మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Editorial - Aug 02, 2020 , 23:32:49

సవాలుకు సిద్ధమన్న కరసేవకులు

సవాలుకు సిద్ధమన్న కరసేవకులు

  • ఆరో అధ్యాయం కొనసాగింపు..

సాధువులు పర్వదినాలలో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎప్పుడూ వ్యతిరేకమే. ఆ  పర్వదినాలే అయోధ్యలో సాధువులకు మరికొందరకు భక్తిని సమకూర్చుకొనేందుకు ప్రధాన వనరులు.  అటువంటి సందర్భాల్లో అశాంతి భవిష్యత్‌ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది.  ఎలాగయితేనేం కరసేవ ముహూర్తం విషయంలో భేదాభిప్రాయాలు హరిద్వార్‌లో 1990 జూన్‌ 23, 24 తేదీల్లో జరిగిన సాధుసమ్మేళన్‌లో ఓ కొలిక్కి వచ్చాయి. దేవోస్థని ఏకాదశి (అక్టోబర్‌ 30) నుంచి కరసేవ ప్రారంభించాలనే నిర్ణయం గైకొన్నారు. 

హరిద్వార్‌ సమ్మేళనం:  వీహెచ్‌పీ ప్రధాన వ్యూహం ఆందోళనల సందర్భంగా సాధువులను అగ్రభాగాన ఉంచటం. అయితే హరిద్వార్‌ సమ్మేళనంలో పరిశీలకులు చెప్పినదాని ప్రకారం శంకరాచార్య, స్వరూపానంద వీహెచ్‌పీ మాట వినటం లేదు. కనుకనే ఒక్క ప్రముఖ సాధువు కూడా వారణాసి నుంచి ఆ సమ్మేళనానికి హాజరుకాలేదు. అదే విధంగా ప్రయాగ (అలహాబాద్‌)నుంచి శంకరాచార్య, వాసుదేవానంద్‌, సామి రామ్‌దత్‌, శివగోపాల్‌జీలు మాత్రమే పాల్గొన్నారు. హరిద్వార్‌ సమ్మేళనానికి ముందునుంచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  వీహెచ్‌పీ కార్యక్రమాన్ని అణచివేయాలని నిర్ణయించుకున్నాయి. కేంద్రం ములాయంసింగ్‌ యాదవ్‌కు పచ్చజెండా చూపింది. హరిద్వార్‌ సమ్మేళనంలో మందిర నిర్మాణ పథకాన్ని ఆగస్టు మొదటి తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. అది బృందావన్‌(మధుర)లో సంత్‌ సంకల్ప దివస్‌గా పాటించే రోజు. వీహెచ్‌పీ కేంద్ర, రాష్ట్రస్థాయిల్లో నిర్వహించే కార్యక్రమాలను వేర్వేరుగా రూపొందించింది. ‘ప్రభుత్వం రామమందిర నిర్మాణాన్ని అనుమతించినా, అనుమతించకున్నా నేషనల్‌ఫ్రంట్‌ ప్రభుత్వానికి బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకోబోదు’ అంటూ కొందరు బీజేపీ నాయకులు చేసిన ప్రకటనలు వీహెచ్‌పీ వర్గాల్లో కొంత అసంతృప్తికి కారణమయ్యాయి. వీహెచ్‌పీ నాయకులు వాళ్ల అసంతృప్తిని అప్పటి ఆరెస్సెస్‌ అధినేత బాలా సాహెబ్‌ దేవరస్‌ ముందు వెల్లడించగా, ఆయన ఆ విషయంలో ఎల్‌.కె. అద్వానీ నుంచి వివరణ కోరారు. బీజేపీ తప్పక ఆరెస్సెస్‌ అధినేత మాటకు కట్టుబడి ఉంటుందని అద్వానీ తెలియజేశారు. వీహెచ్‌పీ నిర్ణయం ప్రకారం, మందిర నిర్మాణం వివాద స్థలంలో 1990 అక్టోబర్‌ 30 నుంచి ప్రారంభించే విషయంలో తమ పార్టీ ఏరకమైన ఆందోళనలోనైనా పాల్గొంటుందనీ, వీహెచ్‌పీ పథకాన్ని అడ్డుకొనే ప్రయత్నం జరిగితే దేశంలో అంతకు ముందు చూడనటువంటి ఘనాతిఘనమైన ప్రజాఉద్యమంగా వృద్ధి చెందగలదని ఎల్‌.కె. అద్వానీ ఆరెస్సెస్‌ హిందీ పక్ష పత్రిక ‘పాంచజన్య’ జూన్‌ 28 సంచికలో వీపీ సింగ్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించటం జరిగింది. 

