గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Aug 10, 2020 , 23:12:38

సంక్షోభంలో బ్యాంకులు

సంక్షోభంలో బ్యాంకులు

కరోనా వైరస్‌ భారతదేశ బ్యాంకింగ్‌ వ్యవస్థను అతలాకుతలం చేసింది. ఊపిరాడకుండా చేస్తోంది. వైరస్‌తో నెలకొన్న ఈ సంక్షోభంతో బ్యాంకింగ్‌ రంగం ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనిపించటం లేదు. దానికి చాలా ఏళ్ల సమయమే పట్టేట్టు ఉంది. ఇదే విషయాన్ని ఇటీవల ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ‘స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌' కూడా కుండబద్దలు కొట్టింది. బ్యాంకింగ్‌ రంగంలో ఇంతటి సంక్షోభానికి అసలు కారణమేమిటో ఇప్పుడు చర్చిద్దాం. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారాలు మూతపడ్డాయి. ఎగుమతి రంగం దివాళా తీసింది. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీనికితోడు ఒక నివేదిక  ప్రకారం.. కరోనా ప్రభావంతో దేశంలో 14 కోట్ల 70 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఫలితంగా కొనుగోలు శక్తి తగ్గిపోయింది. అమ్మకాలు లేక కొన్ని సంస్థలు తాత్కాలిక నష్టాలను చవిచూడగా.. మరికొన్ని కంపెనీలను పూర్తిగా మూసేసే పరిస్థితి తలెత్తింది. ఈ కారణాలతోనే బ్యాంకుల్లో మొండి బకాయిలు భారీగా పెరిగిపోయాయి. ఈ పెరుగుదల ఇప్పటికీ ఆగిపోవడంలేదని ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కూడా (బ్యాంకింగ్‌, ఎకనామిక్స్‌ కన్‌క్లేవ్‌)లో మాట్లాడుతూ చెప్పడం గమనార్హం. రెండు విడతలుగా ఆరు నెలల కాలానికి ప్రకటించిన రుణ వాయిదాల మారటోరియంతో వసూళ్లు లేక బ్యాంకులకు కష్టతరంగా మారిపోయింది.   

దేశంలో 2018లో బ్యాంకింగ్‌ రంగం రూ. 60 వేల కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. ఆ తరువాత సంవత్సరంలో నష్ట తీవ్రత కొంత పెరిగి రూ. 66 వేల కోట్ల నికర నష్టం నమోదైంది. ఇప్పుడు కోవిడ్‌-19 నేపథ్యంలో ఈ సంవత్సరంలో గత రెండు సంవత్సరాలకంటే  మరింత  భారీ స్థాయిలో నష్టాలు ఉండబోతున్నాయి. తాజాగా బ్యాంకులు ప్రకటిస్తున్న త్రైమాసిక ఫలితాల్లో కూడా ఇదే ఈ విషయం స్పష్టమైంది. దాదాపు అన్ని లీడింగ్‌ బ్యాంకులు నష్టాలే ప్రకటించటం గమనార్హం. 

మారటోరియం విధింపు, పరిశ్రమలు నష్టాలపాలు కావడంతో ఇప్పటికే వసూళ్లు లేక బ్యాంకింగ్‌ వ్యవస్థ డీలా పడిపోయింది. దీనికితోడు ఇప్పుడు బ్యాంకుల్ని  మరో పెద్ద సవాల్‌ వెంటాడుతున్నది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నష్టపోయిన రంగాలను ఆదుకోవడం, గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను అదుపులో పెట్టడం కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల కరోనా రిలీఫ్‌  ప్యాకేజీ ప్రకటించింది. ఇందు లో అత్యధిక భాగం బ్యాంకు రుణాలే. కేంద్రం ఆదేశాలను అమలుచేయాలంటే బ్యాంకుల వద్ద రూ. 17 -18 లక్షల కోట్ల వరకు నగదు సిద్ధంగా ఉండాలి.  కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా లేదు. ఎందుకంటే దేశంలోని మొత్తం బ్యాంకుల్లో ఉన్న రూ. 90 లక్షల కోట్ల డిపాజిట్లలో ఆయా బ్యాంకులు రూ. 65 లక్షల కోట్లను ఇప్పటికే రుణాలుగా ఇచ్చి ఉన్నాయి. 

