బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - Aug 08, 2020 , 02:16:30

భాయీ.. సైకిల్‌ ఎంత హాయి!

భాయీ.. సైకిల్‌ ఎంత హాయి!

సైకిల్‌ ఏ రకంగా చూసినా మేలైనదే. చౌకగా లభిస్తాయి. శరీరదారుఢ్యాన్ని పెంచుతాయి. బాలికలకు, మహిళలకు సాధికారత లభిస్తుంది. ప్రయాణం లో స్వతంత్రత ఉంటుంది. నిర్వహణ ఖర్చు ఉండదు. క్రీడాకారులు ఆసియా గేమ్స్‌, ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ఉపయోగపడుతుంది.

గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన వారికి సైకిల్‌తో అనుబంధం ఉంటుంది. నేను పెరిగిన ఒడిశాలోని రూర్కెలా అలాంటి అనుభూతిని ఇచ్చేదే. దాదాపు నలభయేండ్ల కిందటి ఆ జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. వానలో కాళ్లు దిగబడే బురద ప్రాంతాల్లో సైక్లింగ్‌ నాకిప్పటికీ గుర్తొస్తుంటుంది. సైకిల్‌పై నా తొలి దీర్ఘ ప్రయాణం ఒక పిక్నిక్‌ కోసం మిత్ర బృందంతో కలిసి 35 కిలోమీటర్లు వెళ్లడం. మా కాలేజీకి కూడా 15 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్ళేవాళ్ళం. 

హైదరాబాద్‌లో సెటిలైన తరువాత పరిసరాల్లోని శామీర్‌పేట, ఫాక్స్‌ సాగర్‌, తుర్కపల్లి చెరువు, ఘట్‌కేసర్‌, నర్సాపూర్‌, లాల్‌గడి మలక్‌పేట తదితర ప్రాంతాల్లో సైకిల్‌పై పర్యటించడం మరిచిపోలేని గొప్ప అనుభూతి. నేను నా ఇంగ్లిష్‌ కవితల తొలి పుస్తకాన్ని (మూవింగ్‌ ఆన్‌..) తెచ్చినప్పుడు మూడునెలలపాటు ఆ ప్రదేశాలన్నింటినీ కలియదిరిగాను. అక్కడి పచ్చదనం మనిషిలోని భావుకుడిని తట్టిలేపేది. 

ఈ కొవిడ్‌ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌లో నాకు మళ్ళీ సైక్లింగ్‌ కోరిక చెలరేగింది. లాల్‌గడి మలక్‌పేట పరిసరాల్లో తిరిగాను. ప్రణాళిక లేని, వేగవంతమైన నగరీకరణ తెచ్చిన దుష్ఫలితాలు నన్ను దిగ్భ్రాంతికి గురిచేశాయి. గ్రామాలు కూడా నగరాల వలెనే గందరగోళంగా మారిపోతున్నాయనిపించింది. సైకిళ్ల వల్ల గ్రామాలకు మళ్ళా పల్లెదనం తేవచ్చా అనే ఆలోచన కూడా కలుగుతున్నది. ఇది బంగారు తెలంగాణ సాధనకు దోహదపడుతుందా అనే ఆలోచన కూడా కలుగుతున్నది. 

సైకిల్‌ ఏ రకంగా చూసినా మేలైనదే. చౌకగా లభిస్తాయి. శరీరదారుఢ్యాన్ని పెంచుతాయి. బాలికలకు, మహిళలకు సాధికారత లభిస్తుంది. ప్రయాణంలో స్వతంత్రత ఉంటుంది. నిర్వహణ ఖర్చు  ఉండదు. క్రీడాకారులు ఆసియా గేమ్స్‌, ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ఉపయోగపడుతుంది.

ఆఫీసుకు వెళ్ళడానికైనా, సంతోషం కోసమైనా పల్లెల్లో ఉన్నవారు సైకిళ్ళపై వెళ్ళే అవకాశం ఎందుకు ఉండకూడదు! ప్రతి ఊరిలో జనాభాకు అనుగుణంగా గ్రామ పంచాయితీకి కొన్ని సైకిళ్ళు కేటాయించాలి. వీటిని అందరూ వాడుకోవాలె. పొలం దగ్గరికి, బడికి పోయేవారు ఈ సైకిళ్ళను వాడుకోవచ్చు. సైకిళ్ళను మాత్రమే అనుమతించే ఆదర్శ గ్రామాలను తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ఎన్నో లాభాలున్నాయి. రోడ్డు ప్రమాదాలుండవు. కాలుష్యం తగ్గుతుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అసలే ఉండవు. 

ఇదే వ్యూహాన్ని కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ వంటి చిన్న, మధ్యస్థాయి పట్టణాలలో అమలు చేయవచ్చు. సైకిల్‌పై వెళ్ళడాన్ని ఒక ప్రశాంతమైన ప్రయాణంగా, ఫ్యాషన్‌గా మార్చాలి. తెలంగాణలోని పలు చిన్న మధ్యతరహా పట్టణాలలో మంచి రహదారులున్నాయి. కానీ ఇవి మెల్లగా ట్రాఫిక్‌ జామ్‌ వంటి గందరగోళంలోకి జారుకుంటున్నాయి. కాలేజీలు, పాఠశాలల చుట్టూరా ఉండే కొన్ని కాలనీలను సైక్లింగ్‌ జోన్స్‌గా ప్రకటించు కుంటే ఉపయోగం. 

సైకిల్‌ ఎంత ఉపయోగకరమనేది పాశ్చాత్య దేశాలను గమనిస్తే అర్థమవుతుంది. డచ్‌ ప్రభుత్వం ఏటా 595 మిలియన్‌ యూరోలను సైక్లింగ్‌ కోసం ఖర్చు చేస్తున్నది. అంటే ప్రతి పౌరుడికి సగటున 35 యూరోలు వెచ్చిస్తున్నది. దీనివల్ల ఒక పౌరుడు సగటున ఏటా 912 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణిస్తున్నాడు. దీనివల్ల వైద్యం కోసం చేసే ఖర్చు 19 బిలియన్లు మిగులుతున్నవి. ఇది జీడీపీలో 3 శాతం. తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రం కూడా  సైకిల్‌ సంస్కృతిని పెంపొందిస్తే బాగుంటుంది. 

నెదర్లాండ్స్‌లో సగానికి పైగా జనాభా సైకిళ్ళపై  ప్రయాణిస్తారు. బెల్జియం, జర్మనీ, నార్వే, ఇంగ్లాండ్‌, స్వీడన్‌ తదితర దేశాలలో కూడా సైకిల్‌ ప్రాముఖ్యం కనిపిస్తుంది. భారత్‌ ఎప్పుడూ పోల్చుకునే చైనాలో కూడా సైకిల్‌ పోకడ ఉన్నది. ప్రపంచంలోకెల్లా ఎక్కువ సైకిళ్ళు ఉన్నది షాంఘైలోనే. కార్లకన్నా సైకిళ్ళ సంఖ్యే ఎక్కువ ఉంటుందంటే ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. తెలంగాణ నుంచి ఒక అధికార బృందం ఈ దేశాలకు వెళ్ళి సైకిల్‌ ప్రయాణం కోసం ఏయే సౌకర్యాలు కల్పించాలి, దాని వల్ల ఎటువంటి సత్ఫలితాలు ఉన్నాయనేది అధ్యయనం చేయాలి. 

ప్రపంచవ్యాప్త పోకడ నేపథ్యంలో సైకిల్‌ వ్యాపారం వృద్ధి చెందుతున్నది. ఈ రంగంలో తెలంగాణ ముందడుగు వేయవచ్చు. పలు సైకిల్‌ కంపెనీలు పదిహేను నుంచి ఇరవై శాతం మేర ధరలు పెంచాయి. సైక్లిస్టుల వస్తువులకు ఎంతో డిమాండ్‌ ఉన్నది. బిబ్స్‌ (చొక్కా మరకలు కాకుండా ముందు భాగాన వేసుకునే వస్త్రం) షార్ట్స్‌, జెర్సీస్‌ (క్రీడాకారుల చొక్కాలు) హెల్మెట్స్‌, గ్లవ్స్‌, సాడిల్‌ బాగ్స్‌ (సైకిల్‌ పక్క సంచి) మొదలైనవి ఇప్పుడు చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. వీటిని తెలంగాణలోనే తయారు చేసుకోవచ్చు. తెలంగాణలో ఆగస్ట్‌ నుంచి ఫిబ్రవరి- మార్చి వరకు సైక్లింగ్‌కు అనుకూల  వాతావరణం ఉంటుంది. ఎండకాస్తూ ఉంటుంది. పచ్చదనం పరుచుకొని ఆహ్లాదాన్నిస్తుంది. పొలాలు కూడా పచ్చగా ఉంటాయి. 

తెలంగాణలో మారు మూల ప్రాంతాలకు రహదారి సౌకర్యమున్నట్టు మన దేశంలో మరెక్కడా లేదు. సరస్సులు, కోటలు, ఆలయాలు, చర్చిలు, పురావస్తు కట్టడాలు, పక్షుల జంతువుల అభయారణ్యాలు, జింకల పార్కులు, అడవులు, ప్రకృతి సౌందర్య ప్రదేశాలు మొదలైన యాత్రా కేంద్రాలు తెలంగాణలో అనేకం ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాలను సందర్శించడానికి సైక్లింగ్‌ హాలీడేస్‌ ఇవ్వవచ్చు. హైదరాబాద్‌, వరంగల్‌ వంటి నగర ప్రాంతా ల కుటుంబాలను ఇందుకు పోత్రహించాలి. ఇందులో పాల్గొనేవారి స్థాయిని బట్టి సైక్లింగ్‌ హాలీడేస్‌ను నిర్ణయించవచ్చు. గ్రామాలలో బస సౌకర్యం కల్పించవచ్చు. 

కోవిడ్‌ మూలంగా అనేక ఆంక్షలు వచ్చిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఐదు నుంచి ఏడు రోజుల పాటు సైక్లింగ్‌ సెలవులు ఇస్తే బాగుంటుంది. సైకిల్‌ తొక్కడం వల్ల మనిషి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పల్లె ప్రాంతాల సౌందర్యాన్ని ఆస్వాదించినట్టు ఉంటుంది. తెలంగాణ సంస్కృతి గురించి కూడా తెలిసివస్తుంది. కొండలు ఎక్కడం, వన్యమృగాలు చూడటం, ఇతర సాహసకృత్యాల కోసం చాలా మంది హైదరాబాద్‌ నుంచి బయటకు వెళ్లి గ్రామీణ ప్రాంతాల అందాలను ఆస్వాదించ వచ్చు. 

(వ్యాస రచయిత ఆనంద్‌ విశ్వనాథ కవి, ప్రకృతి ఛాయాచిత్రకారుడు. హైదరాబాద్‌ స్థానికుడైన ఆనంద్‌కు పునరటవీకరణ, జీవవైవిధ్యం, వికలాంగులను ప్రధాన స్రవంతిలోకి తేవడం మొదలైన అంశాల పట్ల ఆసక్తి. ఆయన సైకిల్‌ అన్నా మోటారు సైకిల్‌ సవారీ అన్నా చాలా ఇష్టం. ‘చిత్రక్‌ ఎకో వెంచర్స్‌'లో చీఫ్‌ సస్టేనబిలిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.) 
logo