మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Editorial - Aug 03, 2020 , 23:47:16

బాధ్యత మరిచిన మేధావులు

బాధ్యత మరిచిన మేధావులు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంకా మిగిలి ఉన్న, లేదా కొత్తగా ముందుకు వస్తున్న సామాజిక నిరాశలు కొన్ని ఉన్నాయి. పత్రికా పాఠకులు వార్తలను విచక్షణాదృష్టితో చదివి పాలను, నీళ్లను వేరుచేయలేకపోవటం అందులో ఒకటి. సంపదలు పెరగటంతోపాటు క్రమం గా ధన సంస్కృతి జడలు విప్పుతూ, కుటుంబ సంబంధాలు సైతం దెబ్బతిని, ఆస్తులకోసం పరస్పరం ప్రాణాలు తీసుకునే ధోరణి పెరుగుతుండటం మరొకటి. చదువులకు చరిత్రలోనే ఎన్నడూ లేనంతటి గొప్ప అవకాశాలు లభిస్తుండగా, ముఖ్యంగా బలహీనవర్గాల పిల్లలను ఆ వర్గాలకే చెందిన ఉపాధ్యాయులు, మేధావులు  వారిని అటువైపు మళ్లించకుండా నిష్క్రియాపర నినాదాలతో స్వప్రయోజనాలను వెతుక్కోవటం ఇంకొకటి. బంగారు తెలంగాణ కోసం పాటుపడగలమని ప్రతిజ్ఞలు చేసిన ప్రభుత్వ యంత్రాంగంలో కిందిస్థాయి శ్రేణులు ప్రజలను ఎప్పటివలెనే ఇబ్బందులకు గురిచేస్తూ అవినీతిని మానుకోకపోవటం అటువంటిదే. రచయితలు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారుల చైతన్యాలకు దేశంలోనే పేరెన్నికగలదన్న ఈ గడ్డపైన వీరి సారథ్యం లో ఈ ఆరేండ్లలో ఒక్కటంటే ఒక్కటైనా సంఘ సంస్కరణోద్యమం మొదలుకాకపోవటం మరొక విషాదం. 

ఇటువంటివే ఇంకా ఉండవచ్చు. వీటిలో ప్రతి ఒక్కటి ఎంతో సుదీర్ఘంగా రాయవలసిన అంశం. అంతటి చర్చ ఒక వ్యాసంలో వీలుకాదు గనుక, అతి క్లుప్తంగా చెప్పుకుందాం. పత్రికా వార్తలను విచక్షణాదృష్టితో చదవటం పాఠకుని వ్యక్తిత్వబలానికి, వివేకానికి, చైతన్యానికి గుర్తు. తద్వారా తన సమాజపు స్థాయిని తెలియజెప్తుంది. కాని తెలంగాణలో విచిత్ర స్థితి కనిపిస్తున్నది. తెలంగాణ వ్యతిరేక మీడియా ఏది, ఎందువల్ల అది వ్యతిరేకం, ఆ వార్తలను ఏ దృష్టితో తీసుకోవాలి అనే విచక్షణ తెలంగాణలోని అన్ని వర్గాలకు 2014 జూన్‌ వరకు ఉండేది. ఆ తర్వాత కొన్ని వర్గాలకు తమతమ కారణాలవల్ల ప్రభుత్వం పట్ల నిరసన ఏర్పడింది. ఆ నిరసనలు సహేతుకమా కాదా అన్నది వేరే విషయం. ఒకవేళ సహేతుకం కానప్పటికీ వారికి నిరసనలు ఉంటే అది వారి ప్రజాస్వామిక స్వేచ్ఛ. కాని ఏ మీడియా అయితే 2014 వరకు తెలంగాణ మేలుతో సంబంధంలేని తన ప్రయోజనాల కొరకు ఒక విధమైన జర్నలిజాన్ని నడిపిందో, అవే ప్రయోజనాలకోసం అదే జర్నలిజాన్ని 2014 తర్వాత కూడా సాగిస్తున్నప్పుడు, ఈ నిరసన వర్గాలకు తమ పాత శత్రువుతో కొత్తగా మైత్రి ఎందుకన్నది బోధపడని విషయం. తెలంగాణలో నిరసనలు సహేతుకమైనా, నిర్హేతుకమైనా అవి అక్కడి భూమిపుత్రుల నిరసనలు అవుతాయి. వాటికి రహస్య అజెండాలు ఉండవు. కాని 2014కు ముందూ తర్వాతా కూడా రహస్య అజెండాలు గల సదరు మీడియాతో ఇప్పడు కొత్తగా బాంధవ్యం ఏర్పడటం తమ చైతన్యాన్ని, వివేకాన్ని తామే మలినపరచుకోవటం అవుతుంది. అటువంటి మీడియాలో వెలువడే ప్రతి వార్తను, కథనాన్ని వేదవాక్కుగా తీసుకుని నమ్మటం తమను తాము అవమానించుకోవటం అవుతుందని గుర్తించాలి. 