మొత్తం సంఘ్‌ పరివార్‌ మొదటిసారిగా  వీహెచ్‌పీ ‘కరసేవ’ పథకానికి దన్నుగా నిల్చింది. ములాయంసింగ్‌ యాదవ్‌ విసిరిన సవాలును స్వీకరించేందుకు నిర్ణయించుకున్నారు. పరిపాలనా వ్యవస్థలోనూ, ప్రసార మాధ్యమంలోనూ మిగతా జీవన పరిధుల్లోనూ ఉన్న ఆరెస్సెస్‌ వాళ్లందర్నీ ఈ పోరాటంలో కీలకపాత్ర పోషించవలసిందిగా మొట్టమొదటిసారిగా కోరటం జరిగింది.  వీహెచ్‌పీ ఎత్తుగడను భగ్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అయోధ్యలోకి వీహెచ్‌పీ క్రియాశీల కార్యకర్తల ప్రవేశాన్ని నిరోధించటం అనేది ఆ చర్యల్లో ఒకటి. గతంలో ఇది రెండు పర్యాయాలు పరీక్షకు గురయ్యింది. ఒక పర్యాయం- శంకరాచార్య, స్వరూపానంద శిలాన్యాస్‌ పిలుపు సందర్భంగా. రెండవది- మహేంద్రసింగ్‌ తికాయత్‌ లక్నోలో ‘పంచాయత్‌' నిర్వహించే ప్రయత్నం చేసినప్పుడు. 

మందిర నిర్మాణంలో తమ తన్‌(శరీరం), మన్‌ (మనస్సు), ధన్‌ (సంపద) అంతా కూడ అర్పించగలమని ఆగస్టు 1న వీహెచ్‌పీకి చెందిన సాధువులు శపథం పూనారు. ఆగస్టు మాసంలో దేశమంతటా శ్రీరామ్‌ కరసేవా సమితుల్ని వీహెచ్‌పీ ఏర్పాటు చేసింది. 1990 ఆగస్టు 13న ఎల్‌.కె. అద్వానీ అయోధ్యపై పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఒక ప్రతిపాదన చేశారు. ముస్లిములు గనుక స్వచ్ఛందంగా అయోధ్యలోని తీర్థంపై తమ హక్కుల్ని వదులుకొని మందిర నిర్మాణాన్ని కొనసాగనిస్తే, ఆయన వీహెచ్‌పీ వెంటబడి కాశీ, మధురల్లో వాళ్ల పథకాలు రద్దు చేసుకునేట్లు చూస్తామన్నారు. అయితే ఈ ప్రతిపాదనను స్వీకరించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ లోగా ధర్మయాత్రలకు, కాషాయరంగు జెండా ప్రతిష్ఠాపనలకు, శంఖం పూరించే కార్యక్రమాలు వగైరాలకు స్పందన స్వల్పంగా ఉంది. 

అదేవిధంగా హుటాహుటిన, ఆశ్చర్యజనకంగా వీహెచ్‌పీ రామజ్యోతి యాత్రను రహస్యంగా అయోధ్య నుంచి సెప్టెంబర్‌ 1నుంచి ప్రారంభించింది- అదీ అనుకున్నదానికంటే 18 రోజులు ముందుగా. ఇదంతా నిషేధాన్నో, నిరోధక చర్యల్నో తప్పించుకునేందుకే. చందనం, రావిముక్కల రాపిడితో నిప్పుపుట్టించి ఏడు జ్యోతులను వెలిగించారు. రెంటిని అయోధ్యలోనే ఉంచారు.  మిగతా ఐదింటిని బజ్‌రంగ్‌దళ్‌, వీహెచ్‌పీ నాయకులు కాశీ, మధుర, అలహాబాద్‌, లక్నో, గోరఖ్‌పూర్‌లకు తీసుకుపోయారు. 

మొదట అనుకున్న ప్రకారం.. రామజ్యోతి యాత్రలు అయోధ్యనుంచి సెప్టెంబర్‌ 19న ప్రారంభం కావలసి ఉంది. ఇటువంటి మార్పుకు పాలనా యంత్రాంగం విస్తుబోయింది. సంఘపరివార్‌ మున్ముందుకూడా ఇటువంటి ఎత్తుగడలకే పాల్పడవచ్చునని భావించింది. ఫజియాబాద్‌కు చుటుపక్కల జిల్లాలకు వాళ్ల క్రియాశీల కార్యకర్తల్ని పంపితే, అక్కడ నుంచి వాళ్లు సునాయసంగా చొరబడి రావచ్చని వీహెచ్‌పీ నాయకత్వం అలా నిర్ణయించింది. చిత్రమైన వైరుధ్యమేమంటే ఇటు ప్రభుత్వమూ, అటు వీహెచ్‌పీ ఒకళ్లనొకళ్లు బుకాయించుకుంటూండగా వీపీ సింగ్‌ మాత్రం సామరస్యపూర్వక పరిష్కారాన్ని ఆశిస్తూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. మంత్రి సుబోధ్‌కాంత్‌ సహాయ్‌ వరుసగా అనేక సమావేశాలు నిర్వహించటం జరిగిందిగాని ఫలితం మాత్రం కన్పించినట్లు లేదు. 

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)logo