సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - Aug 06, 2020 , 00:20:14

మన తెలంగాణ భాగవతోత్తముడు పోతన రాముడిపై చేసిన వర్ణన

మన తెలంగాణ భాగవతోత్తముడు పోతన రాముడిపై చేసిన వర్ణన

రాముని జననం..

అమరేంద్రాశకు బూర్ణచంద్రు

డుదితుండై  నట్లు నారాయణాం 

శమునం బుట్టె మదాంధ 

రావణ శిరస్సంఘాత సంఛేదన 

క్రమణోద్ధాముడు రాముడా 

గరితకుం గౌసల్యకున్‌ సన్నుతా 

సమనైర్మల్యక తుల్య 

కంచితజనుస్సంసార సాఫల్యకున్‌ 

తూర్పు దిక్కుకు నిండు చంద్రుం డు ఉదయించినట్లుగా పొగడ దగినదీ, పరిశుద్ధురాలూ, సంసార సాఫల్యాన్ని పొందినదీ, సాటిలేని సాధ్వి అయిన కౌసల్యకు, గర్వాంధుడైన రావణుని తలలను ఖండించుటలో గడిదేరిన శ్రీరాముడు నారాయణాంశతో జన్మించాడు. 

రావణ సంహార అనంతరం 

రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు..

వీథులు సక్క గావించి తోయంబులు సల్లి రంభాస్తంభచయము నిలిపి 

పట్టు చీరెలు సుట్టి బహు తోరణంబులు గలువడంబులు మేలుకట్లు గట్టి 

వేదిక లలికించి వివిధ రత్నంబుల మ్రుగ్గులు పలు చందములుగ బెట్టి 

కలయ గోడలు రామకథలెల్ల వ్రాయించి ప్రాసాదములు దేవ భవనములును 


గోపురంబుల బంగారు కుండలెత్తి యెల్ల వాకిండ్ల గానుక లేర్పరించి 

జనులు గైసేసి తూర్య ఘోషములతోడ నెదురు నడతెంచిరా రాఘవేంద్రు కడకు 

అంతకు ముందే ఆ పట్టణంలో పౌరులు వీథులను శుభ్రం చేసి, నీళ్ళు చల్లి, అరటి కంబాలను నిలిపి, పట్టువస్ర్తాలను చుట్టారు. పెక్కు తోరణాలను, కలువ పూదండలను, చాందినీలను కట్టారు. అరుగులను అలికించి, వివిధ రత్నాలతో పలు రకాల ముగ్గులు పెట్టారు. గోడల మీద రామకథలను వ్రాయించారు. భవనాల మీదా, దేవాలయాల మీదా గోపురాల మీదా, బంగారు కలశాలను ఎత్తించారు. వాకిళ్ళలో కానుకలను అమర్చి పెట్టారు. ఈ విధంగా అయోధ్యా నగర పౌరులు మంగళవాద్యాలతో ఆ రామచంద్రునికి ఎదురు వెళ్ళారు. 

(పోతన భాగవతం, తొమ్మిదవ స్కంధము నుంచి)


logo