బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - Aug 03, 2020 , 23:47:17

అద్వానీ రథయాత్ర ప్రారంభం

అద్వానీ రథయాత్ర ప్రారంభం

  • ఆరో అధ్యాయం కొనసాగింపు..

జాతీయ సమైక్యతా మండలి సమావేశం 1990 సెప్టెంబర్‌ 22న మద్రాసులో జరిగింది. దానిని బీజేపీ బహిష్కరించింది. అయినా ఆ సమావేశంలో ఈ సమస్య కూడ చర్చింపబడింది. అది చాలనట్లు ఎల్‌.కె. అద్వానీ సెప్టెంబర్‌ 25న సోమనాథ్‌ నుంచి అయోధ్య వరకు తమ పదివేల కిలోమీటర్ల రథయాత్రను ప్రారంభించారు. అక్టోబర్‌ 30 నాటికి అయోధ్యకు చేరుకొని కరసేవలో పాల్గొనాలి. ములాయంసింగ్‌ యాదవ్‌ వివిధ పట్టణాల్లో మత వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించారు. వాటిల్లో ప్రధానంగా వెనుకబడిన తరగతులవారు, దళితులు, ముస్లిములు పాల్గొన్నారు. జనతాదళ్‌, బహుజన సమాజ్‌పార్టీ, వామపక్షాల వారు కూడా ప్రదర్శనలు నిర్వహించారు. ములాయంసింగ్‌ యాదవ్‌ ప్రతిఘటనను వ్యతిరేకిస్తూ ప్రసంగించారు. అయితే మతపరమైన విద్వేషాన్ని ప్రేరేపించే ఏ ప్రయత్నాన్నయినా సహించేదిలేదని పునరుద్ఘాటించారు. జరుపతలపెట్టిన కరసేవను ప్రస్తావిస్తూ గట్టి భద్రతా చర్యలు గైకొన్నట్లు గొప్పలు చెప్పారు. 

సెప్టెంబర్‌ 16న ఫైజాబాద్‌లో ఓ బ్రహ్మాండమైన ప్రదర్శనలో ప్రసంగిస్తూ ఆయన చెప్పిందేమంటే.. పరిక్రమ ఉత్సవం రోజున అంటే.. అక్టోబర్‌ 30వ తేదీన అయోధ్యలో వేలాదిమంది యాత్రికుల ప్రాణాల్ని పణంగా పెట్టి ఓ పైశాచిక కార్యం తలపెట్టారని. జనతాదళ్‌, వామపక్షాలు ఒకవైపు మత వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహిస్తుండగా మరోవైపు మతపరమైన విభజన భయోత్పాతాన్ని కలుగజేసి, అభద్రతాభావాన్ని రేకెత్తించేందుకు దుండగులు దసరా, దుర్గాపూజ సందర్భాలలో బాంబులు పెట్టారు. పుకార్ల యంత్రాలు సమయాన్ని మించి పనిచేయటం ప్రారంభించాయి. అయోధ్యకు అరవై కిలోమీటర్ల దూరంలో మతపరమైన హింసాకాండ చెలరేగింది. అది గోండా జిల్లాలోని కోలెన్‌గంజ్‌ పట్టణంలో. స్త్రీలు, పసిపిల్లలు అనే విచక్షణ లేకుండా ఎనభైమందిని ఊచకోత కోశారు. ఓ డజను గ్రామాల్లో వందలాది ఇండ్లు అగ్నికి ఆహుతి గావింపబడినాయి. తరువాత తేలిందేమంటే తప్పుడు సమాచారపు ఉధృతి అలా ప్రకోపింపజేసిందని. 

1990 సెప్టెంబర్‌ 30న రాత్రిపూట దుర్గపూజకు సంబంధించిన ఊరేగింపు కోలెన్‌గంజ్‌ పట్టణంలో నిర్వహింపబడుతూండగా రథంపైకి రాళ్లు, బాంబులు విసిరారు. మైనారిటీ వర్గాలవారు నివసించే యతీమ్‌ఖానా ప్రాంతానికి చేరుకునేప్పటికి కొందరు చేసిన నినాదాలకు ప్రతిగా వాళ్లు అలా చేశారు. తత్ఫలితంగా జరిగిన హింసాకాండలో ఏడుగురు మరణించారు. అందులో మైనారిటీ వర్గానికి చెందినవారు ఒకరు. కాని ముస్లిములు 500 మంది హిందువులను చంపినట్లు పుకారు. అంతేగాకుండా ఊరేగింపులో పాల్గొంటున్న స్త్రీలను, పిల్లల్ని రక్షణ కొరకు ముస్లిం కుటుంబాలలోకి పిలిచి వాళ్లను పొట్టనబెట్టుకొన్నారనేది ఆ పుకారులో భాగమయ్యింది. 

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)logo