సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Aug 08, 2020 , 22:48:49

పిల్లలమర్రిలో కోట ఉందా?

పిల్లలమర్రిలో  కోట ఉందా?

కాకతీయ సామ్రాజ్యం స్థిరపడటానికి వెన్నుదన్నుగా నిలిచినవారు సామంత మాండలికులు. వారిలో రేచర్ల రెడ్డి వంశీయులు ముఖ్యులు. ప్రభువుల అడుగుజాడల్లో ప్రయాణిస్తూ వారి నిర్మాణాత్మక కార్యక్రమాలకు చేదోడుగా ఉంటూ, అనేక ప్రజోపయోగ నిర్మాణాలను చేపట్టారు. వ్యక్తి సమాజపరంగా ఎదగాలంటే దైవబలం కూడా సాయపడాలనే నమ్మకంతో అనేక దేవాలయాలను ప్రభువులకు, తమకు ప్రీతి కలిగేట్లుగా నిర్మించారు. ఆ సందర్భంలో దేవుని అంగరంగ భోగాలకు, నిత్య నైవేద్యాలకు, ధూపదీపాదులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా దేవాలయంలో జరిగే కైంకర్యాల నిర్వహణకు వస్తువులు, భూదానాలు చేశారు. అంతేకాక ఆలయంలో పనిచేసే పూజారులకు, అంగరంగభోగాల సమయంలో పాటలు పాడేవారికి, నృత్యం చేసేవారికి ఇండ్లను నిర్మించారు. ఈ అంశాలకు సంబంధించి ఎన్నో విశేషాలు... రేచర్ల రెడ్డి వంశానికి చెందిన నామిరెడ్డి వేయించిన పిల్లలమర్రి శాసనాల వల్ల తెలుస్తున్నది.

క్రీ.శ. 1202 దుందుభి చైత్ర శుద్ధ ఏకాదశి రోజు రేచర్ల నామిరెడ్డి తన పేరుమీద పిల్లలమర్రిలో నామేశ్వర శివలింగాన్ని ప్రతిష్ఠించి దేవుని అంగరంగ భోగాలకు, ధూపదీప నైవేద్యాలకు భూమిని దానమిచ్చి వేయించిన శాసనం ఇది. మూడు పక్కల 144 పంక్తుల్లో సంస్కృత తెలుగుభాషల్లో ఉంది. రేచర్ల నామిరెడ్డి భార్య ఐతమ. కుమారుడు విశ్వనాథుడు, మేనల్లుడు ప్రోలయ వారి వారి పేర్లమీదుగా కూడా శివలింగాలను ప్రతిష్ఠించి పూజాదికాలకు దానాలు చేసినట్లు శాసనంలో ఉంది.

నామిరెడ్డి గుండ్లచెఱువు, కాత్యకెచెఱువుల కింద భూమిని ఆచంద్రార్కకంగా దానమిచ్చినట్లు తెలుస్తుంది. నేరడ్ల చెరువు, బిక్కమాల్య, కల్లూరు, చిల్లపల్లి గ్రామాల్లో రెండు మర్తుర్లు (నాటి భూమి కొలత), కాత్యకె చెరువు కింద ఉన్న భూమిని ఐతేశ్వర, విశ్వనాథేశ్వర దేవాలయాల నిర్వహణకు దానం చేసినాడు. నామిరెడ్డి సోదరి వల్లసాని. ఈమె తన కుమారుడు ప్రోలయ ప్రతిష్ఠించిన ప్రోలేశ్వర దేవుని నైవేద్యానికి పట్టపురావి తూర్పున రెండు మర్తుర్లు సమర్పించినట్లు తెలుస్తుంది. ఇదే శాసనంలో నామిరెడ్డి భార్య ఐతమ కుడుకుడియ గౌరసముద్రం కింద ఐతేశ్వర స్వామికి, విశ్వనాథ దేవునికి భూమి దానమిచ్చింది.

శాసనంలో శివుడి వర్ణన, కాకతి గణపతి దేవ చక్రవర్తి ప్రశంస, రేచర్ల వంశ వర్ణన ఉన్నాయి. శాసనకాలం పేర్కోని మరొక శాసనం కూడా (నామిరెడ్డి వేయించినది) నామేశ్వరాలయ గోడపై 17 పంక్తుల్లో ఉంది. బహుశ ఇది ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత వేయించి ఉండవచ్చు. ఇందులో దేవాలయంలో ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసేవారికి, అందులో సేవలు అందించేవారికి ఇచ్చిన దానం గురించి ఉంది.

ఈ శాసనంలో శ్రీ నామేశ్వర స్థానాపతికి, రంగంవారికి ‘పిల్లలమర్రి కోటలో’ ధారాపూర్వకంగా ఇండ్లు కట్టించి ఇచ్చిన విషయం తెలుస్తుంది. అందులో ప్రధాన పూజారి గంగజియ్య, ఆవుజం (సంగీత వాయిద్యం) వాయించే ముప్పోజుకు; మద్దెల వాయించే మల్లోజు, దామ దామన, బ్రహ్మలకు; పాత్ర (నృత్యం చేసేవారు) సీతమ, అన్యమ, పార్వతి, ముత్తమలకు; వాసెకార (మురళి వాయించేవాడు) పోతనకు; మోకరి (శంఖం ఊదేవారు) దామకు; పాడి (పాటలు పాడేవారు) త్రిపురమ, జక్కమ, బ్రమ్మక, మారకలకు; పడిహారి (ప్రతిహారి) విమలెకు; పూజారులు రామజియ్య, ప్రోలజియ్య, కొమ్మజియ్యలకు ఇండ్లు నిర్మించినట్లు ఉంది.

ఇక్కడ ఒక విశేషాన్ని గమనించాలి. దేవాలయ వ్యవస్థ రాజ్యవ్యవస్థలో భాగం. ఆ ఆలయ నిర్వహణ, తత్సంబంధ బాధ్యతలు నిర్వహించే వ్యక్తులకు సంబంధించిన అన్ని అంశాలలో వారికి అనుకూలంగా ఉండేవిధంగా నిర్ణయాలు తీసుకునే విధానం నాటి కాలంలో ఉన్నట్టు గమనించవచ్చు. అంతేకాదు! పిల్లలమర్రి చుట్టుప్రక్కల కొంతప్రాంతాన్ని కలుపుకొని పెద్ద కోట ఏదో ఉన్నట్లు గమనించవచ్చు. దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- డా. భిన్నూరి మనోహరి, 9347971177


logo