శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Aug 02, 2020 , 23:32:50

ఉగ్రవాదులకుమానవ హక్కులేల?

ఉగ్రవాదులకుమానవ హక్కులేల?

  • విశ్వవేదికలపై పీవీ విశిష్ట ప్రసంగాలు- 2

విదేశాంగ మంత్రిగా, ప్రధాని పీవీ నరసింహారావు విశ్వవేదికలపై ఇచ్చిన కొన్ని ప్రధాన ప్రసంగాలను ప్రొఫెసర్‌ చంగపల్లి శివరామమూర్తి మూడు భాగాలుగా సంకలనం చేశారు. ఈ రెండవ భాగంలో.. పొరుగు దేశాలు ప్రేరేపిస్తున్న ఉగ్రవాదం వల్లనే మానవ హక్కులకు భంగం వాటిల్లుతున్నదని పీవీ స్పష్టం చేశారు. ఉగ్రవాదం జూలు విదిలిస్తున్న ప్రమాదాన్ని, దానిని అరికట్టడానికి సంక్షేమ విధానాలను అమలు చేయవలసిన అవసరాన్ని వివరించారు. అటు ప్రభుత్వ నియంత్రణ, ఇటు విచ్చలవిడి పెట్టుబడిదారీ విధానాలు కాకుండా ఆర్థిక వ్యవస్థ మధ్యేమార్గంగా ఉండాలని పీవీ అభిప్రాయపడ్డారు. 

అంతర్జాతీయ ఉగ్రవాద ప్రతిఘటన, మానవ హక్కుల సంరక్షణ: ఈరోజు ప్రపంచంలోని పెద్ద ప్రమాదం ఉగ్రవాదవ్యాప్తి. కొన్ని పొరుగు దేశాలు ఈ దుశ్చర్యలకు ధనము, ఆయుధాలను సమకూరుస్తూ, శిక్షణ ఇస్తున్నప్పుడు ఉగ్రవాదం అనేది యుద్ధం చేయడానికి  మరొక సాధనంగా మారుతుంది. ఇది శాంతియుత సమాజాల ప్రాతిపదికను బెదిరించే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ విపత్తును ఎదుర్కోవటానికి అంతర్జాతీయ సమాజం సంకల్పించాలి. 

భారతదేశం ఐదు వేల ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన దేశం. పరాయి దేశాల మీద దాడి చేయలేదు. ఇతర భూభాగాలను స్వాధీనం చేసుకోనూలేదు. అశోక చక్రవర్తి అవలంబించిన అహింసా పద్ధతికి స్ఫూర్తిగా నిలిచిన స్వతంత్ర భారతదేశంలో జాతీయ సంస్కృతి, మానవ హక్కులు వాటి ఉన్నతమైన రూపంలో ఉన్నాయి.ఇవి దాదాపు పర్యాయ పదాలు. వేర్పాటువాద ధోరణులకు భిన్నంగా, మానవ హక్కులను పరిరక్షించడంలో భారత ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంటుంది. అయితే మానవ హక్కులన్నీ ఉగ్రవాద అభ్యాసకుల కోసం మాత్రమే అన్వయించాలన్న వాదన నా ప్రభుత్వానికి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. కొన్ని సరిహద్దు దేశాలు బెదిరింపు పోకడలతో నిజమైన లేదా ఊహాజనితమైన మానవ హక్కుల ఉల్లంఘనల గురించి దుష్ప్రచారం చేస్తూ కాశ్మీర్‌ ప్రజలను, ముఖ్యంగా యువతరాన్ని తప్పుదోవ వైపునకు నెడుతున్నాయి. పొరుగు దేశపు ప్రోత్సాహంతో అమాయక పౌరులను విచక్షణారహితంగా, అమానుషంగా చంపే ఉగ్రవాద శక్తులే మానవ హక్కులకు పెద్దచేటు. 

