శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Aug 02, 2020 , 00:00:17

ఆసు

ఆసు

సూర్యుని చుట్టు భూమి తిరిగినట్టు పోగొక్కటి ఒంటరిగా ఆసు చుట్టే తిరుగుతుంటుంది 

కళ్లతో పాటుచేతుల్ని కూడా పోగు చుట్టూ తిప్పాలి

ఏ వస్త్రమైనా అవ్వ మునివేళ్లలోనే పురుడుపోసుకుంటుంది

ఊచ నుండి దారాన్ని పీల్చడమంటే

దేహం నుండి ప్రాణవాయువును త్యాగం చేయడమే

నాగలి లేనిదే పంటను తీయలేనట్లు

ఆసు లేనిదే బట్టను నేయలేం

చీర నేర్చిన ఊసులన్నీ

నునుగారంగా ఆసు నేర్పినవే

నైపుణ్యమంతా

ఆసు పోయడంలోనే వుంది

ఒక్క పోగు లెక్క తప్పినా

మగ్గం మూగనోము పడుతుంది

ఆసును అమ్మేసి

మగ్గాన్ని అటకెక్కించి

మరయంత్రాల కాబూసులో

చిక్కుకుపోయిన అన్న

అస్థిపంజరమై తేలి

శ్వాస కోసం తన్లాడుతున్నాడు

వైరస్‌తో ఊపిరితిత్తులు దెబ్బతిన్న

పవర్‌లూం కూడా

నోరు మూసుకొని

ముడుచుకు పడుకుంది

ఇప్పుడు ఆసు మౌనంగా

అశ్రువులను కారుస్తోంది

(ఆగస్టు 7, జాతీయ చేనేత దినోత్సవం)

-డా॥ వెల్దండి శ్రీధర్‌, 9866977741


logo