బుధవారం 30 సెప్టెంబర్ 2020
Editorial - Aug 04, 2020 , 23:45:33

విద్య అంగడి సరుకు కాకూడదు

విద్య అంగడి సరుకు కాకూడదు

మహాత్మాగాంధీకి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రాసిన ఒక ఉత్తరంలో తాను శాంతి నికేతన్‌లో విద్యపైన జరిపిన పరిశోధనలను తన జీవితంలోని ఒక గొప్ప నిధిగా పోల్చారు. ఠాగూర్‌ 40 ఏండ్ల జీవితాన్ని ధారపోసి స్థాపించిన విశ్వ భారతి సంస్థ ప్రభావం యూరప్‌, జపాన్‌, అమెరికా దేశాలపైన కూడా పడింది. ‘మనిషి సంపూర్ణమైన మనుగడకు విద్య దోహదపడాల’ని చెప్పే విశ్వభారతి ఒక విలక్షణమైన విద్యాసంస్థ. కానీ నేడు దేశంలో విద్యపైన ఆయన ఆలోచనలకు సముచిత స్థానం దక్కకపోవడం విచారకరం

కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఆమోదించిన ‘జాతీయ విద్యావిధానం’ విద్యారంగంలో భారీ మార్పులను హామీ ఇచ్చింది. కొంతమంది మేధావులు 484 పేజీలను చదవకముందే పొగడ్తలతో ముంచెత్తితే, ప్రతిపాదించిన మార్పులన్ని వాంఛనీయమైనవి కాదని, ప్రస్తుత మన రాజకీయార్థిక విధానంలో అమలుకు నోచుకోవన్న హేతుబద్ధమైన అభిప్రాయాలు గట్టిగా వినబడుతున్నవి. అయితే ఈ అంశం మీద తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయపక్షాలు అనుకున్నంత మేధోమథనం చేయలేదనే చెప్పాలి. ఈ దశలో మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ విద్యారంగంలో కొత్త విధానాన్ని రూపొందించడానికి కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో ఈ అంశానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. 

జాతీయ విద్యావిధానం స్థూలమైన దిశను అందిస్తున్నది. దీన్ని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. విద్యారంగం కేంద్ర, రాష్ర్టాలు ఆమోదించవలసిన అంశం కాబట్టి ఇరువురు సంబంధిత చట్టాల ద్వారా సంస్కరణలను అమలుచేయవలసి ఉంటుంది. స్థూల జాతీయోత్పత్తిలో విద్యకు కేటాయింపులు ప్రస్తుతమున్న 3.1 శాతం నుంచి 6 శాతానికి పెంచాలనడం హర్షణీయం. దీని అమలుకు అన్ని చర్యలు తీసుకోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యవసరం. ఈసంస్కరణల అమలు కోసం 2040 వరకు కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. తవిద్యకు సంబంధించి నాలుగేండ్ల డిగ్రీ కోర్సు,క్రెడిట్ల ఆధారంగా విద్యార్థి స్థాయిని కొలిచే పద్ధతి, కోర్సు నుంచి వైదొలగడానికి, పాక్షికంగా చదువుకొనడానికి అవకాశం, మానవీయ, సామాజిక శాస్ర్తాల, విజ్ఞాన, సాంకేతిక శాస్ర్తాల మేళవింపుతో పాఠ్యాంశాల ఎంపిక వంటి ప్రతిపాదనలన్ని ప్రపంచీకరణను అనుసరించి చేసినవే. 

