బుధవారం 30 సెప్టెంబర్ 2020
Editorial - Aug 04, 2020 , 23:45:33

లక్షలాది పేదల గొంతుక

లక్షలాది పేదల గొంతుక

సున్నితమార్గంలో కూడా ప్రపంచాన్ని కుదిపేయవచ్చునని, విప్లవశంఖం పూరించడానికి పెద్ద గొంతేమీ అక్కరలేదని నిరూపించిన ఈ కాలపు మహాత్ముడు సున్నం రాజయ్య. ‘ఉన్న ఒక్క మెతుకూ గంజిలో పోయింద’న్న సామెతను గుర్తు చేస్తూ నిజమైన ప్రజల మనిషి సున్నం రాజయ్య అర్ధంతరంగా మనల్ని వదిలి వెళ్లారు. ఎక్కడో మారుమూల ఆదివాసీ గూడెం సమస్యలను రాష్ట్ర అసెంబ్లీలో ఎజెండా ఐటమ్‌గా మార్చిన ఆచరణశీలి సున్నం రాజయ్య. 

2017 బడ్జెట్‌ సమావేశాల్లో కమ్యూనిజంపై ప్రస్తావన వచ్చింది. చట్టసభల్లో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం తగ్గుతుండటం క్షీణిస్తున్న కమ్యూనిజానికి నిదర్శనమనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. అప్పుడు సున్నం రాజయ్య తనకున్న పరిమిత అవకాశంలోనే కమ్యూనిస్టు సిద్ధాంతం గొప్పదని, శాస్త్రీయమైనదని, దానికి మరణంలేదని ఎవరూ ఎదురుమాట చెప్పలేని విధంగా వివరించారు. సున్నం రాజయ్య ప్రసంగం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందిస్తూ.. ‘కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని మించిన సిద్ధాంతం  ప్రపంచంలోనే లేదు’ అని ప్రకటించారు. కమ్యూనిజానికి మించిన ప్రత్నామ్నాయం కూడా మరోటి లేదని, కమ్యూనిజం అంటేనే ‘పేదల వాయిస్‌' అని సీఎం కేసీఆర్‌ స్పష్టంగా ప్రకటించారు. కమ్యూనిజాన్ని బతికించడానికి ఒక్కడున్నా చాలునని అసెంబ్లీలో సున్నం రాజయ్య నిరూపించారు. 

2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సున్నం రాజయ్య హైదరాబాద్‌ మొహం కూడా చూడకుండా భద్రాచలం నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సాదక  బాదకాలు తెలుసుకున్నారు. ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కొన్ని ఫార్మా కంపెనీలు అనధికార క్లినికల్‌ ట్రయల్స్‌ చేసి, వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని గ్రహించారు. అనధికార క్లినికల్‌ ట్రయల్స్‌ కారణంగా అనేకమంది దీర్ఘకాలిక రోగాల బారినపడటం, మరణించడం సంభవించాయి. ఈ ఘోరాన్ని బాహ్య ప్రపంచానికి చాటి చెప్పడమేగాక, బాధితులతో కలసి సున్నం రాజయ్య ఉద్యమం సాగించారు. దీంతో ‘క్లినికల్‌ ట్రయల్స్‌' విషయం లో కొంత మార్పు వచ్చింది.  

2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన.సున్నం రాజయ్య జీవితంలో పెను సంక్షోభాన్ని తెచ్చింది. ఆయన పుట్టి పెరిగిన సున్నంవారి గూడెం పోలవరం ముంపు కిందికి పోయింది. వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి భూమిని కూడా ప్రాజెక్టుకోసం ప్రభుత్వం తీసేసుకున్నది. ఓటు హక్కు ఆంధ్రప్రదేశ్‌లో, శాసన సభ్యత్వం తెలంగాణలో ఉన్న విచిత్ర పరిస్థితి. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు రాష్ర్టాల్లో ఎక్కడ పోటీ చేయాలనే మీమాంస ఏర్పడింది. అటువైపున రెండు ప్రధాన పార్టీలు, ఇటువైపున రెండు ప్రధాన పార్టీలు ఆయనకు ఆహ్వానం పలికాయి. రెండు రాష్ర్టాలు,నాలుగు పార్టీలు, రకరకాల సిద్ధాంతాలు, 8 మండలాలు! ఈ మీమాంసలో తన అస్తిత్వాన్ని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా తొట్రుపాటుకు గురికాలేదు. తాను పుట్టిన ఊరు ఎటుపోతే తన తోటివారితో అటే పోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్బంగా కొంతమంది ముఖ్యమైన సహచరులతో జరిగిన సమావేశంలో తన నిర్ణయం ప్రకటించారు. ‘పుట్టి పెరిగింది కమ్యూనిస్టు పార్టీలో. చచ్చేది కూడా కమ్యూనిస్టు పార్టీలోనే. నేను చనిపోయాక నా శవంపై ఎర్రజెండా కప్పడం ఒక్కటే నా జీవితాశయం’ అని ప్రకటించారు రాజయ్య. అది కమ్యూనిస్టుగా చావాలనే కోరిక కాదు, తాను చనిపోయాక కూడా కమ్యూనిజం బతికుండాలనే ఆకాంక్ష. 

