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. 

మానవ, జంతు విసర్జితాలు, ఇతర వ్యర్థాలను రీ-సైకిల్‌ చేసి పునర్‌వినియోగం చేసుకోవాల్సిన అవసరమున్నదని కూడా రతన్‌లాల్‌ వివరించారు. ‘ఈ వ్యర్థాలతో కనీసం 20 శాతం భవిష్యత్‌ అవసరాలను తీర్చుకోగలిగే విధంగా ఆధునిక శాస్త్రవిజ్ఞానాన్ని, సాంకేతికతను ఉపయోగించుకోవాలి. ఈ నేపథ్యంలోంచే నగర వ్యవసాయాన్ని (అర్బన్‌ అగ్రికల్చర్‌)  అభివృద్ధి చేసుకోవాలి. నగరీకరణతో ముడిపడి ఉన్న ఇటుకల తయారీ పరిశ్రమ మూలంగా వ్యవసాయభూమిపైనే కాకుండా పర్యావరణంపై కూడా తీవ్ర ప్రభావం పడుతున్నద’ని ఆయన హెచ్చరించారు. 

భారత దేశంలో వ్యవసాయరంగం, ఆహార భద్రత విషయంలో స్వామినాథన్‌ సేవలు, కృషి ఎనలేనివని రతన్‌లాల్‌ కొనియాడారు. స్వామినాథన్‌ ప్రతిపాదించిన నిత్యహరిత విప్లవం భావనను ఆయన ప్రస్తావించారు. ‘1960-70దశకాలలో ప్రొఫెసర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ చేపట్టిన హరితవిప్లవ కార్యక్రమం భారత ఆహారభద్రతలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. సమాజానికి, పర్యావరణానికి హాని జరగకుండానే గణనీయంగా అహారధాన్యాల ఉత్పత్తికి బీజం వేసింది. స్వామినాథన్‌ భవిష్యత్‌ దృష్టితో చేపట్టిన హరితవిప్లవ కార్యక్రమం ఆహారభద్రతను కల్పించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడింది.  పర్యావరణ పరిరక్షణ, ఆహారభద్రతకు ఆధునిక శాస్త్రసాంకేతికతను జోడించిన విధానం సమోన్నతమైనద’ని రతన్‌లాల్‌ పేర్కొన్నారు. 

 భారత్‌లో 1947లో 33 కోట్లు ఉన్న జనాభా, 2020 నాటికి 138 కోట్లకు చేరుకున్నదని ప్రొఫెసర్‌ రతన్‌లాల్‌ వివరిస్తూ.. ఇదే కాలంలో ఆహారధాన్యాల ఉత్పత్తి  ఐదు కోట్ల టన్నుల నుంచి 30 కోట్ల టన్నులకు పెరిగిందని ఆయన గుర్తు చేశారు. ‘ఈ విధమైన ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుదలను ఆయన‘స్వామినాథన్‌ ఎఫెక్ట్‌' గా అభివర్ణించారు. స్వామినాథన్‌ దార్శనికతను, మార్గదర్శనాన్ని ఆయన ప్రశంసించారు. ‘స్వామినాథన్‌, నార్మన్‌ బోర్లాగ్‌ తదితర శాస్త్రవేత్తలు కొత్తరకాలైన మొక్కలను సృష్టించారు. దీనివల్ల భారత్‌ ఆహార రంగంలో స్వావలంబనను సాధించడమే కాకుండా, ఎగుమతులను సాగించింద’ని రతన్‌లాల్‌ వివరించారు. 

2050నాటికి దేశంలో ఆహారభద్రత ఉండాలంటే, ఆహారపదార్థాలను వృథా కాకుండా చూసుకోవాలని, రతన్‌ లాల్‌ సూచించారు. అలాగే అందరికీ ఆహారం అందుబాటులో ఉండాలంటే పేదరికం,  అసమానతలు, సామాజిక ఘర్షణలు, రాజకీయ అస్థిరతలను నిర్మూలించాలని అభిప్రాయపడ్డారు. ‘దీంతో పాటు ప్రభుత్వ ఆహార పదార్థాల సరఫరా వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలనీ,  శాకాహారాన్ని, పప్పుల వాడకాన్ని ప్రోత్సహించాలనీ రతన్‌లాల్‌ వివరించారు. 

భారత దేశంలో ఇటీవల ప్రజల ఆర్థికస్థోమత పెరిగేకొద్దీ ఏటా 10నుంచి 15శాతం మాంసాహార వినియోగం పెరిగిందని తెలిసిందని, ఇది ఆందోళనకరమని రతన్‌లాల్‌ అన్నారు.  ప్రజలు తమకు కావాల్సిన మాంసకృత్తుల కోసం జంతుసంబంధ ఆహారంపై కాకుండా, పప్పు దినుసులపై ఆధారపడాలని సూచించారు. ఈ విధమైన ఆహార అలవాట్లతోనే ప్రజలకు కావాల్సిన ప్రొటీన్లు, పోషకాలు చవకగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. 

(వ్యాసకర్త: ఒహియో స్టేట్‌ యూనివర్సిటీలో మృత్తిక శాస్త్రవేత్త,వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ గ్రహీత)

(ది హిందూ బిజినెస్‌లైన్‌.కామ్‌ సౌజన్యంతో)


logo