మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Aug 07, 2020 , 03:26:42

చేనేత కళాకారుల గొంతుక కేసీఆర్‌

చేనేత కళాకారుల గొంతుక కేసీఆర్‌

చేనేత 2004 నుంచి 2008 మధ్య కాలంలో రంగం అనేక ఒడిదొడుకులకు లోనయింది. అప్పుడు చేనేత కళాకారుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయి. చేనేత సమస్యల పరిష్కారానికి అప్పటి ప్రభుత్వంపై పెద్ద పోరాటమే చేయవలసి వచ్చింది. 2008 అక్టోబర్‌ 22న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద దాదాపు 12వేల మంది చేనేత కళాకారులతో ధర్నా కార్యక్రమానికి అతిథిగా పిలువడానికి అప్పటి తెలంగాణ ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసినప్పుడు దాదాపు మూడుగంటలపాటు చర్చించారు. చేనేత రంగంపై ఆయన అవగాహన చూసి ఒకింత ఆశ్చర్యం వేసింది. మీరు చేస్తున్న డిమాండ్లు సరిగా లేవు శాశ్వత ప్రాతిపదికన ప్రణాళికలు ఉండాలని చెప్పారు. తన చిన్నతనం నాటి దుబ్బాక అనుభవాలను పంచుకున్నారు. ఆయన మాటలు మాపై తీవ్ర ప్రభావాన్నే చూపాయి. మా ప్రణాళికలు, ప్రయత్నాలు ఆ దిశగానే సాగాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేనేత రంగాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించారు. పథకాల తీరుతెన్నులు, అమలు, వాటి ఫలాల సద్వినియోగం వంటి అంశాలపై అనేక గంటలపాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. సంక్షేమ పథకాల ఫలాలు క్షేత్ర స్థాయిలోని ప్రతి చేనేత కళాకారుడికి చేరవేసేందుకు పెద్ద కసరత్తే జరిగింది. నిజమైన చేనేత కళాకారులకు సహాయం కోసం వారిని గుర్తించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా జియో ట్యాగ్‌ విధానాన్ని తెచ్చారు. దీనిని అనుసరించాలని ఇతర రాష్ర్టాలు, భారత ప్రభుత్వం ఆలోచిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చిన చేనేత పథకాలు చరిత్రాత్మకమైనవి. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా త్రిఫ్ట్‌ ఫండ్‌ పథకంలో చేనేత కళాకారులు 8 శాతం పొదుపు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో 16 శాతం ఇచ్చింది. ఈ పథకం ఫలాలను మెజార్టీ చేనేత కళాకారులు అందుకున్నారు. సంవత్సరానికి ఒక చేనేత కళాకారునికి 25 వేల రూపాయల లబ్ధి చేకూరింది. ప్రతి చేనేత కళాకారుడు, చేనేత అనుబంధ కళాకారులకు ఈ పథకాన్ని వర్తింపచేసి కేసీఆర్‌ తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. 

నూలు, రంగులు, రసాయనాలపై 40 శాతం రాయితీ పథకాన్ని తెచ్చి ప్రభుత్వం 100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఒక ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నూలు రాయితీ 100 కోట్లు కేటాయించడం ఇదే ప్రథమం. కొన్ని సంవత్సరాలుగా నూలు రాయితీలు మింగే యార్న్‌ మాఫియా కన్ను ఈ పథకంపై పడింది. కేంద్ర ప్రభుత్వం పట్టుదారంపై ఇచ్చిన రాయితీలను ఈ యార్న్‌ మాఫియా 75 శాతం మింగేసింది. దీన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పైసా అర్హుడైన చేనేత కళాకారునికే చెందాలనే ఉద్దేశంతో కొన్ని కఠిన నిబంధనలను పెట్టింది. చేనేత రుణమాఫీతో చేనేత కళాకారులకు కొంత ఉపశమనం కలిగింది. కేటీఆర్‌ చేనేత మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత చేనేత ఉత్పత్తుల బ్రాండ్‌ ప్రమోషన్‌ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగింది. ఐటీ, ఇతర కార్పొరేట్‌ సెక్టార్‌ ఉద్యోగులు చేనేత ఉత్పత్తులకు దగ్గర అయ్యారు. ప్రతిభ కనబర్చిన చేనేత కళాకారులకు 10వేల నగదు పురస్కారంతో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరిట అవార్డ్స్‌ ప్రదానం చేయడం కళాకారులకు ఇచ్చే అరుదైన గౌరవం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ అవార్డ్స్‌తో చేనేత కళాకారుల సృజనలో పోటీ పెరగడమేకాక వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందింది. ఫలితంగా వస్త్ర ఉత్పత్తి నాణ్యత పెరిగింది. ఆధునిక డిజైన్లు మార్కెట్లోకి వచ్చాయి. చేనేత కళాకారుల జీతభత్యాలు వారి సృజన ఆధారంగా పెరిగాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆప్కో నుండి విడిపోయి మనం టెస్కోను ఏర్పాటు చేసుకున్నాం. 2018 జూన్‌ 19న ప్రభుత్వం తెలంగాణ హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను ఏర్పాటుచేసింది. కార్పొరేషన్‌ త్వరలోనే అన్ని హంగులతో కార్యకలాపాలు ప్రారంభించి చేనేత కళాకారుల జీవితాలలో వెలుగులు నింపాలి. చేనేత కళాకారులకు చేనేత వృత్తి భద్రతగా నిలిచేలా కార్యాచరణ ప్రకటించాలి. చేనేత కళాకారులకు వృత్తి భద్రత, జీవన భృతి కల్పించాలి. జియో ట్యాగ్‌ ఆధారంగా ప్రతి చేనేత కళాకారునికి ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా లేదా కార్పొరేషన్‌ ద్వారా పనికల్పించాలి. జియో ట్యాగ్‌ లేని చేనేత మగ్గాలకు జియో ట్యాగ్‌ వెయ్యాలి. ప్రతి చేనేత కళాకారునికి వైద్య బీమా చేయించాలి. రైతుల మాదిరిగా చేనేత కళాకారులకు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ చేయాలి. చేనేత కుటుంబాల పిల్లలకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ వంటి సంస్థలలో ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి. ప్రభుత్వం మరికొంత ప్రోత్సాహం ఇస్తే తెలంగాణ చేనేత కళ అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర పతాకాన్ని ఎగురవేస్తుంది.

(నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా....)


logo