విద్యారంగంలో వృత్తివిద్యా అవసరాలు ఉన్న మాట వాస్తవం, వాటికి తగిన ప్రోత్సా హం కూడా ముదావహం. అయితే నైపుణ్యం, సాంకేతికత ఒక జత అయితే; అధ్యయనం, పరిశోధన మరో జత. వీటిని విస్మరించరాదు. ఇక్కడే మనముందు ఒక పెను సవాలు ఉన్నది. విద్యాహక్కు చట్టం లక్ష్యాలకు, నూతన విద్యావిధానానికి వైరుధ్యాలు స్పష్టంగా కనబడుతున్నవి. ప్రభుత్వం- మార్కెట్‌ విధానాల మధ్య ఉత్పన్నమయ్యే సంఘర్షణ తెలుసుకున్నప్పుడే ఒక విశ్వవిద్యాలయం పనితీరు పురోగతిని అర్థంచేసుకోవచ్చు. ఉదాహరణకు ప్రైవేటు విద్యారంగాన్ని నియంత్రించడానికి ఎటువంటి చొరవా ఈ విధానంలో కనిపించడం లేదు. పోగా ఫీజుల నిర్ణయంలో వారికి స్వేచ్ఛ కల్పించాలని సూచనలు చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు విద్యావిధానం, దాని లక్ష్యాలు, సాధనలు, వాటి అమలుద్వారా మన పిల్లలకు మన సమాజానికి సంక్రమించే పర్యవసానాలు తెలుసుకోవడంతోపాటు ఈ ప్రైవేటీకరణను పెంచి పోషించే వ్యవస్థలను వాటి ఆర్థిక రాజకీయ కోణాలను విశ్లేషించడం అవసరం. 

మహాత్మాగాంధీకి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రాసిన ఒక ఉత్తరంలో తాను శాంతి నికేతన్‌లో విద్యపైన జరిపిన పరిశోధనలను తన జీవితంలోని ఒక గొప్ప నిధిగా పోల్చారు. ఠాగూర్‌ 40 ఏండ్ల జీవితాన్ని ధారపోసి స్థాపించిన విశ్వ భారతి సంస్థ ప్రభావం యూరప్‌, జపాన్‌, అమెరికా దేశాలపైన కూడా పడింది. ‘మనిషి సంపూర్ణమైన మనుగడకు విద్య దోహదపడాల’ని చెప్పే విశ్వభారతి ఒక విలక్షణమైన విద్యాసంస్థ. కానీ నేడు దేశంలో విద్యపైన ఆయన ఆలోచనలకు సముచిత స్థానం దక్కకపోవడం విచారకరం. ప్రజాస్వామ్య విలువలు, సద్గుణాలు మంచి విద్య ద్వారానే ఆర్జించవచ్చు. మార్కెట్‌ నిబంధనలపై ఆధారపడే ప్రైవేటు విద్య వీటిని అందించజాలదు. 

చాలాకాలం క్రితమే విశ్వవిద్యాలయాల విలువలను నెహ్రూ గ్రహించారు. ఆయన ఇలా అన్నారు.. ‘విశ్వవిద్యాలయం మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. సహనానికి, హేతువుకు స్థానం కల్పిస్తుంది. కొత్త ఆలోచనలను సాహసించడానికి, సత్యశోధన సాగించ డానికి అవకాశం కల్పిస్తుంది. మానవజాతి అభ్యున్నతి కోసం మరింత ఉన్నతమైన లక్ష్యసాధన దిశగా పయనం సాగించడాన్ని పురికొల్పుతుంది. విశ్వవిద్యాలయాలు తమ కర్తవ్యాలను సమర్థంగా నెరవేర్చితే ఆ జాతి, ఆ ప్రజలు సరైన బాటలో నడుస్తున్నట్టు!’. అభివృద్ధి చెందిన మార్కెట్‌ వ్యవస్థను అవలంబిస్తున్న దేశాలు సైతం వారి పౌరులకు ఉచితమైన, నాణ్యమైన విద్యను కాలేజీ, విశ్వవిద్యాలయాలతో సహా అన్ని స్థాయిలలో  అందిస్తుండటం గమనార్హం. 

కొన్ని దశాబ్దాలుగా విద్య క్రమంగా ఒక కమాడిటీగా అంటే ఒక కొనుగోలు చేయదగిన వస్తువుగా మారుతూ ఆమోదం పొందింది. పన్నెండో పంచవర్ష ప్రణాళిక (2012- 2017) కాలంలోనే ఉన్నత విద్యలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే విధానానికి, లాభాలను గడించే బాటకు తెరలేచింది. దేశంలో అనేక రాష్ర్టాల్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు పుట్టుకొచ్చాయి. ఈ కారణంగా ఎన్నో అవాంఛనీయ ధోరణులు చెలరేగాయి. ప్రైవేటు సంస్థలతో విద్యాప్రమాణాలలోనే కాదు, విలువలపైనా తీవ్ర ప్రభావం పడింది. ప్రైవేటు రంగానికి లాభార్జనే ధ్యేయంగా ఉంటుంది కనుక సహజంగానే విలువలు, ప్రమాణాలు పతనమయ్యాయి. 

