మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Aug 07, 2020 , 03:26:43

వీపీ సింగ్‌ చర్చలు

వీపీ సింగ్‌ చర్చలు

  • ఆరో అధ్యాయం కొనసాగింపు..

ధాని వీపీ సింగ్‌ 1990 అక్టోబర్‌ 15న శ్రీ యస్‌ గురుమూర్తిని పిలిపించుకున్నారు. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు నాలుగు దఫాలుగా నాలుగు గంటలు వాళ్లు చర్చలకు కూర్చున్నారు. గురుమూర్తి.. వివాదంలో ఉన్న స్థలాన్నంతా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దానిని వీహెచ్‌పీ ట్రస్ట్‌కు అప్పగిస్తూ, వివాదంలో ఉన్న కట్టడాన్ని దానిచుట్టూ ఓ 30 అడుగుల స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకొని అంతకుపూర్వం ఆ వివాద కట్టడం వద్ద హిందూ కట్టడం ఏమయినా ఉందా అనే విషయాన్ని రాజ్యాంగంలోని 143వ అధికరణం కింద సుప్రీంకోర్టు నుంచి న్యాయాభిప్రాయాన్ని పొందవచ్చునని సలహానివ్వటం జరిగింది. వీపీ సింగ్‌ ఆ విధంగా మూడు అంశాలతో కూడిన ప్రతిపాదన, ఆర్డినెన్స్‌ ముసాయిదా రాత్రికి రాత్రే తయారు చేశారు. ఉదయం 5 గంటలకు అధికారుల కమిటీ ఒకటి కేబినెట్‌ సెక్రటరీ ఇంటివద్ద సమావేశమై డ్రాఫ్టును ఖరారు చేయటం జరిగింది. ఉదయం 10 గంటల సమయంలో ప్రధాని నివాసం వద్ద కేబినెట్‌ సమావేశమై ఆర్డినెన్స్‌ను, మూడు అంశాల పరిష్కారాన్ని ఆమోదించటం జరిగింది. ఆర్డినెన్స్‌ అనేక కోణాల నుంచి జాగ్రత్తగా పరిశీలించవలసి ఉన్నందున వెంటనే విడుదల చేయబడలేదు. 

1990 అక్టోబర్‌ 18 గురువారం గురుమూర్తి మద్రాసులో ఉండగా వెంటనే ఢిల్లీకి రావలసిందిగా వీపీ సింగ్‌ కోరారు. ఆయన ఆ విధంగా అక్టోబర్‌ 19 ఉదయానికి ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఉదయమే సుందర్‌నగర్‌లోని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అతిథి గృహంలో సమావేశం జరిగింది. రథయాత్రను కొనసాగించేందుకు ధన్‌బాద్‌ వెళ్లవలసిన ఎల్‌.కె. అద్వానీ కూడ అక్కడే ఉన్నారు. అక్కడ ఇంక ఆర్‌.యన్‌.గోయెంకా, ఎస్‌.గురుమూర్తి, వార్తాపత్రికలకు చెందిన మరికొందరు మిత్రులు ఉన్నారు. అద్వాని స్పష్టంగా చెప్పిందేమంటే- ప్రభుత్వం పడిపోవాలన్నది తమ ఉద్దేశ్యం కాదని, ఒకవేళ ఆర్డినెన్స్‌ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే వివాద కట్టడానికి దగ్గర్లోని భూమిని అప్పగించేట్లయితే వీహెచ్‌పీ ప్రతినిధి వివాదాస్పద కట్టడం వద్ద రిసీవరుగా ఉన్నా లేకున్నా ఆర్డినెన్స్‌కు మద్దతు పలకగలనన్నారు.


logo