చంద్రబాబు, రాజశేఖర్‌ రెడ్డి, కేసీఆర్‌ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో సున్నం రాజయ్య ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉన్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో తెలుసుకోవడానికి సున్నం రాజయ్య ప్రసంగం అన్నం మెతుకుగా ఉపయోగపడేది. సీఎం కేసీఆర్‌ కూడా చాలా సందర్భాల్లో సున్నం రాజయ్య మాట్లాడే విషయాలను ప్రత్యేకంగా నోట్‌ చేసుకొని వాటికి సమాధానం ఇచ్చేవారు. ఆయన ఇచ్చే విలువైన సూచనలను పరిగణనలోకి తీసుకునేవారు.

అసెంబ్లీలో ఒక్కడున్నా లక్షలాది పేదల గొంతుకగా వినిపించేవారు సున్నం రాజయ్య. తన నియోజకవర్గంలో బస్సెక్కి హైదరాబాద్‌ చేరుకొని, ఆటోలో అసెంబ్లీకి వచ్చే నిరాడంబరుడు మళ్లీ మనకు కనిపిస్తాడో లేడో. తన రెండున్నర లక్షల జీతాన్ని పార్టీకే ఇచ్చేసి, పూర్తి కాలపు కార్యకర్తకు పార్టీ ఇచ్చే 15 వేల రూపాయలను మాత్రమే తీసుకొని, కుటుంబాన్ని పోషించుకున్న నిజమైన మార్క్సిస్టు కార్యకర్త సున్నం రాజయ్య. 

ప్రభుత్వం ఏ పని చేసినా గుడ్డిగా విమర్శించడమే ప్రతిపక్షాల పని అనుకునే పిడివాది కాదు సున్నం రాజయ్య. పేదల కోసం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ఆయన అసెంబ్లీ వేదిక నుంచే ప్రశంసించేవారు. చివరి వ్యక్తికి కూడా ప్రయోజనం చేకూరే సూచనలు, సలహాలు ఇచ్చేవారు. సంక్షేమ ఫలాలు అందరికీ దక్కేలా మార్గం చూపేవారు. సిద్ధాంతానికి, ఆచరణకు మధ్య అంతరమే కమ్యూనిస్టు పతనానికి కారణంగా చాలామంది విశ్లేషిస్తారు. ఆ లోటును పూడ్చి, రెండింటి మధ్య సమన్వయం కుదిర్చే సున్నం రాజయ్యల అవసరం ఈ దేశానికి ఎంతో ఉన్నది. 

ప్రభుత్వం ఏ పని చేసినా గుడ్డిగా విమర్శించడమే ప్రతిపక్షాల పని అనుకునే పిడివాది కాదు సున్నం రాజయ్య. పేదల కోసం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ఆయన అసెంబ్లీ వేదిక నుంచే ప్రశంసించేవారు. చివరి వ్యక్తికి కూడా ప్రయోజనం చేకూరే సూచనలు, సలహాలు ఇచ్చేవారు. సంక్షేమ ఫలాలు అందరికీ దక్కేలా మార్గం చూపేవారు. సిద్ధాంతానికి, ఆచరణకు మధ్య అంతరమే కమ్యూనిస్టు పతనానికి కారణంగా చాలామంది విశ్లేషిస్తారు. ఆ లోటును పూడ్చి, రెండింటి మధ్య సమన్వయం కుదిర్చే సున్నం రాజయ్యల అవసరం ఈ దేశానికి ఎంతో ఉన్నది.

తాజావార్తలు


logo