శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Aug 08, 2020 , 22:48:48

కుంతి కోరిన రెండు వరాలు

కుంతి కోరిన  రెండు వరాలు

భజనీయుడు, భక్తుడు అన్న భేదం భక్తియోగ అనుష్ఠానానికి కల్పితం. కల్పితమైన ఈ ద్వైతం అద్వైతం కంటే  ఎంతో సుందరమని భాగవత సిద్ధాంతం. స్తుతించడం మనిషికి సహజ స్వాభావిక గుణం. ఆత్మతృప్తికై అహంకారంతో ఆత్మస్తుతికైనా పాల్పడతాడు లేదా స్వార్థసిద్ధికై పరులనైనా తెగబడి స్తుతిస్తాడు. ‘ధనకాంక్షతో ధనవంతులను సాదరంగా స్తుతించిన విధంగా సర్వకర్మఫలప్రదాత అయిన సర్వేశ్వరుని స్తుతిస్తే సంసార బంధనాలే సమసిపోతాయి గదా!’ అంటున్నది సనాతన ధర్మం. కలిలో ముక్తికి సులభసాధనం భక్తి. భాగవతం భక్తి రసామృత సాగరం. ఈ భక్తి నవ విధాలని భాగవత మతం.

అని భక్త ప్రహ్లాదుని నోట ఆహ్లాదభరితంగా పలికించిన పోతన తన కవితలో నవనిధుల వంటి నవవిధ భక్తులను నవనవోన్మేషంగా పోషించి పొంగించాడు. కీర్తన- స్తోత్ర భక్తికి భాగవతం అక్షయ భండారం. ప్రథమ స్కంధంలోని ‘కుంతీస్తవం’తో కీర్తన భక్తి ప్రారంభమవుతుంది. వెనువెంటనే భీష్మస్తుతి! ‘పితామహా! తమ మతానుసారం ఏది సర్వోత్తమ ధర్మం?’ అని ప్రశ్నించిన ధర్మరాజుకు భీష్ముడు- ‘యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరస్సదా’ (భవ్యమైన స్తోత్ర మంజరులతో భగవంతుని భక్తిపూర్వకంగా అర్చించటం అంటే కీర్తన భక్తి పరమ ధర్మం) అని సమాధానమిస్తాడు. ఆ మహాభక్తుని దృష్టిలో- ‘స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతా’ స్తుతిపాత్రుడు, స్తుతి ప్రియుడు, గుణకీర్తనాత్మక స్తోత్రం, స్తవనక్రియ, స్తుతి కర్త- పారమార్థికంగా సర్వం భగవంతుడే!

కృష్ణుడు లేనిదే భారతకథే లేదు. కురుపాండవ యుద్ధమనే మాటేగాని సర్వంసహాసంచాలకుడు సంకర్షణుడే! ‘ఎచ్చట ధర్మమో అచ్చట కృష్ణుడు. ఎచ్చట కృష్ణుడో అచ్చట జయం’- ఇదేగదా మహాభారత జయఘోష! ‘సారం గృహ్ణాతి పండితః’ (సారగ్రహణమే పాండిత్యం) అన్నట్లు భారతకథ అంతా ఒక్క పద్యంలో గుప్పించి చాలా గొప్పగా చెప్పాడు పోతన-

ఎంతో విసురుగా, వినసొంపుగా, అర్థగాంభీర్యంతో సాగిన హృద్య అనవద్యమైన పద్యమిది. ద్రౌపదిని కొప్పు పట్టి సభకు ఈడ్చుకు రావడమే మహాపాపం. దానితోనే గర్వాంధులైన దుర్యోధనాదుల ఆయువు తీరిపోయింది. వారందరినీ కృష్ణుడు పాండవులతో సమరంలో సంహరింప చేశాడు. ధర్మపుత్రునికి రాజ్యం ఇప్పించాడు. ఆయనతో దేవేంద్ర వైభవంతో మూడు అశ్వమేధయాగాలు చేయించి రాజలోకంలో ఆయనకు అఖండ ఖ్యాతిని ఆర్జించి పెట్టాడు. ‘పాంచాలీ కబరీ వికర్షణం’- పండిత ప్రశంసలందుకొన్న పవిత్ర రాజసూయ మహాధ్వరంలో అవబృధ స్నానంతో పునీతమైన పాంచాలి జుట్టు పట్టుకొని నీచాతినీచంగా నిండుకొలువులోకి ఈడ్చుకు తెచ్చారు ధర్మదూరులైన ధార్తరాష్ర్టులు. ద్రౌపది వక్షఃస్థలం కుంకుమ కన్నీటితో కరుగుట శత్రువుల భార్యల పసుపుకుంకుమలు చెరుగుటకు సూచన! అందుకే ‘భారత యుద్ధం బొమ్మల యుద్ధం’ అన్నారు పెద్దలు. సూతవేషధారియే సూత్రధారి! యుద్ధానికి ముందే యుద్ధఫలమేమిటో భగవంతుడు- ‘మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్‌' (పార్థా! కురువీరులంతా నాతో మునుపే నిహితులయ్యారు. నీవు నిమిత్తమాత్రుడవు) అని గీతలో  చెప్పాడు. చంపించి, ఇప్పించి, చేయించి, కల్పించి- ఈ క్రియపదాలకు అర్థమేమిటి? పాండవుల కర్తృత్వం అప్పటికి నామమాత్రమేనని, కారయిత (ప్రేరకుడు) పురుషోత్తముడు కృష్ణుడే అని పండితార్థం! చివరకు అశ్వత్థామ క్రోధాగ్ని జ్వాలకు ఆహుతి కాకుండా ఉత్తర గర్భంలోని పసికందును- పరీక్షిత్తును ప్రాణం పోసి పరిరక్షించి పాండవ వంశాన్ని నిలబెట్టింది కూడా ‘పరమపురుషుడే’! ‘మహాపాపక్షతాయుష్కులన్‌'- ఈ సమాసంలోని ‘మహాపాప’మనే మాట మూలాన్ని మించి ‘పాపతీవ్రత’ను ప్రకటించడమే కాక పోతనకున్న ‘పాపభీతి’ని కూడా వ్యంజింపజేస్తోంది.

