శనివారం 08 ఆగస్టు 2020
Editorial - Aug 02, 2020 , 00:00:19

ఆ ఆరు ప్రశ్నలకు జవాబే భాగవతం!

ఆ ఆరు ప్రశ్నలకు జవాబే భాగవతం!

శౌనకాది ఋషులు సూతుని- జీవులకు శాశ్వత కళ్యాణ సాధనమేదో చెప్పమన్నారు. శాస్త్రసారం తెల్పమన్నారు. అవతార ప్రయోజనమేమిటో, అవతారాలు ఎన్నో వివరించమన్నారు. భగవంతుని ఉదార, ఉదాత్త కర్మలను వర్ణించమన్నారు. కృష్ణుడు నిర్యాణం చెందగా ధర్మానికి దిక్కెవరయ్యారో తెల్పమన్నారు. ఋషుల ఈ ఆరు ప్రశ్నలకు సమాధానమే పన్నెండు స్కంధాల భాగవతం. 

ఆ. నలిన నయన భక్తినావచే గాక సం

సార జలధి దాటి చనగ రాదు;

వేయునేల! మాకు విష్ణు ప్రభావంబు

దెలుపవయ్య సూత! ధీసమేత!

శౌనకాది మహర్షులన్నారు- ‘సూత; ధీసమేతా! భక్తి అనే నావతో కాకుండా భవసాగరాన్ని మరోలా ఎలా దాటిపోగలరు. ఇన్ని వేల మాటలెందుకు? మాకు వెన్ను (విష్ణు)ని మహిమ వివరించి చెప్పు?’ బండి లాగేవాడు భగవంతుడు! ‘కైవర్తకః కేశవః’- పడవ నడిపేవాడు పరమాత్మ! శ్రోత్రాలతో శ్రవణం, వాక్కుతో కీర్తనం, మనసుతో మననం- ఇది మహాభారతం! ఉగ్రశ్రవ సూతుని తండ్రి రోమహర్హణుడు. పురాణ, ఇతిహాస, ధర్మశాస్త్రఙ్మయ ప్రచారకుడు. పౌరాణిక సంప్రదాయాన్ని వెలుగులోకి తెచ్చిన ఆది పౌరాణికుడు. వ్యాస భగవానుని ప్రత్యక్ష శిష్యులలో ఒకడు. వ్యాసుడు ప్రవచిస్తుంటే వింటూ భక్తితో తన్మయత్వం చెంది పులకించిపోయే మహాభాగవతుడు. రోమహర్హణమంటే రోమాంచం- గగుర్పాటు. ఆయన పురాణం చెప్తుంటే వినే శ్రోతలకు కూడా రోమాంచం- పులకరింత కలిగేది. అందుకే ‘రోమహర్షణుడు’ అన్న సార్థక నామం. ఉగ్రశ్రవ సూతుడు కూడా తండ్రికి తగ్గ తనయుడు. ఉగ్ర- తీక్షణమైన, శ్రవస్‌- విజ్ఞానం, ప్రజ్ఞాపాటవం కల్గినవాడు. మరో విధంగా, ఉగ్ర- భగవంతుని గురించి, శ్రవ- భయంకరంగా శ్రవణం చేసి విన్నదాన్ని ధారణ చేసిన ధీశాలి సూతుడు. ‘సూతాః పౌరాణికాః ప్రోక్తాః’- సూతులు అంటే పురాణం చెప్పేవారు. సూతుని, నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుడని (సమస్త పురాణాలను తీర్పుగా వివరించగల నేర్పుగలవాడు) పోతన కీర్తించాడు. ‘సువతి ప్రేరయతి శుభే కర్మణి లోకాన్‌ ఇతి సూతః’- తన ప్రవచనాలతో ప్రజలకు శుభకర్మలు ఆచరించాలనే ప్రేరణ కల్గిస్తాడు కనుక సూతుడు. సూతుడు ముందుగా భాగవత ఆచార్యుడైన శుకమహర్షికి వందనం చేశాడు. ‘శోచయతి హరి విముఖాన్‌ నిజశాస్త్ర శ్రవణేన ఇతి శుకః’- ప్రపంచానికి సుముఖులై పరమాత్మకు విముఖులైన శ్రోతలలో- నా జీవితం ఈ క్షణం వరకు భగవద్‌ వీక్షణం లేక వ్యర్థంగా గడిచిపోయింది కదా! అనే పశ్చాత్తాపంతో కూడిన శోకాన్ని మేల్కొలిపి, వారి శుష్క హృదయాలను పుష్కల భక్తి రసాప్లావితం చేసేవాడు శుకుడు. శుకముని కృప ఉంటేనే భాగవతం భాగవతం అవుతుంది.

