శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - Aug 06, 2020 , 00:20:18

ఉద్యోగం ఏదైనా ఉద్యమ పాఠాలే

ఉద్యోగం ఏదైనా ఉద్యమ పాఠాలే

తెలంగాణ ఆకాంక్షను వెలికి తీసి పట్టువిడుపులతో ఒక రాజకీయ ప్రక్రియగా మారడానికి ఇతోధికంగా కృషిచేసిన బుద్ధిజీవి జయశంకర్‌ సార్‌. జీవితమంతా ఉద్యమించిన ఆయన తెలంగాణ సాకారం కాకముందే మనల్ని విడిచివెళ్లారు. పొడిచే ప్రతి పొద్దులో ఆయన ప్రాతఃస్మరణీయుడు. పచ్చటి పొలాల్లో, సస్యశ్యామలం చేస్తున్న జలాల్లో, అభివృద్ధికి కదులుతున్న కవుల కలాల్లో, గాయకుల గళాల్లో, ఉద్యమకారుల ఊపిరిలో, యావత్‌ తెలంగాణ ప్రజల గుండెల్లో జయశంకర్‌ సార్‌ ఎల్లప్పుడు జీవించే ఉంటారు.

మనసా, వాచా, కర్మణా తెలంగాణ సర్వస్వంగా, ఆఖరి శ్వాస దాకా తెలంగాణ ధ్యాసగా జీవించిన వ్యక్తి జయశంకర్‌ సార్‌. నిండైన విగ్రహం తొణకని వ్యక్తిత్వం, మృదుభాషణం స్థితప్రజ్ఞత, ఆయన సొంతం. నిరాడంబరతకు నిలువెత్తు రూపం. నిగర్వి, అద్భుత వక్త, దీర్ఘదర్శి, వెరసి నిఖార్సయిన తెలంగాణ వాది జయశంకర్‌ సార్‌. తెలంగాణ ఉద్యమానికి వ్యక్తి రూపం ఇస్తే అది  జయశంకర్‌ సారే. ఉండాల్సిన చోట ఘనంలా, ఇంకాల్సిన చోట ద్రవంలా,  వీచాల్సిన  చోట వాయువులా, మండాల్సిన చోట నిప్పులా మండుతూ  తెలంగాణ నిర్మాణానికి ముగ్గు పోసిన సిద్ధాంతి ఆయన. దళిత, బహుజన, విప్లవ శిబిరాలు వేరు వేరు రంగాలలో తలమునకలైన వేళ వారందరినీ తెలంగాణ ఉద్యమం వైపు మళ్ళించి ఉద్యమానికి ప్రధాన ఇరుసుగా అన్ని శక్తులను కదిలించిన చోదకశక్తి జయశంకర్‌ సార్‌. భావజాల వ్యాప్తిలో ముందుండి తెలంగాణను ఒక తేల్చవలసిన అంశంగా మార్చి, ఆజన్మ బ్రహ్మచారిగా తెలంగాణకు జీవితం అంకితం చేసిన త్యాగి.

1934 ఆగస్టు 6న పోరుగడ్డ ఓరుగల్లులోజన్మించిన ఉద్యమ కెరటం జయశంకర్‌ సార్‌. విప్లవోద్యమాలతో సామాజిక అవగాహన పెంచుకుని చైతన్యవంతమై, స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా అడుగులు వేసి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ మొక్కవోని ధైర్యంతో చివరివరకు శ్రమించిన పోరాటయోధుడు ఆయన. నిజాం ఏలుబడిలో రజాకారుల దాష్టికానికి తట్టుకోలేక ఆంధ్ర వలస పోయిన తెలంగాణ ప్రజలను ఆంధ్రులు ఏ రకంగా దోపిడీ చేశారో, ఏ రకంగా అవహేళన చేశారో  తెలుసుకున్న జయశంకర్‌ సార్‌ విద్యార్థి దశలోనే తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఆకళింపు చేసుకుని 1952లో ‘నాన్‌ ముల్కీ గో బ్యాక్‌' ఉద్యమంలో పాల్గొన్న యువకెరటం. విద్యార్థిగా చదువులో ముందుంటూనే సమాజం పట్ల బాధ్యత ఎరిగిన మహాశక్తి. కాకతీయ యూనివర్సిటీలో  అయ్యదేవర కాళేశ్వరరావు ఆంధ్ర తెలంగాణ విలీన ప్రతిపాదన తెచ్చినప్పుడు అదే వేదికపై వ్యతిరేకించి.. ‘మేం అడుక్కుతినయినా బ్రతుకుతాం కానీ ఆంధ్రుల సోపతి కలవం’ అని గర్జించిన వ్యక్తి జయశంకర్‌. బెనారస్‌, అలీగఢ్‌ విశ్వవిద్యాలయాల నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా అందుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశారు. ఉపాధ్యాయుడిగా ప్రిన్సిపాల్‌గా, కాకతీయ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్‌గా, ఉపకులపతిగా వృత్తి ధర్మం నిర్వర్తిస్తూనే తెలంగాణ ప్రాంతాన్ని తరగతిగది చేసుకుని నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగినటువంటి వివక్షను యావత్‌ తెలంగాణ సమాజానికి విప్పి చెప్పిన గురువు ఆయన. 1954 ఫజల్‌ అలీ కమిషన్‌ మొదలుకొని 2010 శ్రీకృష్ణ కమిటీ వరకు ప్రతి కమిటీ ముందు ఎంతో సమర్థంగా తెలంగాణ ప్రజల మనోభావాలను, ఆంధ్రా దోపిడీని గణాంకాలతో వివరించారు. 