ఇందులో రూ. 10 లక్షల కోట్లు మొండి బకాయిలుగా ఉన్నాయి. ఇవి గతంలోనే రాలేదు. ఇప్పుడైతే తిరిగి వచ్చే అవకాశమే లేదు. ఈ నేపథ్యంలో ఒకవైపు కరోనా వైరస్‌ రోజురోజుకూ మరింత భయపెడుతూ విస్తరిస్తున్నది. దేశంలో కేసుల సంఖ్య 20 లక్షలకు చేరింది. అంతటా భయాందోళనలు నెలకొని ఉన్నాయి. పరిశ్రమల్లో ఉత్పత్తి జరగడం లేదు. కార్పొరేట్లు, ఎంఎస్‌ఎంఈ లు అన్నీ దెబ్బతిన్నాయి. ఎగుమతి చేసే అన్నిరంగాలూ కోలుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. నిరుద్యోగం పెరిగిపోవడంతో ఉత్పత్తి చేసిన వాటికి కొనుగోలుదారులు లేరు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వమే గ్యారెంటీగా ఉన్న కరోనా ప్యాకేజీ రుణాలను ఆయా రంగాల వారికి  ఇవ్వాల్సిన నైతిక బాధ్యత బ్యాంకులపై ఉన్నప్పటికీ.. బ్యాంకు ల పరిస్థితి కూడా అంతా బాగా ఏమీ లేదు. కొత్త రుణాలు ఇవ్వాలంటే ఇబ్బందిగానే ఉంది. లిక్విడిటీ సమస్యను అధిగమించేందుకు రిజర్వ్‌ బ్యాంకు తన వద్ద గల ఆరేడు లక్షల కోట్లను తాత్కాలికంగా బ్యాం కులకు సమకూర్చడానికి సిద్ధమని తెలిపింది. అయినా కేంద్రం ప్యాకేజీని పూర్తిగా అమలు చేయాలంటే ఈ నిధులు సరిపోవు. దీన్ని దృష్టిలో  పెట్టుకునే బ్యాంకులు సొంతంగా మూలధనం సమకూర్చుకోవాలని ఇటీవల రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సూచించారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకుల దగ్గర  తగిన లిక్విడిటీ లేదు. ప్రభుత్వం దగ్గరా అదే పరిస్థితి ఉంది. డిపాజిట్లు సేకరించడం ద్వారా లిక్విడిటీ పెంచుకుందామన్నా వడ్డీ రేట్లు తగ్గిపోవడంతో బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు.  దేశంలో మొండిబకాయిల పెరుగుదల బ్యాంకింగ్‌ వ్యవస్థపై భారీగా ఉన్నది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగబోతోంది. 2019-20లో  8.5శాతంగా  ఉన్న ఎన్‌పీఏ ( స్థూల నిరర్ధక ఆస్తు లు) ల  నిష్పత్తి.. 2020-21లో 16 -18  శాతానికి పెరగవచ్చుననే అంచనాలు బ్యాంకింగ్‌ వర్గాలను కలవరపెడుతున్నాయి. ఇదేగానీ జరిగితే బ్యాంకింగ్‌ రంగం మొత్తం నష్టాలు 13-14 లక్షల కోట్ల వరకూ ఉండబోతున్నాయని ఆర్థికరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ దుస్థితి నుంచి కోలుకోవాలంటే కరోనా వైరస్‌ ఉధృతి  నెమ్మదించడం మినహా మరో మార్గమే కనిపించడం లేదు.  

(వ్యాసకర్త .. బ్యాంకింగ్‌ రుణాలపై

వెలువడిన ’ఈజీలోన్‌' పుస్తక రచయిత)


logo