ఉగ్రవాదానికి దోహదం చేస్తున్న పరిస్థితులను మెరుగు పరచాలంటే.. కుల,మత, లింగ ప్రమేయం లేకుండా ముఖ్యంగా యువతకు, బడుగు బలహీన ప్రజలకు మౌలిక హక్కులను సమకూర్చాలి. ఆకలి లేని, విద్యా, వృత్తి, ఆరోగ్యం,సమాచారం హక్కులు అనుభవించినప్పుడే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ ఆశయ సాధన ఒంటరి కృషి వల్ల కాదు. అన్ని రాజ్యాల పరస్పర సహకారంతోనే సాధ్యమవుతుంది. 

నేను అర్థం చేసుకున్నట్టుగా.. ఈ శిఖరాగ్ర సమావేశంలో మనం మాట్లాడుతున్న అంశాన్ని మొత్తం మానవజాతి ఎదుర్కొంటున్న ఏకైక సమస్యగా అంగీకరించక పోవచ్చు. అయినా, ‘సాంస్కృతిక అంతరాలు’ అనే పెనుభూతం యావత్‌ ప్రపంచంలో ప్రమాదకరంగా పెరిగిపోతున్నది. ఇది ఉగ్రవాదానికి దారితీస్తున్నది. ఇది పొరుగు ప్రాంతాల నుంచి ఎగుమతి కావటంతో పాటు, శాంతి భద్రతలు, అభివృద్ధికి అంతరాయం కలిగిస్తుంది. పేదరిక నిర్మూలన, సామాజిక సమైక్యత వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించాలంటే, తగినన్ని ఆర్థిక వనరులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి. అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లకు రాయితీలు లేకుండా ఈ సమస్యను విశ్వసనీయంగా పరిష్కరించలేము. జాతీయ స్థాయిలో సంస్థల నిర్మాణం, విధానాల రూపకల్పన, వ్యూహాల రూపకల్పన అన్నింటికంటే ముఖ్యం. పేదల హక్కులను ఆమోదించడానికి అవసరమైన వనరులను సమీకరించేట్లు దేశాలు కట్టుబడి ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు సామాజిక అభివృద్ధికి చెందిన సమైక్యత అవసరం. అసమ్మతికున్న ప్రధాన కారణాలు వేర్వేరు దేశాలలో భిన్నంగా ఉండవచ్చు, కానీ ఈ రోజు ఏ సమాజమూ పూర్తిగా అభివృద్ధి చెందిందని, సమగ్రంగా ఉందని చెప్పుకోలేదు.

ఆర్ధికవ్యవస్థ మధ్యే మార్గం

ఈ రోజు ప్రపంచం ప్రచ్ఛన్నయుద్ధ వైఖరి నుంచి విముక్తి పొందడానికి కష్టపడుతున్న నేపథ్యంలో వివిధ దేశాలు ఒక దిక్కుతోచని కూడలి వద్ద ఉన్నాయి. ఎందుకంటే ఒక దిశగా.. ఆర్థిక వ్యవస్థ రాజ్య నియంత్రణలో నడిపిన పద్ధతి విజయవంతం కాలేదని తెలుసు. ఇంకొక దిశన మార్కెట్లను ఎటువంటి నియంత్రణ లేకుండా పూర్తి స్వేచ్చతో వదిలేస్తే ఉత్పత్తి, సంపద, అభివృద్ధి వాటంతటవే లభ్యమవుతాయి అంటున్న ధోరణి. ప్రయివేటీకరణ దిశగా కొత్త ఉత్సాహం ఈ మధ్యకాలంలో చెలరేగినప్పటికీ, ప్రజల సంక్షేమం కేవలం మార్కెట్‌కు వదిలేస్తే అసమానతలు పెరుగుతాయన్న అనుమానం ఉండనే ఉన్నది. అటు కేవలం మార్కెట్లు లేదా ఇటు రాజ్య కట్టుదిట్టాలు.. రెండూ సమస్యలతో కూడుకున్నవే. కనుక బీద బలహీన వర్గాలను కాపాడే మధ్యస్థమార్గంగా ‘మార్కెట్‌ను మించి’ అనే ఒక సరికొత్త పంథాని కనుక్కోవడం ఎంతైనా అవసరం.  తద్వారా ఇటు ప్రభుత్వం అటు మార్కెట్లు కూడా ప్రజలు కేంద్ర బిందువుగా ఉండే నమూనాను మనం ఎంచుకోగలుగుతాం. గత మూడున్నర సంవత్సరాలుగా, మేము మా ఆర్థిక, పారిశ్రామిక విధానంలో నిజమైన విప్లవాత్మక సంస్కరణలను ప్రారంభించాము. ఈ ప్రక్రియ మార్చలేనిది. జాతీయ ఏకాభిప్రాయం దీనికి మద్దతు ఇస్తున్నది.