‘భాగవత ప్రతిపాద్య దేవత అయిన నారాయణునికి, నర ఋషికి, వాగ్దేవి సరస్వతికి, పురాణ కర్త వ్యాసదేవునికి నమస్కరించి భక్తుల భవ బంధాలను భగ్నం చేసే భాగవత మహా పురాణాన్ని ప్రవచిస్తాను’ అంటూ దేవతాగురు వందనం చేశాడు సూతుడు. మూలంలో- ‘తతో జయముదీరయేత్‌' అని ఉండగా పోతన ‘జయతి అనేన సంసార మితి జయో గ్రంథః’ (ఈ గ్రంథాన్ని ఆశ్రయిస్తే సంసారాన్ని అనగా అవిద్యను సులభంగా జయింపవచ్చు) అన్న శ్రీధర పండితుని వ్యాఖ్యానం అనుసరించి ‘ఉదార గ్రంథంబు దళిత తను బంధంబున్‌' అని పఠితులకు ప్రేరణాస్పదంగా చక్కని అవగాహనతో కూడిన అనువాదం అనుగ్రహించాడు. ‘నారాయణం నరం చైవ సత్యమేకం ద్విధాస్ధితం’- ఒకే సత్‌ తత్తం నర, నారాయణులుగా రెండుగా భాసిస్తోంది అని మహాభారతం. నారాయణుడు వాచ్యం- నామి. భాగవతం వాచకం- నామం. వ్యాసుడు వక్త. వాణి వక్తృత్వ విభూతి. నారాయణుడు పరబ్రహ్మ. నరుడు జీవుడు. సరస్వతి బ్రహ్మవిద్య. వ్యాసుడు గురువు. ప్రతి పౌరాణికుడు పురాణ ప్రారంభంలో ఈ శ్లోకం- ‘నారాయణం నమస్కృత్య నరంచైవి నరోత్తమం, దైవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్‌' పఠించిన తర్వాతే ప్రవచనం ప్రారంభించాలన్న విధి సూచించారు.

భాగవత పురాణం భూమి మీద అవతరించడానికి కారణభూతుడైన పరీక్షిత్తు రంగప్రవేశానికి దోహదం చేస్తూ భాగవత ప్రథమ స్కంధంలో పాండవుల చరిత్ర సంక్షేపంగా చెప్పాల్సిన అవసరం కలిగింది. పాంచాలి పరీక్షిత్తు తండ్రికి పెత్తల్లి. ఆమె సంతానమే అయిదుగురు ఉపపాండవులు. నిద్రాసక్తులైన వారందరినీ అర్ధరాత్రి వేళ అశ్వత్థామ అంతం చేస్తాడు. తనయుల చావు కబురు విని తల్లి ద్రౌపది తల్లడిల్లిపోతుంది. కృష్ణార్జునులు ఆ క్రూరకర్ముని బంధించి తెచ్చి శిబిరంలో ద్రౌపది ముందు పడేస్తారు. సంస్కృతంలో కథనాత్మకం (నెరేటివ్‌)గా ఉన్న ఈ ఘట్టాన్ని పోతన, తిక్కన అడుగుజాడల్లో ఎంతో నాటకీయంగా (డ్రమటిక్‌)గా తీర్చిదిద్ది రసభరితం చేశాడు. బాలలను వధించినందుకు సిగ్గుతో తలదించుకుని ఉన్నాడు అశ్వత్థామ. స్త్రీజాతికి పుత్ర మరణం, వైధవ్య ప్రాప్తిని మించిన శోకం ఏముంటుంది? అంతటి ఆపదలో కూడా ఆదర్శ మాతృమూర్తిగా ద్రౌపది చూపిన ఔదార్యం, కారుణ్యం, ఆమె ఆడిన మాటలు మానవ చరిత్రలోనే ఆపూర్వాలు, అనితర సాధ్యాలు, అసదృశ శిలాక్షరాలు. ఆ సాధ్వీమణి మానసిక సమతౌల్యం (బ్యాలెన్స్‌)- మనో నిబ్బరం ఊహాతీతం! ఆడవాళ్లని కూడా ఆకర్షించి అలరించే అందం పాంచాలిది. బాహ్య సౌందర్యాన్ని మించిన అంతర సౌందర్య ఆమెది. వేదవ్యాసుడే విస్మయ విముగ్ధుడై ‘వామ స్వభావా కృపయా ననామ’ (చక్కని శీల స్వభావాలు కలిగిన ద్రౌపది దయతో నమస్కరించింది) అని పలికాడు. ‘ఒక దేశంలోని స్త్రీలు ఎలాంటివారో చెప్పితే ఆ దేశం ఎలా ఉంటుందో నేను చెబుతాను’ అని పైథాగరస్‌ పసిడి పలుకులు! బద్ధుడై ఉన్న బ్రాహ్మణాధముడు ద్రౌణి (ద్రోణ పుత్రుడు)కి ద్రౌపది నమస్కరించి ఇలా అంది- ‘నాయనా! జగత ప్రసిద్ధులైన మా మగవారు (పాండవులు) మీ తండ్రి వద్దనే ధనుర్విద్య అభ్యసించారు. ‘పుత్త్రాకృతినున్న ద్రోణుడవు’- ‘ఆత్మావై పుత్త్రనామాసి’ అను శ్రుతని అనుసరించి ద్రోణ పుత్రుడవైన నీవూ ద్రోణుడవే! ఉపపాండవులు నీ శిష్యుల బిడ్డలు. ‘కరుణా సంగమ లేక... ఖండింపగా బాడియే?’- కించిత్తు కూడా కనికరం లేకుండా వారిని కడతేర్చావు. ఇది నీకు ధర్మమా?