ఎప్పుడైతే విద్యకు ప్రభుత్వ మద్దతు లభించదో, అప్పుడు విద్య బహుళ ప్రజానీకం ఆకాంక్షలకు అనుగుణంగా నిలువలేదు. అందుకేనేమో ఈరోజు మనం అద్భుతంగా దీర్ఘకాలిక వ్యూహంతో అమలుచేస్తున్న మిషన్‌ కాకతీయ, హరితహారం, రెవెన్యూ పరిపాలనా సంస్కరణలు, రైతు బంధు- రైతు సమన్వయ సమితి, మిషన్‌ భగీరథ, కాళేశ్వరం సాగునీరు, నూతన వ్యవసాయ విధానం లాంటి కార్యక్రమాలు మన విద్యారంగం, పరిశోధనారంగంలో చోటుచేసుకోలేకపోయాయి. కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా చెప్పుకొనే అవకాశం లేకుండా పోయింది.

ప్రస్తుతం మార్కెట్‌ ద్వారా నడుస్తున్న ఉన్నత విద్యావ్యవస్థ సామాజిక ఆలోచనను, చైతన్యాన్ని, లక్ష్యాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. ‘విద్య- ప్రజాస్వామ్యం’ భావన ప్రధాన మైనది. ఈ భావన విశ్వవిద్యాలయ ప్రాంగణాలను చర్చలకు, బడుగు బలహీనుల ఆకాంక్షలకు భద్రతగా గుర్తిస్తుంది. సామాజిక న్యాయం, సమానత్వం కోసం వాదించే వేదికలుగా విశ్వవిద్యాలయా లను భావించవలసి ఉంటుంది. 

21వ శతాబ్దపు నైపుణ్యాలపైన ప్రస్తుత అంతర్జాతీయ చర్చ, కరోనా మహమ్మారి నేపథ్యంలో ‘జ్ఞానం’ ఆధారిత కోణంలో విద్యను చూడటమా లేక ఇటీవలి మార్పులకు అనుగుణంగా సామర్థ్యం’ ఆధారిత కోణంలో చూడటమా అనేది ప్రాధాన్యం సంతరించుకున్నది. విద్యాలయాల నుంచి బయటకు వచ్చే మన పిల్లలు మన దేశాభివృద్ధి కోసం ఆర్థిక సామాజిక ఆలోచనాశక్తి కలిగిన నాయకులుగా తయారు కావాలి. కేవలం నిష్క్రియాత్మక సాంకేతిక పరిజ్ఞాన సరఫరాదారులు కాకూడదు!

దాతృత్వ, స్వచ్ఛంద కార్యక్రమాలు ఉదారవాద ఆర్థిక వ్యవస్థలో ఇమిడి ఉన్నాయి. ఈ కార్యక్రమాలు ఉదారవాద ఆర్థిక రాజకీయ వ్యవస్థకు చట్టబద్ధత కల్పించి మార్కెట్‌ వ్యవస్థకు మానవ రూపం కల్పించేందుకు ప్రయత్నిస్తాయి. దాతృత్వ కార్యకలాపాలు ప్రజా ఆకాంక్షలను నెరవేరుస్తున్నట్టనిపిస్తుంటుంది. ఇవి తొలుత విద్య వైద్య సంక్షేమ కార్యక్రమాలలో ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గించే విధంగా వ్యవహరిస్తాయి. ఈ కారణంగా ప్రభుత్వాలు తమ పౌరులకు కొన్ని ప్రాథమిక సేవలను అందించడం మానివేస్తుంటాయి. కానీ ప్రభుత్వాలు ప్రజలందరి జీవన ప్రమాణాలను, పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి. ఆధునిక సంక్షేమ ప్రభుత్వాలు ప్రస్తుత పరిస్థితుల్లో నాణ్యమైన విద్య వైద్య సేవలను తమ ప్రజలందరికి సులభతరంగా అందుబాటులోకి తేవాలి. ఈ దిశగా మన నూతన జాతీయ విద్యావిధానాన్ని మలచగలమా?

తాజావార్తలు


logo