ఆధునిక ఆర్థికాభివృద్ధి వల్ల, భూమి-వ్యవసాయం మీద వత్తిడి తగ్గవచ్చు. గత కొన్ని దశాబ్దాలుగా, పరిమిత భూ వనరులతో, గ్రామీణ శ్రామిక శక్తి సంఖ్య పెరిగి పోగా, గ్రామీణ వ్యవసాయ రంగం సాపేక్షంగా వృద్ధి చెందటం వల్ల చిన్న భూముల రైతులు ఎనలేని నష్టాలకు గురయ్యారు. భూమిలేని వ్యవసాయ అనుబంధ కార్మికులు  కూడా తీవ్రంగా దెబ్బతిన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో గ్రామీణ పేదరికానికి శాశ్వత పరిష్కారం వ్యవసాయ రంగంలో మాత్రమే లభించదని గ్రహించాలి. వ్యవసాయేతర కార్యకలాపాలను ప్రోత్సహించడానికి సమర్థవంతమైన విధానాలు కూడా అవసరం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార భద్రతకు వ్యవసాయ వృద్ధి చాలా అవసరం. అయినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర రంగాన్ని ఏక కాలంలో అభివృద్ధి చేయడం ద్వారా గ్రామీణ నిరుద్యోగం, రైతుల అల్పాదాయ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

ఆర్థిక సంస్కరణలు చేపట్టి పునర్నిర్మాణం సాగిస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. భారీ రుణం, ద్రవ్యోల్బణం, దిగజారుతున్న వాణిజ్య నిబంధనలు, తక్కువ వ్యవసాయ వృద్ధి మొదలైనవి తీవ్రతరం అవుతున్నాయి. బాహ్య వనరుల నుంచి మరింత ఆహార సహాయాన్ని అందించడం, జాతీయ ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, ఆదాయ బదిలీల్లో పెంపు, సామాజిక పెట్టుబడుల ద్వారా ప్రత్యేక జోక్యం మొదలైన చర్యలు అవసరం. ఇటువంటి సర్దుబాట్లతో ఈ దేశాల సమస్యలను తగ్గించడానికి వీలవుతుంది. ప్రస్తుతం భారత దేశంలో మేము నిత్యం అనేక రకాల సమస్యలపై పోరాడుతున్నాం. మేం వాటిని అధిగమించ గలుగుతామని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. సమస్యలు నిజంగా క్లిష్టమైనవే. కాని దీనికి కుటుంబ స్థాయి, గ్రామ స్థాయికి తగినట్లుగా సూక్ష్మ ప్రణాళికలతో పరిష్కరించుకోవాలనేది మా ప్రయత్నం. ఈ బృహత్‌ ప్రయత్నంలో ఆర్థిక, సామాజిక ఖర్చులను తగ్గించడానికి భారత దేశం సర్దుబాటు ప్రక్రియను చేపట్టవచ్చు. ఈ ప్రయత్నాలకు అంతర్జాతీయ సమా జం  పూర్తిగా మద్దతు ఇవ్వాలి. 