క. భూసురుడవు బుద్ధిదయా

భాసురుడవు శుద్ధ వీర భట సందోహా

గ్రేసరుడవు శిశుమారణ

మాసుర కృత్యంబు ధర్మమగునే తండ్రీ.

తండ్రీ! బ్రాహ్మణుడవే! విజ్ఞాన వివేకాలతో, దయా దాక్షిణ్యాలతో వెలిగేవాడవే! వీరాధివీరుల్లో విఖ్యాతుడవే! శిశుమారణం నిశిచరుల నైజం కదా! నీకు తగునా? ఉద్రేకంతో యుద్ధంలో నిన్నెదిరించి నిల్చినవారు కారే! నీకేమాత్రం ద్రోహం చెయ్యనివారే! నీవలె ప్రౌఢ పరాక్రమమున్నవారు కారే! ఆదమరచి నిద్రిస్తున్న నా సుందర సుకుమార కుమార రత్నాలను నిశిరాత్రిలో- ‘సంహరింప నకటా! నీ చేతులెట్లాడెనో?’ చంపడానికి నీకు చేతులెలా వచ్చాయయ్యా! పుత్రశోకంతో నేను కుమిలిపోతున్నట్లే నిన్నిచ్చటికి బంధించి తెచ్చిన సంగతి తెలిసి నీ తల్లి కృపి (గౌతమి) ఎంత తల్లడిల్లిపోతోందో కదా!- ఇలా అశ్వత్థామతో పలికి కృష్ణ (ద్రౌపది) కృష్ణార్జునులను చూసి  ఇలా అభ్యర్థించింది-

క. ‘నారాయణునకు నరునకు భారతికిని మ్రొక్కి వ్యాస పదములకు నమ

స్కారము సేసి వచింతు ను దార గ్రంథంబు దళిత తను బంధంబున్‌'

గురుపత్ని గౌతమి భర్తతో సహగమనం చెయ్యక బిడ్డ అశ్వత్థామ కోసం బతికే ఉంది. నాకు బిడ్డలు పోయినా భర్తలున్నారు. ఈ అశ్వత్థామ పోతే గౌతమికి ఏమిటి గతి? గురుపత్నికి గర్భశోకం కలిగించరాదు. నాలాగా ఆమె ఏడవరాదు. ‘ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్‌'- తనకు ప్రతికూలమైన దానిని ఇతరుల పట్ల ఆచరించకుండా ఉండటమే ధర్మసారం! 

‘అశ్వత్థామా హతః కుంజరః’- అని ధర్మాభాసతో గురువధకు కారణమయ్యారు. ఇప్పుడైనా గురుపుత్రుని చంపక విడిచిపెట్టి పాపదూరులు కండి అని ధ్వని! ఈ ఘట్టంలో ఆది నుంచి ద్రౌపది ద్రౌణిలోద్రోణునే చూసింది. ప్రధానంగా పై పద్యంలో పాంచాలికి ద్రౌణి కనుమరుగు కాగా ద్రోణునే స్మరించి దర్శించింది. ఇలా ద్రౌపది ధర్మంగా దాక్షిణ్యంగా, నిష్కపటంగా, నిష్పక్షపాతంగా పలికినందుకు భీముడు తప్ప అందరూ సంతోషించి ప్రశంసించారు. భీముడు ఉగ్రుడై ‘ఈ ద్రౌపది వెర్రిది, నేనే ఒక పిడిగుద్దుతో వీణ్ణి పైకి పంపిస్తా’ అంటూ అశ్వత్థామ మీదికి ఉరకగా చక్రధారి చతుర్భుజుడై రెండు చేతులతో భీముని వారించి, మరి రెండు చేతులతో పాంచాలిని పక్కకు ఒత్తిగించాడు.

ఉ.‘ద్రోణునితో శిఖింబడక ద్రోణ కుటుంబిని యున్న దింట న

క్షీణ తనూజ శోక వివశీకృతనై విలపించు భంగి, నీ

ద్రౌణి దెరల్చి తెచ్చుటకు దైన్యము నొందుచు నెంత పొక్కునో

ప్రాణ విముక్తుడైన నతి పాపము బ్రాహ్మణ హింస మానరే.’

logo