సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - Aug 03, 2020 , 23:47:17

రాజీలేని సంస్కరణవాది పీవీ

రాజీలేని సంస్కరణవాది పీవీ

భూ సంస్కరణల చట్టం విషయం బయటికి పొక్కి, భూ అక్రమ బదలాయింపులు జరగకుండా, 1972 మే 2వ తేదీ అర్ధరాత్రి ముఖ్యమంత్రి పీవీ ఒక ఆర్డినెన్సును జారీ చేశారు. ఇది మరునాడు మే 3వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. దీంతో పరిమితికి మించిన భూముల క్రయవిక్రయ లావాదేవీలన్నీ ఒక్కసారిగా స్తంభించిపోయాయి. భూసంస్కరణల అమలుకు ముందే పీవీ తనకు పిత్రార్జితంగా సంక్రమించిన 12 వందల ఎకరాల భూమిలో చాలా భాగం పేదలకు పంచిపెట్టారు.

స్థితప్రజ్ఞుడు, రాజనీతిలో అపర చాణక్యుడు, బహుభాషాకోవిదుడుగా పేరుగడించిన పీవీ నరసింహారావు గారు 1957 నుంచి శాసనసభ్యులుగా వున్నారు. 1962 నుంచి రాష్ట్ర మంత్రి వర్గంలో వివిధ శాఖలకు ఆయన మంత్రిగా వ్యవహరించారు. 1969లో తెలంగాణ రాష్ట్ర ఉద్య మం ఉవ్వెత్తున ఎగసిపడింది. ఉద్యమాన్ని చల్లబరిచే ఎత్తుగడలో ముఖ్యమంత్రి పదవికి బ్రహ్మానందరెడ్డి 1971 సెప్టెంబర్‌లో రాజీనామా చేయవలసి వచ్చింది. విద్యామంత్రిగా వున్న పీవీ నరసింహారావు గారు అందరికీ ఆమోదయోగ్యుడుగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవిని 1971 సెప్టెంబర్‌ 28న చేపట్టారు. వెనువెంటనే 1972 ఫిబ్రవరిలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో పీవీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ  ఘనవిజయం సాధించింది. 

ఈ ఎన్నికల్లో మండలి వేంకట కృష్ణారావు గారు కృష్ణాజిల్లా  అవనిగడ్డ నియోజకవర్గం నుంచి  శాసన సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. పీవీ మంత్రివర్గంలో కృష్ణారావు గారికి స్థానం లభించింది. ఏ శాఖ కావాలని ముఖ్యమంత్రి అడుగగా, తనకు సాంఘిక సంక్షేమ శాఖ ఇవ్వవలసిందిగా కృష్ణారావు కోరారు. అదేమిటి? ఆ శాఖను అంద రూ వద్దంటారే! ఇంకా ముఖ్యమైన శాఖను మీకు ఇవ్వాలనుకున్నానని పీవీ అన్నారు. సమాజంలో వందల ఏళ్ళుగా అణగారిపోయి, దయనీయమైన స్థితిలో వున్న పల్లె ప్రజలకు, బీదలకు సాయం చేయడానికి ఇంతకన్నా మంచి అవకాశం వేరే శాఖలో ఉండదు, అందుకే ఆ శాఖను కోరుకున్నాను అని కృష్ణారావు గారు పీవీతో అంటే ఆయ న చలించిపోయారు. ఈ విషయాన్ని  పీవీ గారే స్వయంగా వెల్లడించారు. 

తాను చేయదలచుకున్నది చేయడం, వుండదలచుకున్నట్లు ఉండటం తప్ప, బ్రహ్మాండ నాయకుడని పబ్లిసిటీ రాబట్టడం కోసం, రాజకీయంగా గ్లామర్‌ను పెంచుకోవడం కోసం పీవీ తంటాలు పడలేదు. నిరాడంబరంగా వుండే మండలి వేంకటకృష్ణారావు గారి వ్యక్తిత్వం ఆయనకు నచ్చింది. కేవలం తన మంత్రివర్గంలోని ఒక సహచరుడిగా మాత్రమే కాక మండలిని ఆయన ఒక ఆత్మీయ మిత్రుడిగా చూశారు. పీవీ, ముఖ్యమంత్రి కాగానే భూసంస్కరణల చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని తలపెట్టారు. అంతవరకూ దేశంలో ఏ ముఖ్యమంత్రీ ఈ సాహసం చేయలేదు. 

గ్రామాల్లోని పేదరికం, భూమిపై ఆధిపత్యం తదితర అంశాలను చూసి ఈ పరిస్థితిని నివారించడానికి ఒక మెరుగైన, తులనాత్మకంగా ప్రగతిశీలమైన భూపరిమితి చట్టాన్ని రూపొందించాలని పీవీ భావించారు. ఈ మహత్కార్యానికి తన మంత్రివర్గ సహచరుడైన మండలి వేంకట కృష్ణారావును విశ్వాసంలోకి తీసుకున్నారు.

  ఆ తరువాత భూపరిమితి బిల్లును రూపొందించి రాష్ట్ర శాసనసభలో 1972 ఆగష్టు ఒకటవ తేదీన ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టంగా రూపొందిన తరువాత చేయవలసిన ప్రారంభ కృషిని (స్పేడ్‌ వర్కు) మొదలుపెట్టారు పీవీ. చట్టంలో ఏ రకమైన లొసుగులు లేకుండా ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ చట్టం అమలుకు సబ్‌-డివిజన్‌ స్థాయిలో ట్రిబ్యునల్‌,  పై స్థాయిలో అప్పిలేట్‌ సంస్థలు వుంటాయని, ముందుగా పని ప్రారంభించవలసింది రెవెన్యూ సర్కిల్‌ లేదా ఫిర్కా స్థాయిలోనే అని, ఇదే నియంత్రించవలసిన యూనిట్‌ అని నిర్దేశించారు. 

భూసంస్కరణల అమలుకు ముందే పీవీ తనకు పిత్రార్జితంగా సంక్రమించిన 12  వందల ఎకరాల భూమిలో చాలా భాగం పేదలకు పంచిపెట్టారు. మండలి వేంకట కృష్ణారావు గారికి పిత్రార్జితమైన ఆస్తులు ఏమంత లేవు. స్వాతంత్య్ర సమరయోధులుగా ప్రభుత్వం ఆయనకు ఐదెకరాల భూమినిచ్చింది. ఆ భూమిని ఆయన పదిమంది దళితులకు పంచిపెట్టారు. ప్రభుత్వంనుంచి భూమిని పొందిన కారణంతో ఆ తరువాత ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులకు మం జూరు చేసిన పెన్షన్‌కు దరఖాస్తు చేయలేదు. స్వాతంత్య్ర సమరయోధులుగా ప్రభుత్వం నుంచి ఒకసారి ప్రయోజనం పొందినందున మరొక ప్రయోజనం పొందడం అనైతికమని ఆయన భావించారు. ఎమ్మెల్యే గా హైదరాబాద్‌లో ప్రభుత్వమిచ్చిన వసతిలో ఉంటున్న కారణంతో బంజారాహిల్స్‌లో ఎమ్మెల్యేలకు ప్రభుత్వమిచ్చిన నివాస స్థలాన్ని తీసుకోలేదు. ఇంతటి నిస్వార్థపరులు, నిబద్ధత గల రాజకీయనాయకులు మనకీనాడు ఎంతమంది వున్నారు?

(నేడు మండలి వేంకట కృష్ణారావు జయంతి)logo