చదువులకు చరిత్రలోనే ఎన్నడూ లేనంతటి గొప్ప అవకాశాలు లభిస్తుండగా, ముఖ్యంగా బలహీనవర్గాల పిల్లలను ఆ వర్గాలకే చెందిన ఉపాధ్యాయులు, మేధావులు  వారిని అటువైపు మళ్లించకుండా నిష్క్రియాపర నినాదాలతో స్వప్రయోజనాలను వెతుక్కోవటం ఇంకొకటి. 

పోతే, తెలంగాణ అవతరణ తర్వాతి అభివృద్ధి వల్ల కొంత, ఇతరత్రా ఇటీవలి దశాబ్దాలలో సంపదలు పెరుగుతుండటం వల్ల ఇంకొంతగా మనుషులలో డబ్బు కోరికలు, కన్జ్యూమరిజం ఎక్కువవుతున్నాయి. వాటి ప్రభావంతో స్వభావాలు మారి మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు పెళుసుగా మారుతున్నాయి. విషప్రాయం అవుతున్నాయి. అసలు వ్యక్తికి తనతో తనకే ఆత్మబంధం బలహీనపడుతున్నది. పరస్పరం ఇతరత్రా నేరాలు హత్యలను అట్లుంచి, ఆఖరుకు గ్రామాలలోని చిన్నకారు కుటుంబాలలో ఆడపిల్లలు తల్లిదండ్రులను అత్తమామలను కొద్దిపాటి ఆస్తుల కోసం, మగపిల్లలు ఎకరం భూమికోసం, పెన్షన్‌ డబ్బు, వారసత్వ ఉద్యోగం, లేదా సెల్‌ఫోన్ల కోసం హత్యలు చేయటం, ఆత్మహత్యలు చేసుకోవ టం తరహా ఉదంతాలు పెరుగుతున్నాయి. వెనుకబడిన సమాజాలు ముందుకుపోయే పరిణామదశల లో.. పెట్టుబడిదారీ, కన్జ్యూమరిస్టు ప్రభావాలతో ఇటువంటి సామాజిక విలువల భగ్నాలు సహజమని సోషియాలజిస్టులు చెప్పవచ్చుగాక. కానీ ఆరోగ్యకరమైన మానవతా విలువలను, సామాజిక చైతన్యాలను పెంపొందింపజేయగల ప్రయత్నాలు ఏవీ తెలంగాణ రచయితలు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారు లు ఎంత మాత్రం చేయకపోవటం వల్ల, అటువంటి సామాజిక నాయకత్వం, సంఘసంస్కరణోద్యమాలు లేకపోవటం వల్ల పరిస్థితి ఇంకా విషమిస్తున్నది. ఎటువంటి ఆశారేఖలు కన్పించటం లేదు. ఇవి ప్రభుత్వాలు, రాజకీయపార్టీలు చేసే పనికాదు. సమా జం కోసం సామాజికనాయకత్వాలు చేయవలసిన పని. 

