ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Editorial - Aug 04, 2020 , 23:45:34

అయోధ్యలో భూమి పూజ

అయోధ్యలో భూమి పూజ

అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం భూమి పూజ జరపడానికి రంగం సిద్ధమైంది. అనేక మంది భారతీయుల మనోభావాలతో ముడిపడి ఉండటంతోపాటు, సుదీర్ఘ ఉద్యమం సాగడం మూలంగా రామాలయ నిర్మాణం విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ స్వయంగా హాజరు కావడాన్ని సోమనాథ ఆలయ పునరుద్ధరణ నాటి పరిస్థితితో పోల్చవచ్చు. సోమనాథ ఆలయం పునర్నిర్మాణానికి సర్దార్‌ వల్లభాయి పటేల్‌ చొరవ చూపారు. ఆలయ పునర్నిర్మాణం విషయమై ప్రభుత్వంలోని పెద్దలు చొరవ తీసుకోవడం నెహ్రూకు అయిష్టంగా ఉన్నప్పటికీ, ఆయన మంత్రివర్గంలోని కె.ఎం. మున్షీ చురుకైన పాత్ర నిర్వహించారు. సోమనాథ్‌ ఆలయాన్ని పునర్నిర్మించిన తరువాత దానిని 1951లో నాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌ స్వయంగా ప్రారంభించారు. 

సుదీర్ఘ అయోధ్య వివాదం మన రాజ్యాంగ వ్యవస్థకు ఇంతకాలం పెద్ద పరీక్షగా నిలిచింది. అనేక ఉద్యమాలు, న్యాయ వివాదాలకు కేంద్ర బిందువైంది. ఈ వివాదం అనేక మలుపులు తిరిగింది, అనేక సార్లు ప్రతిష్టంభన ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలను సృష్టించింది. న్యాయవ్యవస్థ వెలుపల రాజీ కుదుర్చడానికి ప్రయత్నాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వపరంగా కూడా ఇరు పక్షాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు పలు సార్లు కృషి జరిగింది. ఎట్టకేలకు గత ఏడాది న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పుతో కొలిక్కివచ్చింది. 2019 నవంబర్‌ తొమ్మిదవ తేదీన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. పన్ను రికార్డుల ప్రకారం ఈ భూమి ప్రభుత్వానిదేనని చెప్పడమే కాకుండా, రామాలయం నిర్మించడానికి భూమిని ఒక ట్రస్టుకు అప్పగించాలని, మసీదు నిర్మించుకోవడానికి సున్నీ వక్ఫ్‌ బోర్డుకు ఐదు ఎకరాల భూమి కేటాయించాలని ఆదేశించింది. దీంతో రామాలయ నిర్మాణానికి మార్గం పడింది. 

భారత దేశ రాజకీయ, సామాజిక వ్యవస్థల నిబ్బరతకు అయోధ్య వివాదం ప్రతీకగా నిలుస్తుంది. ఏ సమాజంలోనైనా భిన్నత్వం ఉండటం సహజం. ఈ భిన్నత్వం ఒక్కోసారి విభేదాలకు దారి తీయడమూ పరిపాటి. కానీ ఆ వైరుధ్యాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంపైనే ఆయా సమాజాల మనుగడ ఆధారపడి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో ఘర్షణలు తలెత్తుతుండేది సామరస్య సాధనలో వైఫల్యం వల్లనే. కానీ మన దేశం అనేక విషమ పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొన్నట్టే, ఈ సమస్యనూ అధిగమించింది. ఇంతటి ఉద్వేగపూరితమైన అంశాన్ని అన్ని పక్షాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించుకోగలగడం గొప్ప విజయం. ఇందుకు పరిపాలక, న్యాయవ్యవస్థలు, ఇరు పక్షాలలోని ప్రముఖులు నిర్వహించిన నిర్మాణాత్మక పాత్ర అభినందనీయం. అయోధ్యలో రామాలయ నిర్మాణం జాతీయ సమైక్యతకు, భిన్న సంస్కృతుల సౌహార్దతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆశిద్దాం. logo