మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Aug 10, 2020 , 23:12:44

కరోనా వల్చర్‌ కల్చర్‌

కరోనా వల్చర్‌ కల్చర్‌

కరోనా వైరస్‌ ఎక్కడ పుట్టింది, ఎక్కడినుంచి సంక్రమించి విస్తరించిందన్న మీమాంస, తర్కవితర్కాలు ట్రంప్‌ మరోసారి గెలిచి అధికారం చేపట్టడానికి ఉపయోగపడితే పడవచ్చు. కానీ ఆరు వందల కోట్ల ప్రపంచ ప్రజలు అమితంగా ఆరాటపడుతున్నది, కోరుతున్నది  ఈ వైరస్‌ నియంత్రణ. కరోనా వైరస్‌ భయంకరంగా విజృంభించి సకల ప్రపంచాన్ని స్తంభింపజేస్తున్నా మన రాజకీయాలు యథాతథంగా కొనసాగడం విచిత్రం. 

క్రీస్తుకు పూర్వం రెండువేల ఏండ్ల కిందట రుగ్వేద కాలంలో ఆర్యుల రాకతో ఒక నూతన నాగరికత, సంస్కృతి, జీవనరీతి రూపొందాయని ఆధునిక చరిత్రకారులు అంటున్నారు. నాలుగు వేల ఏండ్ల తర్వాత ఇప్పుడు కరోనా వైరస్‌ సంక్రమణ, వ్యాప్తితో ప్రపంచమంతటా జీవన విధానాలు మారుతున్నాయి. మిత్రుడు యాదగిరి ఈ మార్పునకు ఒక నిదర్శనం. 

యాదగిరి బహుభాషా కోవిదుడు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ, కన్నడం, మరాఠీ భాషల్లో పండితుడు. ఈయననే కొవిడ్‌-19 హడలగొట్టింది. ఆయన మిత్రుల మాటల్లో ప్రముఖంగా ప్రస్తావితుడవుతున్నప్పుడే.. ఆయన రావడం యాదృచ్ఛికం, విచిత్రం. రాగానే యాదగిరి ఎప్పటివలె తన మిత్రుల మధ్య కుర్చీలో కూర్చోలేదు. యాదగిరి మిత్రులను పరీక్షగా చూస్తున్నాడు. జేబులో నుంచి శానిటైజర్‌ బాటిల్‌ తీసి రెండు చుక్కలను చేతుల్లో వేసుకొని బాగా రుద్దుకున్నాడు. సూటిగా అడుగలేక పోతున్నాడు గానీ మిత్రుల్లో ఎవరైనా ఈ మధ్య (కరోనా కాలంలో) విదేశాలకో, ఢిల్లీ, ముంబై నగరాలకో, విందులకో వెళ్లి వచ్చి ఉంటారని, లక్షణాలేవీ లేకుండానే వాళ్లు కరోనా గ్రస్థులై ఉంటారని యాదగిరి అనుమానం. నిజానికి ఆయన అనుమానం వ్యాధితో బాధపడుతున్నాడు. 

కుర్చీలో కూర్చోవడానికి తటపటాయిస్తున్న యాదగిరికి ఒక మిత్రుడు గ్లాసులో నీళ్లిచ్చాడు. అది ప్లాస్టిక్‌ గ్లాసు, దానిపై వైరస్‌ ఎన్నో గంటలు ఉంటుందని కరోనా ప్రచారంలో విన్నాడు. లాక్‌డౌన్‌లో మీడియాలో కరోనా ప్రచారం వినీవినీ యాదగిరికి మతిభ్రమించినంత పనైంది. మరోసారి (అరగంటలో రెండోసారి) శానిటైజర్‌ చుక్కలతో చేతులు రుద్దుకొని యాదగిరి నీళ్ల గ్లాసు అందుకున్నాడు.  గ్లాసు నోటి దగ్గరికి రాగానే యాదగిరికి తుమ్ము వచ్చింది. ఎదుట ఉన్న వాళ్లందరికి తన తుమ్ము కారణాన్ని వివరించి అది కరోనా తుమ్ము కాదని చెప్పడానికి తంటాలు పడ్డాడు. 

