ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Editorial - Aug 10, 2020 , 23:12:43

అద్వానీ నిర్బంధం

అద్వానీ నిర్బంధం

  • ఆరో అధ్యాయం కొనసాగింపు..

ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరసేవకులు మాయోపాయంతో బలగాలను ఏమార్చి అయోధ్యకు చేరుకోసాగారు. వీరిలో వివిధ రాష్ర్టాల వారితో పాటు ఆంధ్రప్రదేశ్‌ వారు కూడా ఉన్నారు. అయోధ్యకు సుమారు 20-25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోహవల్‌, బిల్హర్‌ ఘాట్‌ రైల్వేస్టేషన్లకు చేరటం జరిగింది.. వాళ్లకు చేరువలోని గ్రామాల్లో వసతులు కల్పించబడినాయి. కానీ రమారమి 600 మంది కరసేవకుల్ని (530 ఆంధ్ర నుంచి వచ్చినవారు, 85మంది బిజ్నోర్‌, ముజఫర్‌ నగర్‌ జిల్లాల నుంచి వచ్చినవారు) సోహావల్‌ రైల్వేస్టేషన్‌ వద్ద అక్టోబరు 20న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అద్వానీ నిర్బంధం: అద్వానీ బీహార్‌లో రథయాత్రలో ఉన్నారు. బీహార్‌ ప్రభుత్వం ఆయన్ని అక్టోబరు 23 వేకువ ఝామున సమస్తిపూర్‌ సర్క్యూట్‌ హౌస్‌ వద్ద నిర్బంధంలోకి తీసుకున్నది. ఆయన నిర్బంధం జాతీయ భద్రతా చట్టం కింద. ఆయనను దమ్కాకు విమానంలోనూ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మసంజోరేకు చేర్చి అక్కడ నిర్బంధంలో ఉంచారు. రథాన్ని కూడా స్వాధీనపర్చుకున్నారు. రథయాత్ర నిలుపుదలతో అదేరోజు బీజేపీ అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్‌కు న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు తెలియజేసింది. అప్పుడు వీపీ సింగ్‌ తమ బలాన్ని సభలో నవంబరు 7న నిరూపించుకుంటామన్నారు. 

భద్రత కట్టుదిట్టం చేయబడింది

రాష్ట్రప్రభుత్వం వివాదాస్పద పుణ్యక్షేత్రం చుట్టూ విస్తృతమైన భద్రతా

వలయాన్ని నిర్మించింది. ఆ మందిరానికి వెళ్లే సందులో హనుమాన్‌ మందిరం సమీపంలో తొలి యినుపదడి అడ్డంగా పెట్టారు. తరువాతది బారా ఆస్థాన్‌ కూడలిలో. అలా కనీసం నాలుగు చోట్ల అవరోధాలు. ప్రతిచోటా పారామిలిటరీ దళాల రక్షణ. అద్వానీ నిర్బంధం తరువాత అక్టోబరు 24న అయోధ్యలోని వివాదాస్పద స్థలం చుట్టూ రామ్‌కోట్‌ ప్రాంతంలో అప్రకటిత కర్ఫ్యూ విధించినట్లయ్యింది. 

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo