గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Aug 08, 2020 , 02:16:29

చర్చోపచర్చలు..

చర్చోపచర్చలు..

ఆరో అధ్యాయం కొనసాగింపు..

రథయాత్రను కొనసాగించేందుకు ధన్‌బాద్‌ వెళ్లవలసిన ఎల్‌.కె. అద్వానీ.. ఆర్‌.యన్‌.గోయెంకా, ఎస్‌.గురుమూర్తి, వార్తాపత్రికలకు చెందిన మరికొందరితో చెప్పిందేమంటే- ప్రభుత్వం పడిపోవాలన్నది తమ ఉద్దేశ్యం కాదని, ఒకవేళ ఆర్డినెన్స్‌ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే వివాద కట్టడానికి దగ్గర్లోని భూమిని అప్పగించేట్లయితే వీహెచ్‌పీ ప్రతినిధి వివాదాస్పద కట్టడం వద్ద రిసీవరుగా ఉన్నా లేకున్నా ఆర్డినెన్స్‌కు మద్దతు తెలుపుతానని. 

మధ్యాహ్నం గురుమూర్తి ప్రధానితో మాట్లాడారు. అప్పటికే మార్పు పొడసూపింది. ఆయన చెప్పిందేమంటే వివాదాస్పద కట్టడమే గాకుండా, వివాదంలో ఉన్న భూమి అంతా కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. అయోధ్య ఉద్యమానికి అప్పగించబడదని. అంతకుముందు అనుకున్నది అలా కాదుగదా అని గురుమూర్తి అన్నప్పుడు.. ప్రధాని ఆయన్ని తమ నివాసం వద్ద కలవమన్నారు. అప్పుడు వీపీ సింగ్‌, గురుమూర్తికి చెప్పిందేమంటే.. ఎల్‌.కె. అద్వానిగారు ఈ సమస్య పరిష్కారం నిమిత్తం తమ రథయాత్రను ఒకరోజు వాయిదా వేసుకోవాలనీ, అద్వానీతో కలిసి తామూ కరసేవకు అయోధ్యకు వస్తామని. ఇది అద్వానీకి చెప్పినప్పుడు మొదట అనుకున్న ప్రకారం ఆర్డినెన్స్‌ ప్రతిపాదన ఉంటే తాను ఇంకా అక్కడ ఉండవలసిన పనిలేదనీ, ఆ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యమేనని తెలియజేశారు. 

ఆ సాయంత్రం మళ్లీ ప్రధాని నివాసం వద్ద ఓ సుదీర్ఘ సమావేశం- రాత్రి 9 గంటల వరకూ నడిచింది. వీపీ సింగ్‌, గురుమూర్తిని తమ సహచరులతో చర్చించమన్నారు. ఆయన జార్జి ఫెర్నాండజ్‌, అరుణ్‌ నెహ్రూ, అజిత్‌సింగ్‌, దినేష్‌ గోస్వామిలకు విషయాన్ని వివరించారు. చర్చలు ముగిసేవరకు మంత్రులు సమావేశంలో పాల్గొనే ఉన్నారు. గురుమూర్తితోపాటు అరుణ్‌జైట్లీ మరో ప్రముఖ పాత్రికేయుడు కూడ ఉన్నారు. వీపీ సింగ్‌ సమావేశ మందిరంలోకి వస్తూ పోతూ ఉన్నారు అదే సమయంలో పక్క గదుల్లో వేర్వేరు వ్యక్తుల్ని కలుసుకుంటూ. న్యాయశాఖామాత్యులు దినేష్‌ గోస్వామి ఎన్నెన్నో దావాలు, వందలాది సమస్యలు ఉన్నందున ఆర్డినెన్స్‌ అనుకున్న ప్రకారం జారీచేసే వీలు కలుగలేదని, వాస్తవానికి కోర్టులో కేసులు నడుస్తున్నందున ఆ విషయంపై శాసనం చేసేందుకు వీలుపడలేదనీ చెప్పారు. అప్పడు అరుణ్‌జైట్లీ, గురుమూర్తి ఆయనకు వివరించిందేమంటే.. వందలాది విషయాలన్నీ మూడు శీర్షికల కింద క్రోడీకరించుకోవచ్చు. 1. రాముని జన్మస్థలం అదేనా? 2. అక్కడి వివిధ భూములు ఎవరికి చెందినవి? 3. అంతకుపూర్వం అక్కడ హిందూ కట్టడం ఉందా? మొదటిది: న్యాయపరంగాగానీ, శాసనంద్వారాగానీ తేల్చి చెప్పగలిగేది కాదు. రెండవది: శాసనం ద్వారా వివాదాలకు దూరంగా నిర్బంధ భూసేకరణ చేయవచ్చు. మూడవది: న్యాయ ప్రకటన ద్వారానో, తీర్పు ద్వారానో పరిష్కరించవచ్చు. అప్పడు అరుణ్‌నెహ్రూ.. ‘మీరు చెప్పేది ఆమోదయోగ్యమైనది అయితే ఆర్డినెన్స్‌ ఇవ్వవచ్చును’ అన్నారు. రాత్రి పొద్దుపోయిన  తరువాత ఆర్డినెన్స్‌, పథకము పత్రికలకు విడుదల చేశారు. 

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)logo