యాదగిరి పక్కింటాయన తన పాత ఇంటి కూల్చివేత మొదలుపెట్టిండు. ఆ దుమ్ము, ధూళి యాదగిరి ఇంటిలో, ముక్కులో నిండిపోయింది. గోరు చుట్టుపై రోకటిపోటు అంటే ఇదే. యాదగిరి ఒక చిన్న పరిశ్రమకు అధిపతి. ప్రధాని మోదీజీ ఆత్మనిర్భర్‌ అభియాన్‌గా ప్రకటించిన రూ. ఇరువై లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ దేశ ప్రజలకు వరుసగా ఐదురోజులు వివరించి చెప్పారు! ఇది భారత్‌ జీడీపీలో 10 శాతం ప్యాకేజీ కాదని, కేవలం ఒక శాతం ప్యాకేజీయని, ఈ ప్యాకేజీ బూటకమని, ఇవాళ్టి పరిస్థితిలో డిమాండ్‌ సృష్టికి, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు కావలసింది వివిధ వర్గాలకు భారీ ఎత్తున నగదు చెల్లింపు అని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ ధ్యేయంగా (పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాలపై, ఫెడరల్‌ వ్యవస్థ స్ఫూర్తిపై రాజకీయ అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను (కేంద్ర రాష్ట్ర సంబంధాలలో భాగంగా మాత్రమే. బీజేపీతో కాదు) కొనసాగిస్తున్నప్పటికీ ఈ ప్యాకేజీ విలువలేనిదని అసంతృప్తి వ్యక్తం చేశారు. యాదగిరి పరిశ్రమలోని ఇరువై మంది ఉద్యోగులు లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత మూకుమ్మడిగా వచ్చి రెండు నెలల జీతభత్యాల కోసం చేయిచాపారు. రెండు నెలలు కర్మాగారం మూతపడి బాగా నష్టపడిన యాదగిరి ప్రధాని ప్యాకేజీ కింద ఏదైనా సహాయం అందుతుందని తన బ్యాంకుకు వెళ్లాడు. ప్రధాని ప్యాకేజీ గురించి తమకేమీ తెలియదని బ్యాంకు వాళ్లు చెప్పడంతో యాదగిరికి చెమటలు పట్టినయి. ఇరువై మంది ఉద్యోగులు, వాళ్ల కుటుంబసభ్యులు క్యూ కట్టి తన కళ్లముందు కన్పించినట్లయి యాదగిరి తల గిర్రున తిరిగింది! 

 అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ లాక్‌డౌన్‌లు వద్దన్నాడు. ఓ లక్షమంది అమెరికన్లు కరోనా తాకిడితో చచ్చినా ఫరవాలేదు కానీ లాక్‌డౌన్‌ వద్దన్నడు. ‘లాక్‌డౌన్‌లు వద్దు-మాకు స్వేచ్ఛ కావాలె’ అంటూ రోడ్ల మీదికి వచ్చి అల్లర్లు చేసిన మూకలకు ట్రంప్‌జీ అయాచితంగా మద్దతు పలికాడు. 135 కోట్ల మంది భారతీయులలో చాలా మంది బుద్ధిమంతులు, దేశభక్తులు, మూసీలో కళ్లు మూసుకొని దూకండి అని మోదీజీ అంటే గప్‌చుప్‌గా దూకేవారు. ‘నమస్తే ట్రంప్‌' కార్యక్రమంలో (మోదీజీ సొంతూరు అహ్మదాబాద్‌లో) పాల్గొనడానికి ట్రంప్‌ 2020 ఫిబ్రవరి 23న ఢిల్లీ వచ్చే ముందే అమెరికాలో కరోనా వ్యాప్తి సంగతి తెలిసింది. డబ్ల్యూహెచ్‌వో వారు, అమెరికన్‌ శాస్త్రజ్ఞులు ట్రంప్‌ను హెచ్చరించారు. అయినా ఆయన ఢిల్లీ వచ్చాడు. ఆయనే గుజరాత్‌కు కరోనాను తెచ్చాడని ఓ శివసేన నాయకుడు అన్నాడు. కరోనాను ఎదుర్కోవడానికి మోదీజీ ఆరేండ్ల నుంచే సిద్ధమవుతున్నాడని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నాడు! ఇవి నిజంగా పసిడి పలుకులు! కరోనా వైరస్‌ ఎక్కడ పుట్టింది, ఎక్కడినుంచి సంక్రమించి విస్తరించిందన్న మీమాంస, తర్కవితర్కాలు ట్రంప్‌ మరోసారి గెలిచి అధికారం చేపట్టడానికి ఉపయోగపడితే పడవచ్చు. కానీ ఆరు వందల కోట్ల ప్రపంచ ప్రజలు అమితంగా ఆరాటపడుతున్నది, కోరుతున్నది ఈ వైరస్‌ నియంత్రణ. కరోనా వైరస్‌ భయంకరంగా విజృంభించి సకల ప్రపంచాన్ని స్తంభింపజేస్తున్నా మన రాజకీయాలు యథాతథంగా కొనసాగడం విచిత్రం. 

 ఇటీవలే తాలిబన్‌ టెర్రరిస్టులతో చేయి కలిపిన ట్రంప్‌.. చైనా, పాకిస్థాన్‌, నేపాల్‌తో భారత్‌ వివాదాల్లో మధ్యవర్తిత్వానికి ఉబలాట పడుతున్నాడు. చైనాతో డోక్లాంలో ఏం జరిగిందో, ఇప్పుడు లడక్‌లో ఏం జరుగుతున్నదో దేశ ప్రజలకు తెలియదు. అంతా రహస్యం. నాడు, 1959లో ఇండియన్‌ పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ (కమ్యూనిస్టు చైనాకు అంతర్జాతీయ రంగంలో, ఐరాసలో నాడు గౌరవస్థానం కల్పించిన రాజనీతిజ్ఞుడు), చైనా దురాక్రమణ తత్వం గురించి అన్నమాటలు ఇవి..  We know enough history to realise that a strong China is normally an expansionist China. This has been the case through out its history... we come to the conclusion that our borders were going to be threatened in some way ఈ మాటలు గమనార్హమైనవి.

- దేవులపల్లి ప్రభాకరరావు


logo