గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Aug 06, 2020 , 00:20:14

సంక్షేమ రాజ్యం

సంక్షేమ రాజ్యం

కల్పిత వార్తలతో తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడంలో వలసపాలకులు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. రుణాలు అందక రైతులు అవస్థ పడుతున్నట్టు, వడ్డీ వ్యాపారుల బారిన పడిపోతున్నట్టు, ఆ వడ్డీరేట్లు కూడా పెరిగిపోయాయనీ, ఇదే సమయంలో అప్పులు దొరకక అల్లాడిపోతున్నారనీ దుష్ప్రచారం మొదలు పెట్టారు. నిజానికి తెలంగాణ రైతులు వడ్డీ వ్యాపారుల చేత చిక్కి ఆత్మహత్యలకు పాల్పడిన దయనీయ స్థితి ఉమ్మడి రాష్ట్రంలోనే ఉండేది. వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు, గ్రామీణ వృత్తులు కుంటుపడి, ప్రజల చేతిలో చిల్లిగవ్వలేక కునారిల్లిన కాలమది. నీళ్ళు లేక, కరెంటు రాక కండ్ల ముందే పొలాలు ఎండిపోయి రైతుల గుండెలవిసిపోయిన రోజలవి. నాటి ఆంధ్రా పాలకుల దుష్పరిపాలనను గుర్తుచేసి బోనులో నిలబెట్టాల్సింది పోయి, రైతుల కోసం అహరహం కష్టపడుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం ఆంధ్రా మీడియా వక్రబుద్ధికి నిదర్శనం. 

స్థూలంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరికించడంతో పాటు, సూక్ష్మస్థాయిలో సామాన్య రైతు అనుభవిస్తున్న బాధలను కూడా లెక్కలోకి తీసుకుని తెలంగాణ ప్రభుత్వం అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నది. ఒకప్పుడు ఎరువులు, విత్తనాలను కూడా తెలంగాణ రైతులకు ప్రభుత్వం సరఫరా చేయకపోయేది. పోలీసుస్టేషన్లలో  కొద్ది పాటి నిలువలు పెట్టి రైతులను లాఠీలతో కొట్టిన రోజులవి. ఆనాడు కరెంటు లేక అహోరాత్రులు రైతులు అవస్థలు పడేవారు. పాములు కుట్టి మరణించడం ఆనాడు సర్వసాధారణం. ఇవన్నీ వలసపాలకులకు గుర్తులేకపోవచ్చు, కానీ తెలంగాణ రైతులు మరిచిపోలేరు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో రైతుల మొహాల్లో ఆనందాన్ని చూసి ఓర్వలేకనే ఆంధ్రా పెత్తందారులు విషప్రచారాలకు దిగుతున్నారు. 

తెలంగాణ రాష్ట్రం అవతరించిన నాటి నుంచి ఏటా రైతుల కోసం, ఇతర గ్రామీణుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు గ్రామాలలోకి ప్రవహిస్తున్నాయి.  రైతు సంక్షేమ కోసం వివిధ సంక్షేమ పథకాల పేర, అభివృద్ధి ప్రాజెక్టుల రూపంలో ప్రతి  సంవత్సరం 70 వేల కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ, సబ్సీడీలు, నీటిపారుదల ప్రాజెక్టుల వంటి విభిన్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. వీటిలో దేనికదే సాటి. ఇవన్నీ రైతులను భాగ్యవంతులుగా చేసేవే. ప్రభుత్వ పథకాల మూలంగా గ్రామంలో నగదు వాడకం పెరిగిందనేది వాస్తవం. గతంతో పోలిస్తే రైతులకు భారీగా రుణాలు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ ధాన్యాన్ని ప్రభుత్వమే కోనుగోలు చేయడం రైతుల సంక్షేమ పట్ల కేసీఆర్‌ చిత్తశుద్ధికి నిదర్శనం. కట్టుకథల ప్రచారంతో ఆంధ్ర పాలకులు ఆత్మ వంచనకు పాల్పడగలరు కానీ, తెలంగాణ ప్రజలను నమ్మించలేరు.


logo