ఏ మీడియా అయితే 2014 వరకు తెలంగాణ మేలుతో సంబంధంలేని తన ప్రయోజనాల కొరకు ఒక విధమైన జర్నలిజాన్ని నడిపిందో, అవే ప్రయోజనాలకోసం అదే జర్నలిజాన్ని 2014 తర్వాత కూడా సాగిస్తున్నప్పుడు, ఈ నిరసన వర్గాలకు తమ పాత శత్రువుతో కొత్తగా మైత్రి ఎందుకన్నది బోధపడని విషయం. తెలంగాణలో నిరసనలు సహేతుకమైనా, నిర్హేతుకమైనా అవి అక్కడి భూమిపుత్రుల నిరసనలు అవుతాయి. వాటికి రహస్య అజెండాలు ఉండవు. కాని 2014కు ముందూ తర్వాతా కూడా రహస్య అజెండాలు గల సదరు మీడియాతో ఇప్పడు కొత్తగా బాంధవ్యం ఏర్పడటం తమ చైతన్యాన్ని, వివేకాన్ని తామే మలినపరచుకోవటం అవుతుంది.

విద్యా విజ్ఞానాలు మొదటి నుంచి కొన్ని ఉన్నత వర్గాల అధీనంలో ఉండినందున విద్యావనరులు సైతం లేక దుస్థితిలో మిగిలిపోయారని ఈ వర్గాల మేధావులు, ఉద్యమకారులు ఘోషించటం తెలిసిందే. ఉత్పత్తి వనరులు వీరి అధీనంలోకి రావటం తేలిక కానప్పుడు కనీసం విద్యావనరులను అందుకోవాలని పూలే, అంబేద్కర్‌ తదితరులు చెప్పారు. ఈ రోజున తెలంగాణకు పరిమితమై చూసినా, ప్రభుత్వరంగంలో గ్రామీణ పాఠశాలలు మొదలుకొని యూనివర్సిటీల వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులలో అత్యధికులు బలహీనవర్గాల పిల్లలే. విద్యారంగంలో ప్రభుత్వం చేయవలసింది ఇంకెంతో ఉందన్నది నిజమే. అదే సమయంలో ఇప్పటికే గల అవకాశాలు తక్కువ కావు. వాటిని గ్రామీణ బలహీన వర్గాల పిల్లల కోసం ఉపాధ్యాయులు స్కూలునుంచి యూనివర్సిటీల వరకు ఎంతవరకు సద్వినియోగం చేస్తున్నారు? బలహీనవర్గాల మేధావులు, ఉద్యమకారులు ఈ విషయమై ఎటువంటి మార్గదర్శనం చేస్తున్నారు? ఏ ఆచరణా, ఐక్యతా లేని పెద్ద పెద్ద నినాదాలు జీవితాంతం ఇస్తూ పొండి, మంచిదే. కానీ చిన్న పిల్లలకు తమ జీవితాలలో చిన్న చిన్నగా ఉపయోగపడగల అవకాశాలు అనేకం ఇప్పటికే ఉన్నమాట నిజం. పెద్ద నినాదాలు నెరవేరేలోగా చిన్న జీవితాలు నేలపాలు కానక్కరలేదుకదా. తెలంగాణలో ఈ విచారకర స్థితిని ఇప్పటికైనా మార్చుతారా? 

రాష్ట్రంలో అధికార యంత్రాంగం స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుబట్టిన స్థాయిలో, ఆ మేరకు ‘రౌతు కొద్దీ గుర్రం’ వలె పనిచేస్తున్నది. కాని తక్కిన స్థాయిలలో 2014 కు ముందుకన్న తేడా లేకుండా పోయింది. పరిపాలనా వ్యవహరణ రీత్యాగాని, నైతికతల రీత్యాగాని, బంగారు తెలంగాణ కోసం ఏమేమో చేయగలమని వారి నాయకులు పదేపదే ప్రతినలు చేశారు.  వారిది సామాజిక పాత్ర. ఆ పాత్ర ఒక నిరాశగా మిగిలింది. ఇక తెలంగాణ సామాజిక నాయకులకు విమర్శల చైతన్యం ఎక్కువ. సామాజిక నాయకత్వ క్రియాశీలత మాత్రం శూన్యం అన్నట్లుగా తయారైంది. ఈ ఆరేండ్లుగా వారు చేపట్టిన సంస్కరణోద్యమం ఏదైనా ఉన్నదా? 

logo