(చివరి భాగం వచ్చే సోమవారం )

నిర్దిష్ట గడువులోగా నిరాయుధీకరణ


నిరాయుధీకరణకు అన్ని దేశాలు చిత్తశుద్ధితో, నిబద్ధతతో కృషి చేస్తే.. చివరికి అణ్వాయుధాల  బారినుంచి బయటపడి అహింసాయుత ప్రపంచానికి నాందిపలికే అవకాశం దొరుకుతుంది. అణ్వాయుధాల వాడకాన్ని అరికట్టడానికి, సర్వ సమ్మతితో సమగ్రమైన, సార్వత్రికమైన వివక్ష చూపని ‘అణుపరీక్ష నిషేధ ఒప్పందా’న్ని ఖరారు చేయడానికి భారతదేశం తన ఇంతకు ముందున్న ప్రణాళికలో కొన్ని మార్పులు చేయడానికి సుముఖంగా ఉంది. వాస్తవానికి, భారతదేశ కార్యాచరణ ప్రణాళికకు మించి ముందుకు పోవాలి. అణ్వాయుధ రహిత ప్రపంచానికి ఒక నిర్దిష్టమైన గడువును, ప్రస్తుత శతాబ్దం ముగింపులోగా, నిర్ణయించడానికి నడుముకట్టాలని నేను సూచిస్తున్నాను. ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రవేశించాలనే ఆశాజనకమైన గమనిక ఇది.

అంతర్జాతీయ భద్రతకు మరో ప్రమాదం ముంచుకొచ్చింది. అణ్వాయుధాలపై మనం నియంత్రణ కోల్పో యే అవకాశం ఉంది. అణ్వాయుధాలను తయారు చేయగల సాంకేతిక పాటవం కలిగినది అతికొద్ది దేశాలు  మాత్రమేకాదు, ప్రపంచవ్యాప్తంగా రెడీమేడ్‌ అణ్వాయుధాలు వివిధ పద్ధతుల ద్వారా, నియంత్రణ లేకుండా  వ్యాప్తి చెందడం సమస్యగా మారింది. ఈ వైపరీత్యాన్ని ఎలా అరికట్టాలన్న దాని మీద సమగ్రమైన చర్చ జరగాలి. అంతర్జాతీయంగా  సమర్థవంతమైన రీతిలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.  కాలం మించిపోక ముందరే మేలుకోవడం అత్యంతావశ్యకమని నా గట్టి నమ్మకం. 

ప్యారిస్‌ ‘యునెస్కో’ సభలో ప్రసంగం..

ప్రపంచ శాంతిని ప్రోత్సహించడానికి యునెస్కో అంకితమై ఉన్నందున, సార్వత్రిక అణ్వస్త్ర నిరాయుధీకరణ కోసం గాంధేయ ప్రతిపాదన రూపురేఖలను పునరుద్ఘాటిస్తున్నాను. మహాత్మాగాంధీ వారసులుగా, విశ్వవ్యాప్త అణ్వాయుధ నిరాయుధీకరణ కోసం నా ప్రతిపాదనను గాంధీ వారసుల ఆత్మలో చూస్తాము. అదే విధంగా మనం రాబో యే తరాలకు ప్రపంచాన్ని సురక్షితమైన ప్రదేశంగా మార్చగల కొలమానంగా దీనిని చూడాలి. నిర్దేశించిన కాలపరిమితిలో అన్నిరకాల అణ్వాయుధాలను పూర్తిగా తొలగించడానికి విశ్వసనీయ చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయంలో 1988లో భారతదేశం సమర్పించిన కార్యాచరణ ప్రణాళిక తగిన ప్రారంభ బిందువుగా ఉపయోగపడుతుంది. భారతదేశం దీనిని గాంధేయ సూత్రాలచే ప్రేరేపించబడిన ప్రతిపాదనగా చూస్తుంది. అలాగే దానికి పూర్తిగా కట్టుబడి ఉంటుంది. 


logo