తెలంగాణ రాజకీయ సమస్య మాత్రమే కాదు. అది సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విముక్తి సమస్య అని విప్పి చెప్పినటువంటి మేధావి జయశంకర్‌ సార్‌. ప్రజలు ఉద్యమంలో ముందున్నప్పటికీ దానిని నడిపించే రాజకీయ నాయకుడు ఉండాలని ఆయన భావించారు. కేసీఆర్‌ ముందుకు రాగానే ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధ్యమని నమ్మారు. ఆయన ఊహించినట్లు కేసీఆర్‌ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.

తెలంగాణ కోసం ఎవరు పని చేసినా వారితో కలిసి పనిచేస్తూ సమాజాన్ని కార్యోన్ముఖులను చేస్తూ ఆర్‌స్సెస్‌  నుంచి ఆర్‌ఎస్‌యు వరకు అన్ని శక్తులను ఏకం చేయడం కోసం పరితపించాడు జయశంకర్‌ సార్‌. తెలంగాణ ఏర్పడాలంటే భావజాల వ్యాప్తి, ఉద్యమం, రాజకీయం సమాంతరంగా నడవాలని సూత్రీకరించాడు. తెలంగాణ ఐక్యవేదిక, విద్యావంతుల వేదిక, ఐక్యకార్యాచరణ కమిటీ, తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం వంటి వేదికలకు ఆద్యుడు. మేధావులను, రచయితలను, కళాకారులను, స్వచ్ఛందకార్యకర్తలు, సామాజిక ఉద్యమకారులను భాగస్వామ్యం  చేసిన మార్గదర్శి. 

తెలంగాణ రాజకీయ సమస్య మాత్రమే కాదు. అది సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విముక్తి సమస్య అని విప్పి చెప్పినటువంటి మేధావి జయశంకర్‌ సార్‌. ప్రజలు ఉద్యమంలో ముందున్నప్పటికీ దానిని నడిపించే రాజకీయ నాయకుడు ఉండాలని ఆయన భావించారు. కేసీఆర్‌ ముందుకు రాగానే ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధ్యమని నమ్మారు. ఆయన ఊహించినట్లు కేసీఆర్‌ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. 

ఆయన రాసిన ‘తెలంగాణలో ఏం జరుగుతోంది’,  ‘తెలంగాణ రాష్ట్రం- ఒక డిమాండ్‌' పుస్తకాలు తెలంగాణకు కరదీపికలుగా మారాయి. వక్రీకరణలు వాస్తవాలు, తల్లడిల్లుతున్న తెలంగాణవంటి మరెన్నో రచనలు చేశారు. ప్రజలందరి మనసులో ఉన్న తెలంగాణ ఆకాంక్షను వెలికి తీసి  పట్టువిడుపులతో ఒక రాజకీయ ప్రక్రియగా తెలంగాణ మారడానికి ఇతోధికంగా కృషిచేశారు. అణువణువునా వలసాంధ్ర ఆధిపత్యం ఆవరించిన వేళ ఆయన బుద్ధిజీవిగా వారి వాదన ఓడించాడు, కానీ తన శరీరాన్ని కబళించిన క్యాన్సర్‌ ముందు ఆయన ఓడిపోయారు. తెలంగాణ సాకారం కాకముందే 21 జూన్‌ 2011న మనల్ని వీడి వెళ్లిపోయారు. పొడిచే ప్రతి పొద్దులో ఆయన ప్రాతఃస్మరణీయుడు. పచ్చగా ఎదిగిన తెలంగాణ పొలాల్లో, సస్యశ్యామలం చేస్తున్న జలాల్లో, తెలంగాణ అభివృద్ధికి కదులుతున్న కవుల కలాలలో, గాయకుల గళాలలో, ఉద్యమకారుల ఊపిరిలో, యావత్‌ తెలంగాణ ప్రజల గుండెల్లో జయశంకర్‌ సార్‌ ఎల్లప్పుడు జీవించే ఉంటారు.

-ములక సురేష్‌ (తెలంగాణ వికాస సమితి) (నేడు  ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జయంతి)


logo