ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Editorial - Aug 06, 2020 , 00:20:12

మహిళల శాంతియాత్ర

మహిళల శాంతియాత్ర
  • ఆరో అధ్యాయం కొనసాగింపు..

ఫైజాబాద్‌నుంచి అయోధ్య వరకు 20వేల మంది మహిళలు మతసామరస్య యాత్ర నిర్వహించ తలపెట్టినప్పుడు స్థానిక మేజిస్ట్రేట్‌ నిషేధపుటుత్తర్వులు ఇవ్వటంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేజిస్ట్రేట్‌ను ఘెరావ్‌ చేస్తామని బెదిరించారు.. రాత్రి పొద్దుపోయిన తరువాత ఆయన ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్వాహకుల్ని శాంతియాత్రకు అనుమతిస్తూ, యాత్ర ఫైజాబాద్‌ పట్టణంలో మాత్రం జరుపరాదన్నారు. ప్రధానంగా అయోధ్య ప్రమాదకరమైన ప్రాంతంగా పరిగణింపబడకపోవటానికి కారణం గత నలభై ఏండ్లుగా, అంటే 1949లో విగ్రహాలను వివాదంలో ఉన్న కట్టడంలో పెట్టిన తర్వాత ఇంతవరకు అవాంఛనీయ ఘటన ఏదీ జరగలేదు. కనుక మహిళా సంఘంతో ఘర్షణ అలా తప్పించబడింది. ఉదయం ఈ క్రింది నినాదాలు చేసుకుంటూ మగువలు ఫైజాబాద్‌ నుంచి అయోధ్యకు శాంతియాత్రను నిర్వహించారు. 

మందిర్‌ మస్‌జిద్‌ నహీ గిరేంగీ- మందిర్‌ మసీదు చెక్కుచెదరవు హిందూ ముస్లమ్‌ నహీ లడేంగే- హిందూ ముస్లిం కలహాల్లేవు హిందూస్థాన్‌కే చార్‌ సిపాహీ- హిందూ దేశపు సిపాయిలరుగో హిందూ ముస్లిమ్‌ సిఖ్‌ ఇసాయీ- హిందూ ముస్లిం సిక్కు, క్రైస్తవులు న హిందూరాజ్‌ న ఖలిస్థాన్‌- హైందవ సిక్కురాజ్యాలొద్దోయ్‌ జుగు జుగ్‌ జియే హిందూస్థాన్‌- యుగయుగాలకూ హిందూస్థాన్‌ వర్ధిల్లాలి.

భూ సేకరణ: ఘర్షణను నివారించేందుకు చివరి క్షణపు అవకాశంగా కేంద్ర ప్రభుత్వం ముస్లిం నాయకులతోనూ, వీహెచ్‌పీ నాయకులతోనూ చర్చలు జరిపి 1990 అక్టోబర్‌ 19న వివాదంలో ఉన్న కట్టడాన్ని, దాని చుట్టూ ఉన్న కొంత భూమిని తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు భారత దేశాధ్యక్షుడు ఒక ఆర్డినెన్స్‌ను విడుదల చేయటం జరిగింది. తరువాత రోజు కేంద్ర ప్రభుత్వం తరపున డివిజనల్‌ కమిషనర్‌ మధుకర గుప్తా ఆ భూమిని స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఇరువర్గాలు దానిని వ్యతిరేకించటంతో చిక్కుల్లో చిక్కుకుపోయినట్లు అయ్యింది. మళ్లీ 1990 అక్టోబర్‌ 23న ఆర్డినెన్స్‌ ఉపసంహరించబడింది. ఆ కట్టడాన్ని, చుట్టూ భూమిని ప్రభుత్వం స్వాధీనపర్చుకోవటాన్ని పలువురు పలు విధాలుగా భావించారు. ముస్లిముల వత్తిడి కారణంగా ప్రభుత్వం మాట తప్పిందని వీహెచ్‌పీ ఆడిపోసుకుంది. ఆ పైన ములాయంసింగ్‌ ఒత్తిడి ఒకటి. బీజేపీ తన శ్వేతపత్రంలో వెల్లడించిన వైఖరి ఇలా ఉంది..

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo