శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - Aug 03, 2020 , 23:47:18

పల్లెలూ పదిలం

పల్లెలూ పదిలం

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. కరోనా ప్రమాదం ముగిసిన వెంటనే ఆర్థిక సంక్షోభం పొంచి ఉన్నదని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. కానీ తెలంగాణ సమాజం మాత్రం ధీమాగా కనిపిస్తున్నది. పరాయి పాలనలో కన్నీరు పెట్టని పల్లె లేదు. పొట్టచేత పట్టుకొని బొంబాయి, దుబాయి పోయిన రోజులవి. చెరువులలో తుమ్మలు మొలిచినవి. అటువంటి తెలంగాణేనా ఇప్పుడు ఇంత ధైర్యంగా కరోనా సవాలును స్వీకరిస్తున్నది! పాత రోజులతో పోల్చుకుని చూస్తే ఆశ్చర్యం కలుగుతున్నది. ఈ అద్భుతం సాధించింది ముఖ్యమంత్రి కేసీఆర్‌. యుద్ధానికి ఏర్పాట్లు శాంతి కాలంలోనే సాగించాలంటారు. వైపరీత్యాలను ఎదుర్కొనడానికి కూడా సాధారణ పరిస్థితుల్లోనే సమాజాన్ని సిద్ధం చేయాలి. పేదరికం, నిరుద్యోగం, నీటి కరువు, నిధుల కొరత మొదలైన జాడ్యాలపై కేసీఆర్‌ పెద్ద యుద్ధమే చేశారు. ఈ పోరాటమే, కరోనాను ధైర్యంగా ఎదుర్కొనడానికి తెలంగాణ సమాజాన్ని సంసిద్ధం చేసింది. 

కేసీఆర్‌ అభివృద్ధి చేయకుండా ఏ రంగాన్నీ వదలలేదని చెప్పవచ్చు. సర్కారు దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగింది. తెలంగాణ ప్రజల సగటు ఆయుర్దాయం పదేండ్లు పెరిగింది. ఎండకాలంలోనూ చెరువులు నీటితో నిండి ఉంటాయని ఎవరైనా ఊహించారా! ప్రభుత్వం గొర్రెలు పంచడం, చెరువుల్లో ఉచితంగా చేపలు వేయడం- ప్రతి పథకమూ అద్భుతమే. ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలకు మరో కోటి పిల్లలు పుట్టాయి! కరోనా కష్టకాలంలోనూ ఏ సంక్షేమ పథకాలు ఆగకపోగా, పేదలను ఆదుకోవడానికి అదనంగా ఆహారం, ఆర్థిక సహాయం అందింది. పరిశ్రమల మూలంగా లక్షలాది మందికి ఉపాధి లభించింది. అందుకే కరోనా వికటాట్టహాసం చేస్తున్నా సరే, ఇవాళ ప్రజల మొహాల్లో చిరు నవ్వులు వెలుగుతున్నాయి. 

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వెంటనే కొనుగోళ్ళు పుంజుకున్నట్టు వార్తలందుతున్నాయి. ఇదొక ఆశాజనకమైన పరిణామం. కానీ ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాలను పీడించిన కరోనా ఇప్పుడు పల్లెల వైపు నడక సాగిస్తున్నది. తెలంగాణ వచ్చిన తరువాత పల్లెల్లో నెలకొన్న సుఖశాంతులకు విఘాతం కలుగబోదని ఆశిద్దాం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటి నుంచి గ్రామీణ రంగాన్ని సుసంపన్నంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్‌ సాగిస్తున్న కృషికి ప్రజల నిర్లక్ష్యం మూలంగా ఆటంకం కలుగకూడదు. జీవితం, జీవిక రెండూ ముఖ్యమే. ప్రజలు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే, బతుకు పయనాన్ని సాగించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూహాలు, కార్యాచరణ వల్ల రాష్ట్రం అనేక రంగాలలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఇప్పుడు కరోనా నోట పడకుండానే, ఆర్థికాభివృద్ధిని ఏ విధంగా సాగించాలనేది తెలంగాణను చూసి ప్రపంచ దేశాలు నేర్చుకోవాలి. తెలంగాణ సమాజం ఈ సవాలును ఎదుర్కొనగలదు.


logo