వంశం నిలిచినందుకు కుంతీదేవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సంతోషం పట్టలేక ఆ మహా భక్తురాలు కొడుకులు, కోడళ్లతో వచ్చి ప్రయాణ సన్నాహంలో ఉన్న పరమాత్ముని కృతజ్ఞతతో భక్తిరస భావ బంధురంగా, ఉదాత్త గంభీరంగా బహు విధాల స్తుతించింది. ఈ స్తవంలో చివర కృష్ణుని భక్తలోకానికే ఆదర్శంగా రెండు కోరికలు కోరింది. మూలంలోని రెండు శ్లోకాల భావాన్ని పోతన ఒక పద్యంలో నిక్షిప్తం చేసి నివేదించాడు-

స్వామి! పుట్టినింటి వారని యాదవులందు, పుత్రులని పాండవులందు నాకు మోహ(స్నేహ) పాశం దృఢంగా అల్లుకుంది. అజ్ఞానమూలకమైన ఈ మమకార బంధాన్ని సమూలంగా త్రెంచి వెయ్యి. ఇది మొదటి కోరిక. పరమాత్మ ద్వారక విడిచి హస్తినకు వస్తే స్వామి వియోగాన్ని యాదవులు సహించలేరు. హస్తిన వదలి ద్వారకకు ప్రయాణమైతే పాండవులు సహించలేరు. వారిద్దరి విరహ వ్యధ చూస్తే కుంతీదేవికి బాధ! ‘మమత’ వల్లనేగా ఈ మనఃక్షోభ? ఇంట్లో పెంపుడు చిలుక చస్తే ఇంటిల్లిపాదికి గంపెడ దుఃఖం. అదే ఒక ఎలుక చస్తే ఉలుకు పలుకు లేదే! ఎందుకని?చిలుకలో మమత్వం (నాది అన్న భావం) ఉంది. ఎలుకలో అది లేదు. స్నేహం (నూనె) వల్లనే కదా ఆర్ద్రమైన-తడిసిన వత్తి కూడా దహించబడిపోతూ ఉన్నది! కనుక, స్నేహపాశాన్ని ఛేదించమంటున్నది. యాదవ పాండవులు- ఇరు వంశాల వారికి ఉరుక్రము (కృష్ణు)ని యందు ఊర్జితమైన భక్తిప్రపత్తులు. వారిని భక్తులుగా ప్రేమించాలేగాని బంధుభావంతో కాదని తాత్పర్యం.

‘కృష్ణా! సాగరసంగమానికి పరుగులెత్తే గంగవలె నా బుద్ధి నిండైన ప్రేమతో నిరంతరం నీ పాదపద్మస్మరణలోనే నిలుకడ పొందునట్లు అనుగ్రహించు.’ ఇది రెండవ కోరిక. ‘నదీనాం సాగరో గతిః’- గంగకు సాగరగమనం సహజ స్వారసికం, అప్రయత్నం. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎదిరించి ఎదర(ముందు)కే ఉరుకుతూ పోతుంది గంగ. కాని, ప్రపంచ చింతనం వలె బుద్ధికి పరమాత్మ పద పద్మధ్యానం స్వాభావికం- నైజం కాదు. పురుష ప్రయత్నంతోనే అభ్యసించి అలవర్చుకోవాలి. భగవత్‌ కృప లేక భక్తి జనించదు. భక్తి లేక కృపకు నోచుకోలేము. రెంటికీ కార్యకారణ సంబంధం. అందుకే కుంతి నందనందనుని అనుగ్రహ ఆశీస్సులు ఆశిస్తున్నది. నది సాగరంలో చేరి నామరూపాలు త్యజించి ఏకమైనట్లు భక్తుని అంతఃకరణం భగవదాకారం పొందాలి. భగవంతుని యందు నిత్య, నిరతిశయ నిరవధిక ప్రేమయే భక్తి. ఆ ప్రేమ పరమాత్మలో ఏకోన్ముఖంగా, నిరంతరాయంగా ప్రవహించాలి. మన ప్రేమ ప్రవాహం సంసార క్షార సముద్రంలో పడి వ్యర్థమైపోతోతున్నది. ఆ ప్రవాహానికి వైర్యాగమనే ఆనకట్ట కట్టి అభ్యాసమనే కాలువల గుండా క్షీరసాగరుని వైపు మళ్లించాలి.

- తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ

98668 36006 logo