శనివారం 08 ఆగస్టు 2020
Editorial - Aug 02, 2020 , 00:00:18

కాకతీయుల సూపర్‌మార్కెట్‌

కాకతీయుల సూపర్‌మార్కెట్‌

తెలంగాణ గడ్డను పాలించిన వీరులు, శూరులైన చక్రవర్తులు కాకతీయులు. సుభిక్షమైన నీటి వనరులు, సుస్థిరమైన పాలనను అందించిన సమర్థులు. సాహిత్యం, సంస్కృతి, కళారంగాలు, శిల్పనిర్మాణం...  అన్నింటా కాకతీయుల ముద్ర గమనించవచ్చు. ఆర్థిక పరంగా కూడా వ్యవసాయ రంగానికి విశేష తోడ్పాటును అందించారు. ఆ క్రమంలో దేశీ, విదేశీ వ్యాపారం వృద్ధి చెందింది. వస్తువుల విక్రయం, వాటి ధరల నిర్ణయానికి ఒక క్రమబద్ధ్దమైన వ్యవస్థను, ధర్మబద్ధంగా పన్నులను నిర్ణయించారు.

పన్నులు విధించి, వాటిని ప్రజోపయోగాలకు, దేవాలయాల నిర్వహణకు, విద్యాకేంద్రాలకు వినియోగించేవారు. అలా పన్నుల నిర్ధారణకు సంబంధించిన శాసనమే ఓరుగల్లు కోటలో ఉంది. ఇది హనుమకొండ శాసనంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ శాసనాన్ని కాకతి గణపతిదేవ చక్రవర్తి కాలంలో వేయించారు. శాసనకాలం సర్వధారి సంవత్సరం శ్రావణ శుద్ధ పంచమి (క్రీ.శ. 1228 జులై 17). వీరభద్రేశ్వర స్వామి అంగరంగ భోగాల కోసం... స్వదేశీ, విదేశీ వర్తకులు ఏఏ వస్తువుల మీద ఎంతమేరకు పన్ను చెల్లించాలో తెలియచేసే శాసనమిది. ఆధునిక షాపింగ్‌ మాల్స్‌కు దీటుగా కాకతీయుల కాలంలో కూడా... అన్నిరకాల వస్తువుల అమ్మకాలు ఒకేచోట జరిగేవి. మఠియ అంటే మార్కెట్‌ అని అనేవారని, అన్నిరకాల వస్తువులు లభించే మార్కెట్లు ఉంటం వల్ల అది మఠియవాడ - మట్టెవాడగా పిలవబడిందని పి.వి.పరబ్రహ్మశాస్త్రి అభిప్రాయం.

చీర మఠియ అంటే చీరలు అమ్మే మార్కెట్‌లో చీరలు అమ్మగా వచ్చిన సొమ్ములో ప్రతి మాడకు ఒక వీస చెల్లించాలని ఉంది. నీలిమందు అమ్మేచోట మాడకు రెండు వీసాలు, పోకమఠియలో లక్షకు పాతికవేల పోకలు, ప్రతి కూరగాయల బండిలో నాలుగో వంతు (పాతిక); కొబ్బరికాయలు, మాదీఫలము (మాడుపలపుకాయ), రేగుపండ్లు, మామిడి పండు, చింతపండు వంటి ఫలజాతులన్నింటికి బండికి పాతిక, ఊరగాయ బండ్లలో బండికి పాతిక భాగం ఇవ్వాలన్నారు.

ధాన్యపు మార్కెట్‌లో నువ్వులు, గోధుమలు, పెసలు, వడ్లు, జొన్నలు మొదలైన వాటికి ప్రతి బండికి మానెడు; నూనె, నెయ్యిలందు బండికి మానెడు; ఉప్పు వ్యాపారులు ఉప్పు మార్కెట్లో బండికి మానెడు; నూనె వ్యాపారులు ఇచ్చిన ఆదాయం ప్రతిరోజు బూఱ (ఒక ప్రమాణం), మట్టెవాడలోని అశేష నకరంవారు (వ్యాపారస్తులు) గడియారం నిర్వహించడానికి ప్రతి ఇంటికి పాతిక (1/4) బియ్యం ఇవ్వాలని సూచన చేశారు. ప్రతిరోజు స్వామి ఉపహారానికి సంతలోని ప్రతి షాపులో అమ్మే బియ్యంలో బుఱెడు!

వెదురు మొదలైన గంధ్య భండాలలో మాడలో పాతిక(1/4); ఆవాలు, మిరియాలు, తేనె, కానుగ నూనె మొదలైన కొల భండాలలో మాడకు పాతిక; తగరంవారు, మూసలవారు (లోహాలను కరిగించేవారు) ఇచ్చిన ఆదాయంలో... సీసం, రాగి మొదలైన లోహాల్లో తులానికి 1 పలమెడు (రెండు కరములు), చందనం తులానికి పలమెడు, కర్పూరం వీసెకు రెండు చిన్నాలు, జవ్వాది మాడకు పెరుక (1/8), కస్తూరి నూరు విణ్ణాలకు రెండు సిన్నాలు, పట్టు నూలునందు ప్రతి తులానికి 1 చిన్నము, చవరాలు (సవరము) తులానికి 1 చిన్నము, మంజిష్ట మాడకు అరవీస, దంతము, దాసూరి పట్టు, పచ్చపట్టులందు పాతిక (1/4), పగడమునందు వీసకు చిన్నము, ముత్యము, రుద్రాక్ష, రాజు మొదలైన మణి భండాలలో వాటికి మాడకు వీసము ఇచ్చునట్లు ఉంది. ఉభయ నానాదేశివారు పసుపు, ఉల్లి, అల్లం, కంద, పెండలం వంటివాటిలో మాడకు రెండు వీసాలు, నూలు వస్ర్తాల్లో పాతిక (1/4), ప్రతి వంద మంచాలకు 1 చిన్నము, 100 పసుపు పెట్టలకు 1 చిన్నముగా నిర్ణయించారు.

పై అంశాలన్నీ గమనిస్తే మనం నిత్యం వాడుకునే ఆహార పదార్థాలతో పాటు సౌందర్య సాధనాలు, చలి నుండి కాపాడే నూలు వస్ర్తాలు కూడా చాలానే వాడుకలో ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాక సమయాన్ని తెలిపే గడియారం ఉండేదని, అది సక్రమంగా నడవడానికి, దాన్ని నిర్వహించడానికి కూడా కొంత పైకం చెల్లించేవారనీ తెలుస్తుంది.

- డా. భిన్నూరి మనోహరి, 9347971177


logo