గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Aug 10, 2020 , 23:12:36

సింహళ రాజకీయం!

సింహళ రాజకీయం!

శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికలలో సింహళ జాత్యాభిమానానికి, బౌద్ధ మతానికి ప్రతీకగా నిలిచిన ‘శ్రీలంక పొడుజన పెరమున’ (ఎస్‌ఎల్‌పీపీ) విజయ దుందుభి మోగించడంతో దేశ రాజకీయ చిత్రపటం సమూలంగా మారిపోయింది. ‘బలమైన నాయకుడు- బలమైన దేశం’ అనే నినాదంతో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న మహీంద రాజపక్స ఆదివారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. సంక్షేమ రాజ్యపాలన అందిస్తామనే ప్రచారం కూడా ఎస్‌ఎల్‌పీపీకి అనుకూలంగా పనిచేసింది. సుదీర్ఘకాలం శ్రీలంక రాజకీయాలలో ప్రబల శక్తులుగా ఉన్న రెండు ప్రధాన పార్టీలు యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యూఎన్‌పీ), శ్రీలంక ఫ్రీడమ్‌ పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ) దాదాపుగా తుడిచిపెట్టుకపోయాయి. యూఎన్‌పీ ప్రతిపక్ష పాత్రను కూడా పోషించలేనంత దయనీయ స్థితికి దిగజారింది. యూఎన్‌పీ నుంచి చీలిపోయిన ఎస్‌జేపీ ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. గత ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి, అస్థిరతలను ప్రజలు ఈసడించుకోవడం వల్లనే ఎస్‌ఎల్‌పీపీకి ఘన విజయం సిద్ధించింది. 

రాజపక్స నిరంకుశ పాలన ఇదివరకు శ్రీలంక ప్రజలకు అనుభవమే. అందువల్లనే గత ఎన్నికలలో గుణపాఠం నేర్పారు. ఇప్పుడు మళ్ళీ పట్టం కట్టినంత మాత్రాన నిరంకుశ పాలనకు సమర్థింపుగా భావించకూడదు. దేశంలో వేళ్ళూనుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తే మళ్ళీ వ్యతిరేతక పెల్లుబుకవచ్చు. చీలికలు పేలికలుగా మారిన శ్రీలంక సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం రాజపక్స ముందున్న పెద్ద సవాలు. తూర్పు ఆసియా దేశాలలో బౌద్ధానికి, ఇస్లామిక్‌ ఉగ్రవాదానికి మధ్య ఘర్షణలు సాగుతున్నాయి. ఆ ప్రభావం శ్రీలంకపై పడటం వల్ల దేశ సమగ్రతకు కొత్త సవాలు ఎదురవుతున్నది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తున్నది. శ్రీలంక ఇందుకు అతీతం కాదు. ఆర్థిక అనిశ్చితి సమాజంలో విభేదాలను మరింత పెంచవచ్చు. అందువల్ల సామాజిక ఆర్థిక సమస్యల పరిష్కారంపై మహీంద రాజపక్స దృష్టిసారించాలి. 

గతంలో రాజపక్స దేశాధ్యక్షునిగా ఉన్నప్పుడు భారత వ్యతిరేకతను ప్రదర్శించారు. చైనాతో మైత్రి సాగిస్తూ దేశాన్ని అప్పులకుప్పగా మార్చారు. ఇటీవల ఎన్నికలకు ముందు మాత్రం భారత్‌తో స్నేహంగా ఉంటామనే సంకేతాలు ఇచ్చారు. రెండు దేశాల రాజకీయ వ్యవస్థల సారూప్యం, భౌగోళిక సామీప్యం మూలంగా భారత్‌తో చెలిమి అనివార్యమని రాజపక్స గ్రహించాలి. చైనా, పాకిస్థాన్‌ దుందుడుకు విధానాలు, నేపాల్‌ పాలకుల వైషమ్యం నేపథ్యంలో శ్రీలంక పరిణామాలను భారత్‌ గమనిస్తుండాలి. గతంలో మాల్దీవుల రాజకీయాల్లో చైనా తలదూర్చి కొద్దికాలం భారత్‌ను ఇబ్బందుల పాలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న వెంటనే భారత్‌ మలాకా జలసంధితో సహా ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో నౌకాదళాన్ని అప్రమత్తం చేసింది. ఆఫ్రికా తూర్పు తీరం మొదలుకొని ఇటు ఇండో పసిఫిక్‌ ప్రాంతమంతా చైనాను కట్టడి చేయాలనుకుంటే శ్రీలంక చేజారిపోకుండా జాగ్రత్త పడటం అవసరం. 


logo